చేతితో లాగే రిక్షాలు వెళ్ళేందుకు మాత్రమే సరిపోయినంత స్థలం ఉండే ఉత్తర కొల్‌కతాలోని కుమార్టులి ఇరుకైన సందులలో, సాధారణంగా మీరు కలుసుకోగలిగే వ్యక్తులు కుమొర్లు (కుమ్మరులు) - నగరంలో విగ్రహాలను తయారుచేసేవారు - మాత్రమే అయుంటారు. దుర్గాదేవి, ఇంకా ఇతర దేవతల విగ్రహాలు ప్రతి సంవత్సరం ఇక్కడి నుండే కొల్కతా నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంటాయి.
కార్తిక్ పాల్‌కు ఇక్కడ ఒక కార్యశాల ఉంది. తన తండ్రిగారి పేరున 'బ్రజేశ్వర్ అండ్ సన్స్' అనే పేరున్న ఈ షెడ్డు వెదురుతోనూ, ప్లాస్టిక్ పట్టాలతోనూ కట్టినది. అతను మాకు దీర్ఘమైన, పొరలు పొరలుగా చేసే విగ్రహ ప్రక్రియను గురించి చెప్పారు. విగ్రహాన్ని తయారుచేసే వివిధ దశలలో గంగా మాటీ (నది ఒడ్డు నుండి సేకరించిన మట్టి), పాట్ మాటీ (జనపనార ముక్కలు, గంగా మాటీ మిశ్రమం) వంటి వివిధ మట్టి మిశ్రమాలను ఉపయోగిస్తారు.










