"ఒక్క చేప కూడా లేకుండా నేను ఇంటికి పోవటం ఇది ఆరవ రోజు," వులర్ సరస్సు ఒడ్డున నిల్చొని ఉన్న అబ్దుల్ రహీమ్ కావా అన్నారు. 65 ఏళ్ళ ఆ మత్స్యకారుడు ఇక్కడ తన భార్య, కుమారుడితో కలిసి తమ ఒంటి అంతస్తు ఇంటిలో నివాసముంటున్నారు.
బాండిపోర్ జిల్లా, కని బఠీ ప్రాంతంలో ఉండే ఈ సరస్సుకు ఝేలం నది, మధుమతి సెలయేరుల ద్వారా నీరు చేరుతుంది. చుట్టూ నివాసముండే ప్రజలకు ఈ వులర్ సరస్సే ఏకైక జీవన వనరు. ఒక్కో గ్రామంలో కనీసంగా 100 కుటుంబాలు ఉండే సుమారు 18 గ్రామాలు ఈ సరస్సు ఒడ్డున నివసిస్తున్నాయి.
"చేపలు పట్టుకోవటమొక్కటే ఇక్కడి జీవన వనరు," అన్నారు అబ్దుల్. కానీ "సరస్సులో నీరు లేదు. ఇప్పుడు మేం నీటిగుండా నడచిపోగలం, ఎందుకంటే సరస్సు మూలల్లో నీరు నాలుగు లేదా ఐదు అడుగులకు దిగిపోయింది," సరస్సు అంచులను చూపిస్తూ అన్నారు అబ్దుల్.
ఆయనకు తెలుసు - మూడవ తరం మత్స్యకారుడైన అబ్దుల్, ఉత్తర కశ్మీర్‌లోని ఈ సరస్సులో 40 సంవత్సరాలుగా చేపలు పడుతున్నారు. “నా చిన్నప్పుడు మా నాన్న నన్ను తన వెంట తీసుకెళ్ళేవారు. ఆయన్ని చూస్తూ చూస్తూ, నేను చేపలు పట్టడం నేర్చుకున్నాను,” అని అతను చెప్పారు. అబ్దుల్ కుమారుడు కూడా ఈ కుటుంబ వృత్తిని అనుసరించారు.
ప్రతి ఉదయం అబ్దుల్, ఆయన తోటి మత్స్యకారులు తాము నైలాన్ దారాలతో అల్లిన జాల్ (వల)లను పట్టుకొని వులర్ సరస్సులోకి పడవలు నడుపుకుంటూ వెళ్తారు. నీటిలోకి వల విసురుతూ వారు, చేపలను ఆకర్షించేందుకు కొన్నిసార్లు చేతితో తయారుచేసిన డ్రమ్మును వాయిస్తారు.
వులర్ భారతదేశంలోకెల్లా అతి పెద్ద మంచినీటి సరస్సు. కానీ గత నాలుగేళ్ళుగా వులర్ సరస్సు నీటిలో పెరిగిపోయిన కాలుష్యం, ఏడాది మొత్తం సాగే చేపల వేటను దాదాపు అసాధ్యంగా మార్చేసింది. "ఇంతకుముందు మేం ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు చేపలు పట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు కేవలం మార్చి, ఏప్రిల్ నెలలలో మాత్రమే పడుతున్నాం," అన్నారు అబ్దుల్.
ఈ సరస్సు కలుషితం కావటానికి ప్రధాన కారణం ఝేలం నది తీసుకువచ్చే వ్యర్థాలు. శ్రీనగర్ గుండా ప్రవహించే ఈ నది, తాను ప్రవహించినంత మేరా నగరపు చెత్తను పోగుచేసుకొనివస్తుంది. 1990 రామ్‌సర్ కన్వెన్షన్ లో ‘అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న తరిభూమి’గా గుర్తింపు పొందిన ఈ సరస్సు, ఇప్పుడు పరిశ్రమల వ్యర్థాలు, ఉద్యానవన సంబంధమైన వ్యర్థాలతో నిండిన మురికినీటి కూపంగా మారిపోయింది. "సరస్సు మధ్యలో నీటి మట్టం 40-60 అడుగులు ఉండేదని నాకు గుర్తుంది. ఇప్పుడది కేవలం 8-10 అడుగులకు తగ్గిపోయింది," అన్నారు అబ్దుల్.
ఆయన జ్ఞాపక శక్తి సరిగ్గానే ఉంది. ఈ సరస్సు 2008 నుండి 2019 మధ్య పావు వంతు భాగం తగ్గిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ జరిపిన 2022 నాటి అధ్యయనం వెల్లడించింది.
ఏడెనిమిది సంవత్స్త్రాల క్రితం కూడా తాను రెండు రకాల గాడ్ (చేప)ను - కశ్మీరీ , పంజీబ్ (కశ్మీరీయేతర అన్ని విషయాలకు స్థానికంగా వాడే పదం) - పట్టేవాడినని అబ్దుల్ అన్నారు. ఆయన తాను పట్టిన చేపలను వులర్ మార్కెట్‌లోని కాంట్రాక్టర్లకు అమ్మేవారు. ఆవిధంగా వులర్ చేపలు శ్రీనగర్‌తో సహా కశ్మీర్ అంతటా ప్రజలకు ఆహారమయ్యేవి.
"సరస్సులో నీరు ఉన్నప్పుడు చేపలు పట్టి అమ్మటం ద్వారా నేను 1000 [రూపాయలు] సంపాదించేవాడిని. కానీ ఇప్పుడు, ఆ రోజు మంచిగా ఉంటే, ఒక మూడు వందలు [రూపాయలు] సంపాదిస్తున్నాను," అన్నారు అబ్దుల్. చేపలు మరీ తక్కువగా దొరికినప్పుడు, ఆయన వాటిని అమ్మకుండా తమ స్వంత వాడకం కోసం ఇంటికి తీసుకువెళ్తారు.
కాలుష్యం, తక్కువ స్థాయికి పడిపోయిన నీరు వలన సరస్సులో మత్స్య సంపద తరిగిపోవటంతో ఇక్కడి మత్స్యకారులు నవంబర్ ఫిబ్రవరి నెలల మధ్య నీటి చెస్ట్‌నట్ (బాదం వంటి కాయలు)లను సేకరించి అమ్మడం వంటి ఇతర జీవనోపాధి అవకాశాల వైపుకు మళ్ళుతున్నారు. వీటిని కూడా కిలో 30-40 రూపాయల చొప్పున స్థానిక కంట్రాక్టర్లకు అమ్ముతారు.
వులర్ సరస్సు కాలుష్యం, దాని వల్ల తమ జీవనోపాధిని కోల్పోతున్న మత్స్యకారుల కథను ఈ చిత్రం చెప్తోంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి