ఆమె భర్త అనాస్ షేక్ కి ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 10:30కి ఫోన్ కలవనప్పుడు రెహనా బీబీ అంతేమి ఆలోచించలేదు. వాళ్లిద్దరూ రెండు గంటల క్రితమే ఫోన్లో మాట్లాడుకున్నారు. "ఆయన అమ్మమ్మ ఇవాళ పొద్దునే చనిపోయింది," అన్నది రెహనా బీబీ. ఈ విషయం చెప్పడానికే ఆమె ఉదయం 9 గంటలకి ఫోన్ చేసింది.
బెంగాల్లోని మాల్ద్హా జిల్లాలోని భగబాన్పూర్లో ఆమె నివసించే గుడిసె బయట కూర్చొని "ఆయన ఎలాగో దినం సమయానికి రాలేకపోయేవాడు. అందుకే సమాధి చేసేటప్పుడు నన్ను వీడియో కాల్ చెయ్యమని అడిగాడు" అని అన్నది 33 ఏళ్ళ రెహనా. అనాస్ ఎక్కడో 1700 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్లోని గద్వాల్ పర్వతాలలో ఉన్నాడు. ఆమె రెండోసారి ఫోన్ చెసినపుడు, అతని ఫోన్ కలవలేదు.
ఈ రెండు ఫోన్ల మధ్యలో ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో విపతొచ్చిపడింది. నందాదేవి గ్లేషియర్ లో ఒక భాగం విరిగిపడి అలకనంద, ధౌలి గంగా, రిషి గంగా నదులలో భారీ వరదకు దారితీసింది. ఈ వరదలలో నది ఒడ్డుపై ఉన్న ఇళ్లు కొట్టుకుపోయి, పరిసరాలలోని జల విద్యుత్ ప్లాంటులలో పనిచేసే కార్మికులను ముంచేసాయి.
వారిలో అనాస్ కూడా ఒకడు. కానీ ఈ విషయం రెహనాకి తెలియదు. తన భర్తకి ఫోన్ చెయ్యడానికి ఆమె మరి కొన్ని సార్లు ప్రయత్నించారు. ఎంతకీ ఫోన్ కలవక ఆమెలో కంగారు మొదలయింది. కొద్ధి క్షణాలలో ఆ కంగారు భయం, ఆ తరవాత ఆందోళనగా మారింది. "నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను" అన్నది ఆమె కన్నీళ్ళని ఆపుకుంటూ. "నాకు ఏమి చెయ్యాలో కూడా తెలియలేదు".







