“వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు...” పక్కనే ఆడుకుంటున్న తన ఆరేళ్ళ కూతుర్ని చూస్తున్న అరుణ (28) ముఖంలో ఏదో తెలియని అయోమయం కనబడింది. ఆ “వాళ్ళు” ఆమె కుటుంబ సభ్యులే. అరుణ ఎందుకలా ప్రవర్తించేదో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. “నేను వస్తువులను విసిరి కొట్టేదాన్ని. ఇంట్లో ఉండేదాన్ని కాదు. మా ఇంటి దగ్గరికి ఎవరూ వచ్చేవారు కారు...”
తమిళనాడులోని కాంచీపురమ్ జిల్లాలో, తన ఇంటి దగ్గరున్న కొండల్లో తిరుగుతూ ఆమె తరచూ తప్పిపోయేవారు. తమను కొడుతుందేమోనన్న భయంతో ఆమెకు దూరంగా కొందరు పారిపోతే, మరికొందరు ఆమెపై రాళ్ళు విసిరేవారు. అరుణ తండ్రి ఆమెను ఇంటికి తీసుకువచ్చి, ఆమె మళ్ళీ బయటకు వెళ్ళకుండా ఒక్కోసారి కుర్చీకి కట్టేసేవారు.
అరుణ (ఆమె అసలు పేరు కాదు) స్కిట్సఫ్రీనియా (schizophrenia) తో బాధపడుతున్నప్పుడు, ఆమెకు 18 ఏళ్ళు. ఆ మానసిక రుగ్మత ఆమె ఆలోచనా తీరుపై, అనుభూతి చెందే విధానంపై, ప్రవర్తనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
కాంచీపురమ్‌లోని చెంగల్పట్టు తాలూకా, కొండంగి గ్రామంలో ఉన్న దళిత కాలనీలో తన ఇంటి బయట కూర్చొనివున్న అరుణ ఒకప్పుడు తను పడ్డ కష్టాలను నెమరువేసుకున్నారు. ఉన్నట్టుండి ఆమె అక్కడినుంచి లేచి వెళ్ళిపోయారు. గులాబీ రంగు నైటీలో, చిన్నగా కత్తిరించిన జుట్టుతో, పొడవుగా, నలుగు రంగులో ఉన్న ఆమె వంగిపోయి నడుస్తున్నారు. తన ఒంటిగది పూరిగుడిసెలోకి వెళ్ళి, డాక్టర్ రాసిన మందుల చీటీ, రెండు టాబ్లెట్ స్ట్రిప్‌లతో తిరిగి వచ్చారు. “వీటి వల్ల నేను నిద్రపోగలుగుతున్నాను. ఇవేమో నరాల సంబంధిత సమస్యలను నివారించడానికి. నేనిప్పుడు బాగా నిద్రపోతున్నాను. ఈ మందులు తీసుకోవడానికి ప్రతి నెలా సెంబాక్కమ్ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)కి వెళ్తాను,” ఆ టాబ్లెట్లను చూపిస్తూ వివరించారామె.
శాంతి శేష లేకపోయుంటే అరుణ కు వచ్చిన జబ్బు గుర్తించబడి ఉండేదే కాదు.
అక్క డేం జరుగుతోందో శాంతి (61) పసిగట్టగలిగారు. స్కిట్సఫ్రీనియాతో బాధపడుతున్న అరుణ లాంటి వందలాది మందికి ఆమె సహాయం చేశారు. 2017-2022 మధ్యలో, చెంగల్పట్టులో 98 మంది రోగులను గుర్తించి, వారికి వైద్య సేవలందించడంలో సహాయం చేశారు శాంతి. స్కిట్సఫ్రీనియా రీసెర్చ్ ఫౌండేషన్ (SCARF- ఎస్‌సిఎఆర్ఎఫ్) తరఫున, మానసిక రుగ్మతల వల్ల సమాజానికి దూరమవుతున్న వ్యక్తుల కోసం కాంట్రాక్టుపై పని చేసే సామాజిక ఆరోగ్య కార్యకర్తగా, ఆవిడ కొండంగి గ్రామంలో సుప్రసిద్ధులు.
“అప్పుడామె యుక్తవయసులో ఉంది; సన్నగా ఉండేది. ఇంకా పెళ్ళి కాలేదు,” ఒక దశాబ్దం క్రితం మొదటిసారి కలిసినప్పుడు అరుణ ఎలా ఉందో గుర్తు చేసుకున్నారు శాంతి. “ఆమె ఊరికే అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. అస్సలు తినేది కాదు. తిరుక్కళుకుండ్రమ్‌లోని వైద్య శిబిరానికి ఆమెను తీసుకెళ్ళమని ఆమె కుటుంబానికి చెప్పాను.” స్కిట్సఫ్రీనియాతో బాధపడుతున్న వ్యక్తుల సమస్యను నిర్ధారించి, చికిత్స అందించడానికి, ఎస్‌సిఎఆర్ఎఫ్ ప్రతి నెలా ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించేది.
కొండంగికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కళుకుండ్రమ్‌కు అరుణను తీసుకెళ్లేందుకు ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నించగా, ఆమె హింసాత్మకంగా మారి తన దగ్గరకు ఎవరినీ రానివ్వలేదు. దాంతో, ఆమె కాళ్ళు, చేతులు కట్టేసి క్యాంపుకు తీసుకెళ్లారు వాళ్ళు. “ఆమెకు 15 రోజులకోసారి ఇంజెక్షన్ ఇవ్వమని (మానసిక వైద్యుడు) నాకు చెప్పారు,” శాంతి అన్నారు.
ప్రతి పదిహేను రోజులకోసారి అరుణకు ఇంజెక్షన్లు, మందులు ఇవ్వడంతో పాటు ఆ శిబిరంలో కౌన్సెలింగ్ కూడా చేశారు. “కొన్ని సంవత్సరాల తర్వాత, తన చికిత్స కొనసాగించడానికి, నేను ఆమెను సెంబాక్కమ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాను,” శాంతి అన్నారు. ఆ పిఎచ్‌సిలో మరో ఎన్‌జిఒ (బన్యన్ - Banyan) మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఒక క్లినిక్ నడుపుతోంది. “అరుణ ఆరోగ్యం (ఇప్పుడు) మెరుగుపడింది. ఆమె బాగా మాట్లాడుతోంది.”
అరుణ ఇంటికి కొన్ని గజాల దూరంలో కొండంగి గ్రామ కేంద్ర బిందువు ఉంది. ఆధిపత్య కులాలకు చెందిన – నాయుడు, నాయకర్ - కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. అలాగే శాంతి కూడా నాయుడు. “అరుణ వారి కులానికి (షెడ్యూల్డ్ కులం) చెందినది కాబట్టి, వాళ్ళు ఆమెను (దళిత కాలనీలో) సహించారని,” శాంతి నమ్ముతున్నారు. కాలనీ వాసులు నాయుడు-నాయకర్ పరిసర ప్రాంతాలకు రారు. “అరుణ ఇక్కడకు వచ్చి ఉంటే, అది గొడవలకు దారితీసేది.”
నాలుగు సంవత్సరాల చికిత్స తరువాత, అరుణకు వివాహం జరిగింది. ఆమె గర్భవతి కాగానే ఆ వ్యక్తి ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. దాంతో ఆమె తన పుట్టినింటికి తిరిగి వచ్చి, తన తండ్రి-అన్నయ్యలతో కలిసి నివసిస్తున్నారు. చెన్నైలో ఉంటున్న ఆమె వివాహిత అక్క, ఇప్పుడు ఆమె బిడ్డను చూసుకోవడంలో సహాయం చేస్తున్నారు. అరుణ తన అనారోగ్యం కోసం మందులు వాడుతున్నారు.
తన ఆరోగ్యం బాగుపడేందుకు సహాయపడిన శాంతి అక్క కు తాను ఋణపడి ఉంటానని ఆమె అన్నారు.
*****
ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, చెంగల్పట్టు తాలూకా లో సర్వే చే యాల్సిన గ్రామాల-కుగ్రామాల జాబితాను తీసుకుని, లంచ్ బాక్స్ తీసుకొని తన ఇంటి నుండి బయలుదేరతారు శాంతి. మధురాంతకమ్‌లోని బస్టాండ్‌కి చేరుకోవడానికి దాదాపు గంటసేపు – 15 కిలోమీటర్లు – నడిచి వెళ్ళాలి ఆవిడ. “వేరే గ్రామాలకు వెళ్ళడానికి ఇక్కడి నుండే రవాణా దొరుకుతుంది మరి,” తెలిపారామె.
తాలూకా అంతటా ప్రయాణించి, మానసిక అనారోగ్యం ఉన్నవారిని గుర్తించి, వారికి వైద్య సంరక్షణ పొందడంలో సహాయం చేయడమే ఆమె పని.
“మేం ముందుగా సులభంగా చేరు కోగలిగే గ్రామాల కే వెళ్తుంటాం. ఆ తరువాత, మారుమూల ప్రాంతాలకు వెళ్తాం. ఆయా ప్రాంతాలకు బస్సులు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు మేం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు, లేదా మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా బస్టాండ్‌లో వేచి ఉండాల్సి వచ్చేది,” శాంతి గుర్తుచేసుకున్నారు.
శాంతి నెలంతా పని చేసేవారు; ఆదివారాలు మాత్రమే సెలవు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తగా ఆమె దినచర్య మూడు దశాబ్దాలలో ఒకేలా కొనసాగింది. అంతగా కనిపించినప్పటికీ, ఆమె చేసే పని చాలా ప్రాముఖ్యం కలిగినది. భారతదేశంలోని వయోజన జనాభాలో, 10.6 శాతం మందిని మానసిక రుగ్మతలు ప్రభావితం చేస్తున్నాయి. అయితే, 13.7 శాతం మంది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక అనారోగ్యాన్ని అనుభవిస్తారు. కానీ చికిత్స అంతరం మాత్రం ఎక్కువగా ఉంది: 83 శాతం. స్కిట్సఫ్రీనియాతో జీవిస్తున్న వారిలో, కనీసం 60 శాతం మందికి అవసరమైన సంరక్షణ అందడం లేదు.
సామాజిక ఆరోగ్య కార్యకర్తగా శాంతి ప్రయాణం 1986లో ప్రారంభమైంది. ఆ సమయంలో, అనేక రాష్ట్రాల్లో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం తగినంతమంది నిపుణులు లేరు. శిక్షణ పొందిన కొద్దిమంది కూడా నగరాల్లో ఉండేవారు; దాదాపు ఎవ్వరూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు కారు. ఈ సమస్యను పరిష్కరించి, అందరికీ – ముఖ్యంగా అత్యంత బలహీన, వెనుకబడిన వర్గాల కోసం – “కనీస మానసిక ఆరోగ్య సంరక్షణ సులభంగా అందుబాటులో ఉండేలా” నిర్ధారించే లక్ష్యంతో, 1982లో నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను (ఎన్ఎమ్ఎచ్‌పి) ఏర్పాటు చేశారు.
1986లో, రెడ్‌క్రాస్‌లో సామాజిక కార్యకర్తగా చేరారు శాంతి. ఆమె చెంగల్పట్టులోని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి, వికలాంగులను గుర్తించి, వారి తక్షణ అవసరాలను సంస్థకు నివేదించేవారు.
1987లో SCARF శాంతిని సంప్రదించినప్పుడు, కాంచీపురమ్ జిల్లా తిరుప్పోరూర్ బ్లాక్‌లో మానసిక రోగులకు పునరావాసం కల్పించేందుకు, ఎన్ఎమ్ఎచ్‌పి కింద కార్యక్రమాలను అమలు చేసేది ఆ సంస్థ. అలాగే, కమ్యూనిటీ ఆధారిత వాలంటీర్ల కేడర్‌ను తయారుచేయడానికి గ్రామీణ తమిళనాడులో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేది. “పాఠశాల స్థాయి విద్యను పూర్తి చేసిన సముదాయానికి చెందిన వ్యక్తులను నియమించి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి, వారిని ఆసుపత్రులకు పంపేలా చేయడంలో శిక్షణ ఇచ్చారు,” అని SCARF డైరెక్టర్ డాక్టర్ ఆర్. పద్మావతి తెలిపారు. 1987లో ఆ సంస్థలో చేరారావిడ.
ఈ శిబిరాల ద్వారా వివిధ మానసిక రుగ్మతల గురించి, వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకున్నారు శాంతి. మానసిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను వైద్య చికిత్స తీసుకోవడానికి ప్రోత్సహించే నైపుణ్యాలను కూడా నేర్చుకున్నారామె. మొదట్లో తన జీతం నెలకు రూ.25 ఉండేదని శాంతి చెప్పారు. మానసిక రోగులను గుర్తించి, వాళ్ళని వైద్య శిబిరాలకు తీసుకురావాలి. “నాకు, మరొక వ్యక్తికి కలిపి మూడు పంచాయితీలను కేటాయించారు – ఒక్కో పంచాయతీలో 2-4 గ్రామాలుంటాయి.” ఆమె వివరించారు. ఏళ్ళు గడిచేకొద్దీ ఆమె ఆదాయం పెరిగింది. 2022లో, ఆమె SCARFలో తన విధుల నుండి పదవీ విరమణ చేసినప్పటికి నెలకు నికరంగా రూ.10,000 (ప్రావిడెంట్ ఫండ్, బీమా మినహాయింపుల తర్వాత) సంపాదించేవారు.
ఆమె చేసిన పని ఆమెకు స్థిరమైన ఆదాయ వనరులను సమకూర్చి, తన జీవితంలో ఎదురైన సవాళ్ళను ఎదుర్కొనే మనోధైర్యాన్ని అందించింది. తాగుడుకు బానిసైన ఆమె భర్త, కుటుంబ పోషణకు పెద్దగా చేసేదేమీ ఉండదు. వాళ్ళ 37 ఏళ్ళ కుమారుడు ఎలక్ట్రీషియ న్‌గా పని చేస్తూ, రోజుకు సుమారు రూ.700 సంపాదిస్తారు. కానీ అది అస్థిరమైన ఆదాయం; అతనికి నెలలో 10 రోజులు మాత్రమే పని ఉంటుంది. అతని భార్య, కూతురిని పోషించడానికి కూడా ఆ మొత్తం సరిపోదు. శాంతి తల్లి కూడా వారితోనే ఉంటున్నారు. SCARF చేపట్టిన స్కిట్సఫ్రీనియా అవగాహనా కార్యక్రమం 2022లో ముగిసిన తరువాత, తంజావూరు బొమ్మలను తయారు చేయడం ప్రారంభించారు శాంతి. యాభై బొమ్మలకు గాను ఆమెకు సుమారు రూ.3,000 వస్తుంది.
దాదాపు 30 సంవత్సరాలు జనంలో పనిచేసినా, శాంతి అలసిపోలేదు. ఎన్జీఓలో పనిచేస్తున్న చివరి ఐదేళ్ళ కాలంలో, ఆమె చెంగల్పట్టులోని కనీసం 180 గ్రామాలను, కుగ్రామాలను సందర్శించారు. “నాకు వయసైపోతున్నా ఈ పనిని కొనసాగించాను. నాకు పెద్దగా డబ్బు రానప్పటికీ, నేను సంపాదించిన దానితోనే జీవితం నెట్టుకొచ్చాను. నాకు మానసికంగా సంతృప్తిపరంగా ఉంది. ఇందులో గౌరవం ఉంది,” ఆవిడ అన్నారు.
*****
శాంతితో కలిసి చెంగల్పట్టు అంతటా ప్రయాణిస్తూ, స్కిట్సఫ్రీనియాతో బాధపడుతున్న వారిని గుర్తించారు 49 ఏళ్ళ సెల్వి ఇ. 2017-2022 మధ్యలో, మూడు బ్లాక్ పంచాయతీలలోని – ఉత్తిరమేరూర్, కాట్టాంగొళత్తూర్, మదురాంతకమ్ – 117 గ్రామాలకు వెళ్లి, 500 మందికి పైగా వైద్య సహాయం అందించారు సెల్వి. ఆమె 25 సంవత్సరాలకు పైగా SCARFలో పని చేశారు. ఇప్పుడామె మరో ప్రాజెక్ట్‌లో నిమగ్నమై, చిత్తవైకల్యం (dementia) ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నారు.
సెల్వి చెంగల్పట్టులోని సెంబాక్కమ్ గ్రామంలో జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన తరువాత, సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పని చేయడం మొదలుపెట్టారు. ఆమె చేనేత ప్రధాన వృత్తి అయిన సెంగుందర్ సముదాయానికి చెందినవారు. ఇది తమిళనాడులో ఇతర వెనుకబడిన తరగతిగా వర్గీకరించబడింది. “నేను 10వ తరగతి తర్వాత చదువుకోలేదు. కాలేజీకి వెళ్ళాలంటే మా ఇంటికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుప్పోరూర్‌కి వెళ్ళాలి. నేను చదువుకోవాలనుకున్నాను కానీ దూరం కారణంగా నా తల్లిదండ్రులు నన్ను పంపించలేదు,” అన్నారామె.
ఇరవయ్యారేళ్ళ వయసులో సెల్వికి పెళ్లైంది. అయితే తన కుటుంబానికి ఆవిడే ఏకైక జీవనాధారం అయ్యారు. ఎలక్ట్రీషియన్ అయిన భర్త ఆదాయం సరిపోయేది కాదు. దాంతో, తనకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇంటి ఖర్చులు, ఇద్దరు కొడుకుల చదువులు నెట్టుకొచ్చారావిడ. పెద్ద కొడుకు(22) ఆరు నెలల క్రితమే కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్.ఎస్‌సి. పూర్తి చేశాడు. చిన్న కొడుకు (20), చెంగల్పట్టులోని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నాడు.
గ్రామాలకు వెళ్ళి స్కిట్సఫ్రీనియా రోగులను చికిత్స తీసుకోమని ప్రోత్సహించే ముందు, సెల్వి వాళ్ళకి కౌన్సెలింగ్ నిర్వహించేవారు. ఆమె 10 మంది రోగులకు, మూడేళ్ళపాటు కౌన్సెలింగ్ నిర్వహించారు. “నేను వారానికోసారి వారి దగ్గరకు వెళ్ళేదాన్ని. ఇలా వెళ్ళినపుడు చికిత్స, ఆ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహారం, పరిశుభ్రత- వీటి ప్రాముఖ్యం గురించి రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించేదాన్ని.”
మొదట్లో సెల్వికి ఈ సముదాయం నుండి చాలా ప్రతిఘటన ఎదురైంది. “అసలు సమస్య ఉందనే విషయాన్నే వారు అంగీకరించేవారు కాదు. ఇదొక అనారోగ్య సమస్య అని, చికిత్స చేయవచ్చని వారికి నచ్చజెప్పే వాళ్ళం. కానీ రోగుల కుటుంబీకులకు కోపం వచ్చేది. రోగులను ఆసుపత్రులకు కాకుండా మతపరమైన ప్రదేశాలకు తీసుకెళ్లడానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. రోగులను వైద్య శిబిరానికి తీసుకువచ్చేలా ఒప్పించడానికి చాలాసార్లు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి, చాలా ప్రయత్నాలు చేయాల్సివచ్చేది. రోగికి ప్రయాణం చేయడం కష్టంగా అనిపించినప్పుడు, వైద్యులే వారి ఇళ్ళకు వెళ్ళేవారు.”
దాన్ని అధిగమించేందుకు సెల్వి తన సొంత వ్యూహాన్ని రచించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించేవారామె. ప్రజలు ఎక్కువగా గుమిగూడే టీ కొట్టుకి కూడా వెళ్ళేవారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులతో, పంచాయతీ సభ్యులతో మాట్లాడేవారు. వాళ్ళే ఆమెకు ప్రధాన పరిచయ వ్యక్తులుగా మారారు. వాళ్ళకి స్కిట్సఫ్రీనియా లక్షణాలను, వైద్య సంరక్షణ ఎలా సహాయపడుతుందో వివరించి, వారి గ్రామంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల గురించి సమాచారం అడిగేవారు. “కొంతమంది సంకోచించేవారు; కొంతమంది మాత్రం వివరాలు చెప్పేవారు, లేదా రోగి ఇంటికి దారి చూపించేవారు. చాలామందికి నిర్దిష్ట సమస్య తెలియదు. ఒక వ్యక్తి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నదనో, లేదా కొందరు చాలాకాలంగా నిద్రపట్టకపోవటం గురించి మాట్లాడుతున్నారని వాళ్ళు మాకు చెప్పేవారు,” అని సెల్వి వివరించారు.
సజాతి వివాహాలు, మేనరికపు వివాహాలు సర్వసాధారణమైన సమాజంలో పెరిగిన సెల్వి, మేధో వైకల్యాలతో (cognitive disabilities) జన్మించిన అనేక మంది పిల్లలను చూశారు. మానసిక అనారోగ్యం, మేధో వైకల్యాల లక్షణాల మధ్య ఉండే తేడాను గుర్తించడానికి – ఇది ఆమె పనికి అవసరమైన కీలకమైన నైపుణ్యాలలో ఒకటి – ఇది తనను సిద్ధం చేసిందని ఆవిడ తెలిపారు.
మందులు రోగి ఇంటి వద్దకే చేరేలా చూడటం సెల్వి ముఖ్యమైన పని. భారతదేశంలో, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులలో ఎక్కువ మంది, ఆరోగ్య సేవల, ఔషధాల ఖర్చులను దాదాపుగా వారే చెల్లిస్తున్నారు. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం కింద అందించే సేవలను పొందేందుకు, దాదాపు 40 శాతం మంది రోగులు 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నారు. మారుమూల గ్రామాలలో ప్రజలు తరచూ చికిత్స తీసుకోవడం చాలా కష్టం. అనారోగ్య లక్షణాలతో పోరాడుతూ, సామాజిక అంచనాలను అందుకోలేని రోగులకు ఎదురయ్యే మరో పెద్ద సమస్య – ఈ సమస్యతో బాధపడుతున్నవారికి ఆపాదించే కళంకం.
“టీవీ చూడటం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మెరుగుదల కనబడుతోంది. ప్రజలు అంతగా భయపడడం లేదు. బీపీ, షుగర్ (రక్తపోటు సమస్యలు, మధుమేహం) సమస్యలకు చికిత్స అందించడం సులభమైంది. కానీ, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను సంప్రదించినప్పుడు, ఇప్పటికీ వాళ్ళు కోపంగా మాట్లాడుతూ, మాతో గొడవకు వస్తారు. ‘మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ పిచ్చోళ్ళున్నారని ఎవరు చెప్పారు మీకు?’ అంటూ అరుస్తారు.” అని ఆవిడ తెలిపారు.
*****
చెంగల్పట్టు తాలూకాలోని మణమది గ్రామంలో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోన్న 44 ఏళ్ళ డి. లిల్లీ పుష్పం, గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఉన్న అపోహల విషయంలో సెల్వితో ఏకీభవించారు. “చాలా అనుమానాలు ఉంటాయి. పేషెంట్లను సైకియాట్రిస్ట్ కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేస్తాడని కొందరు నమ్ముతారు. ట్రీట్‌మెంట్ కోసం వచ్చినా భయపడుతుంటారు. మేం మా గుర్తింపు కార్డు (ఐడి) ను వారికి చూపించి, ఆసుపత్రి నుండి వచ్చామని వివరిస్తాం. కానీ వాళ్ళు మమ్మల్ని అనుమానంగానే చూస్తుంటారు. మేము చాలా కష్టపడాల్సి వస్తుంది,” లిల్లీ వివరించారు.
మణమదిలోని దళిత కాలనీలో పెరిగారు లిల్లీ. అలా పెరగడం వలన, పనిలో తాను ఎదుర్కొనే వివక్షత పట్ల ఆమెకు అవగాహన ఉంది. కొన్నిసార్లు ఆమె కులం ఆమెను ఇబ్బందులకు గురిచేస్తుంది. అందుకే ఎవరైనా అడిగినా తను ఎక్కడ నివసిస్తారో చెప్పరు. “నేను నిజం చెబితే వాళ్ళకి నా కులమేంటో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నన్ను వేరేగా చూస్తారని భయపడుతుంటాను,” అన్నారామె. లిల్లీ దళిత క్రిస్టియన్ అయినప్పటికీ, తనను తాను క్రిస్టియన్ గా మాత్రమే గుర్తిస్తారామె.
ఆరోగ్య కార్యకర్తలతో ఒక్కో గ్రామంలో ప్రజలు ఒక్కోలా వ్యవహిరిస్తారని లిల్లీ అన్నారు. “ధనవంతులు, అగ్రవర్ణాలు నివసించే కొన్ని ప్రదేశాలలో, మాకు తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వరు. కొన్నిసార్లు ఎంతగా అలసిపోతామంటే, వెంటనే ఎక్కడో అక్కడ కూర్చుని తినాలనిపిస్తుంది. కానీ వాళ్ళు మమ్మల్ని అనుమతించరు. అప్పుడు మాకు చాలా బాధగా అనిపిస్తుంది. దాని వలన ఎక్కడైనా కూర్చొని తినడానికి మేం కనీసం 3-4 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల మాత్రం వాళ్ళు మాకు తాగడానికి నీళ్ళు ఇస్తారు. మేం భోజనానికి కూర్చున్నప్పుడు మాకేదైనా అవసరమా అని కూడా అడుగుతారు,” ఆమె వివరించారు.
లిల్లీకి 12 ఏళ్ళు ఉన్నప్పుడే తన మేనబావతో వివాహం జరిగింది. అతను ఆమె కంటే 16 సంవత్సరాలు పెద్ద. “మేం నలుగురు ఆడపిల్లలం. నేనే పెద్దదాన్ని,” ఆమె చెప్పింది. వాళ్ళ కుటుంబానికున్న3 సెంట్ల భూమిలో ఒక మట్టి ఇల్లు నిర్మించుకున్నారు. “తన ఆస్తిని చూసుకోవడానికి, భూమిని సాగు చేయడానికి ఒక వ్యక్తి సహాయంగా ఉండాలని మా నాన్న కోరుకున్నాడు. అందుకే నన్ను తన అక్క కొడుకుకిచ్చి పెళ్ళి చేశాడు.” కానీ ఆమె వైవాహిక జీవితం సంతోషంగా లేదు. ఆమె భర్త విశ్వాసపాత్రుడు కాదు. అతను నెలల తరబడి ఇంటికి రాడు. వచ్చినప్పుడు మాత్రం ఆమెను కొట్టేవాడు. 2014లో అతను కిడ్నీ క్యాన్సర్‌తో మరణించాడు. అప్పటికి ఆమెకు వరుసగా 18,14 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు.
2006లో, SCARFలో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా ఉద్యోగం దొరికే వరకూ లిల్లీ కుట్టుపని చేసేవారు. ఆమె వారానికి రూ.450-500 వరకు సంపాదించేవారు. కానీ అది కుట్టించుకోవడానికి వచ్చేవాళ్ళ సంఖ్యపై ఆధారపడి ఉండేది. అంతకన్నా మెరుగైన జీతం ఇవ్వడం వల్లే తాను ఆరోగ్య కార్యకర్తనయ్యానని అన్నారావిడ. కోవిడ్-19 ఆమె నెలవారీ ఆదాయానికి (రూ.10,000) గండి కొట్టింది. కోవిడ్-19కి ముందు, ఆమె తన బస్, ఫోన్ ఛార్జీలను సంస్థ నుండి పొందేవారు. “కానీ కరోనా కారణంగా, రెండేళ్లపాటు నా ఫోన్ బిల్లు, రవాణా ఛార్జీలు కూడా ఆ రూ.10,000 లోపే నెట్టుకురావలసి వచ్చింది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను,” అంటూ ఆ గడ్డు రోజులను నెమరువేసుకున్నారామె.
ప్రస్తుతం ఎన్ఎమ్ఎచ్‌పి కింద ఎస్‌సిఎఆర్ఎఫ్ చేపట్టిన కమ్యూనిటీ ప్రాజెక్ట్ ముగియడంతో, చిత్తవైకల్యం ఉన్న వ్యక్తుల సంరక్షణ కోసం ఆ సంస్థ ప్రారంభించిన ప్రాజె క్ట్‌లో లిల్లీ పని చేస్తున్నారు. మార్చిలో పని ప్రారంభమైంది. ఆమె వారానికొకసారి వెళ్తారు. కానీ స్కిట్సఫ్రీనియా రోగులను ఇప్పటికీ చికిత్స కోసం చెంగల్పట్టు, కోవళం, సెంబాక్కమ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నారావిడ.
సామాజిక ఆరోగ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న శాంతి, సెల్వి, లిల్లీ లాంటి మహిళలు 4-5 సంవత్సరాల కాంట్రాక్ట్‌లపై పనిచేయవలసి వస్తుంది. SCARF లాంటి ఎన్జీఓలు నిర్ణీత కాలంలో (term-based) పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌ల కోసం విడుదల చేసిన నిధుల ఆధారంగా వారిలాంటి కార్మికులను తీసుకుంటాయి. “రాష్ట్ర స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మేం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం,” అని SCARF కు చెందిన పద్మావతి తెలిపారు. ఇది సామాజిక ఆరోగ్య కార్యకర్తల పనిని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుందని ఆ సంస్థ నమ్ముతోంది.
భారతదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్ కేటాయింపులు ఇంత నాసిగా లేకుంటే పరిస్థితులు వేరేగా ఉండి ఉండవచ్చు. 2023-24లో, మానసిక ఆరోగ్యం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బడ్జెట్ అంచనా – రూ. 919 కోట్లు – కేంద్ర ప్రభుత్వ మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో కేవలం 1 శాతం మాత్రమే ఉంది. అందులో ప్రధాన భాగం – రూ. 721 కోట్లు – బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో-సైన్సెస్ (NIMHANS) కోసం కేటాయిం చారు. మిగిలిన మొత్తాన్ని లోక్‌ప్రియ గోపీనాథ్ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, తేజ్‌పూర్ (రూ.64 కోట్లు), నేషనల్ టెలీ-మెంటల్ హెల్త్ ప్రోగ్రాం (రూ.134 కోట్లు)లకు కేటాయించారు. మౌలిక సదుపాయాలు సిబ్బంది అభివృద్ధిని పరిశీలించే (సదరు మంత్రిత్వ శాఖ చేపట్టిన) జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని, ఈ సంవత్సరం జాతీయ ఆరోగ్య మిషన్ లో “తృతీయ కార్యకలాపాల” కింద చేర్చారు. కాబట్టి, తృతీయ స్థాయి కిందకి వచ్చే మానసిక సంరక్షణ కోసం కేటాయింపులు ఉండవు.
ఇదిలా ఉంటే, మణమదిలో తనకు అందాల్సిన సామాజిక భద్రతా ప్రయోజనాన్ని పొందేందుకు ఇప్పటికీ లిల్లీ పుష్పం కష్టపడుతున్నారు. “నేను వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాలంటే లంచం ఇవ్వాలి. వారికి ఇవ్వడానికి నా దగ్గర రూ.500-1,000 కూడా లేవు. నేను ఇంజెక్షన్, టాబ్లెట్లు ఇవ్వగలను, కౌన్సెలింగ్ అందించగలను, రోగుల ఆరోగ్యం గురించి ఫాలో-అప్ చేయగలను. కానీ ఈ అనుభవం SCARFలో తప్ప ఎక్కడా (ఉపయోగకరంగా) పరిగణించబడదు. నా జీవితంలో ప్రతిరోజూ కన్నీళ్ళతో నిండి ఉంటుంది. నాకు సహాయం చేసేవారెవరూ లేకపోవడంతో బాధగా ఉంది,” అంటూ లిల్లీ విచారంగా చెప్పారు
ఫీచర్ చిత్రం: యుక్త వయసులో ఉన్న శాంతి శేష
అనువాదం: వై క్రిష్ణ జ్యోతి