ఉచితంగా వచ్చే భోజనమంటూ ఏదీ లేదు.
మీరు అస్సాంలోని అతిపెద్ద బ్రహ్మపుత్రానది మధ్యలో ఉండే మాజులీ నదీద్వీపంలో రద్దీగా ఉండి, ప్రయాణికులను అటూ ఇటూ చేరవేసే కమలాబారీ ఘాట్ లో తినుబండారాల దుకాణాలను పరిశీలించే అదృష్టం కలిగిన ఆవు అయితే తప్ప!
ముక్తా హజారికాకు ఈ విషయం బాగా తెలుసు. మాతో మాట్లాడుతుండగా మధ్యలో, ఏదో కదిలిన చప్పుడు విన్న అతను అకస్మాత్తుగా మాతో మాటల్ని ఆపేసి, తన తినుబండారాల దుకాణం ముందువైపుకు పరిగెట్టాడు. అక్కడ ఓ పశుజాతి చొరబాటుదారుడు కౌంటర్‌లో ఉన్న ఆహార పదార్థాలను తినడానికి ప్రయత్నిస్తున్నాడు.
అతను ఆ ఆవును అక్కడి నుండి తరిమేసి, వెనక్కి తిరిగి నవ్వుతూ, “నేను నా హోటల్(ఆహారశాల)ను ఒక్క నిమిషం కంటే ఎక్కువ సమయం విడిచిపెట్టి పోలేను. ఇక్కడికి దగ్గర్లోనే మేత మేసే ఆవులు వీటిని తినడానికి వచ్చి, ఈ స్థలాన్నంతా గందరగోళం చేసేస్తాయి." అన్నాడు.
10 సీట్లున్న ఈ తినుబండారాల దుకాణంలో ముక్తా మూడు పాత్రలు పోషిస్తున్నాడు: వంటవాడు, సర్వర్, యజమాని. అందుకని, ఆ దుకాణానికి- హోటల్ హజారికా- అతని పేరే ఉండటంలో కూడా అర్థముంది.
కానీ ఆరేళ్లుగా విజయవంతంగా నడుస్తున్న హోటల్ హజారికా, 27 ఏళ్ల ముక్తా సాధించిన ఏకైక ఘనత మాత్రమే కాదు. అతను వినోద ప్రపంచంలో మూడు కళలు తెలిసినవాడు: నటుడు, నాట్యగాడు, గాయకుడు. అంతేకాదు, మాజులీ ప్రజలు కోరినప్పుడు సందర్భానుసారం వారి రూపాన్నీ, హావభావాలనూ మార్చేయగల నైపుణ్యమున్న మేకప్ కళాకారుడు కూడా..
ఆ కళని మనమింకా చూడాల్సే ఉంది. కానీ, ఈలోగా అతను సేవ చేయాల్సిన మనుషులున్నారు.
ప్రెషర్ కుక్కర్ బుస్సుమంది. ముక్తా దాని మూత తెరిచి, కుక్కర్‌ను అటు ఇటు కదిలించగానే, తెల్ల చనా దాల్ (శెనగ పప్పు) కూర వాసన గాలిలో వ్యాపించింది. ఒకవైపు వేగంగా దాల్ ను కదపడం, మరోవైపు రోటీలు చేయడం - ఘాట్ వద్ద ఆకలితో ఉండే ప్రయాణికులు, తదితరుల కోసం అతను ప్రతిరోజూ 150కి పైగా ఇలాంటి రొట్టెలను తయారుచేస్తున్నాడని మాకు తెలిసింది.
నిమిషాల వ్యవధిలో, రెండు ప్లేట్లు మా ముందుకు వచ్చాయి. రోటీలు , మెత్తని ఆమ్లెట్, దాల్ , ఉల్లిపాయ ముక్కలు, రెండు చట్నీలు – పుదీనా , కొబ్బరి - మా ముందున్నాయి. ఇద్దరు వ్యక్తులకు సరిపోయే ఈ రుచికరమైన ఆహారం ఖరీదు, 90 రూపాయలు మాత్రమే.
కొంచెం బలవంతపెట్టాక, ముక్తా సిగ్గుపడుతూనే మా కోరికను అంగీకరించాడు. "రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి రండి, అదెలా చేస్తానో నేను మీకు చూపిస్తాను."
*****
మేం మాజులీలోని ఖోరహోలా గ్రామంలోని ముక్తా ఇంటికి చేరుకున్నప్పుడు, మేం ఒంటరిగా లేమని అర్థమైంది. ముక్తా పొరుగింటి అమ్మాయి, అతనికి మంచి స్నేహితురాలైన 19 ఏళ్ల రూమీ దాస్, ఈ మేకప్ కళాకారుని చేతిలో ఎలా రూపాంతరం చెందుతుందో చూసేందుకు బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువాళ్లు తండోపతండాలుగా వచ్చివున్నారు. మాజులీలో ఉన్న ఇద్దరు ముగ్గుగు మగ మేకప్ కళాకారులలో ముక్తా ఒకడు..
ముక్తా తన ముతక ఉన్ని సంచిలోంచి మేకప్ సామగ్రిని బయటకు తీసి, పని ప్రారంభించాడు. "ఈ మేకప్ అంతా జోర్‌హాట్ నుంచి (పడవలో దాదాపు ఒకటిన్నర గంటల ప్రయాణదూరంలో ఉంటుంది) వచ్చింది," కన్సీలర్‌లు, ఫౌండేషన్ సీసాలు, కుంచెలు, క్రీమ్‌లు, ఐషాడో ప్యాలెట్‌లు, తదితర సామగ్రినంతటిని పరుపు మీద పరుస్తూ చెప్పాడతను.
ఈ రోజు మేం చూస్తున్నది మేకప్ మాత్రమే కాదు; మేం మొత్తం ప్యాకేజీని చూస్తున్నాం. ముక్తా రూమీని దుస్తులు మార్చుకోమని ఆదేశించాడు. కొద్ది నిమిషాలలోనే, అస్సామ్ సంప్రదాయ వస్త్రవిశేషమైన లేత ఊదారంగు మేఖలా చాదర్ లో ఒక యువతి ప్రత్యక్షమైంది. ఆమె కూర్చోగానే, ముక్తా ఒక రింగ్ లైట్‌ని వెలిగించి, ఆపై తన మాయాజాలాన్ని ప్రారంభించాడు.
అతను నేర్పుగా రూమీ ముఖంపై ప్రైమర్‌ను (మేకప్ చక్కగా అమరటం కోసం ముఖ చర్మం మృదువుగా వుండేలా చేయడానికి పూసే క్రీమ్ లేదా జెల్) అద్దుతూ, “నేను భావొనా (అస్సాంలో ప్రబలంగా ఉన్న మతపరమైన సందేశాలతో కూడిన సంప్రదాయ వినోదం) చూడటం ప్రారంభించినప్పుడు నా వయసు దాదాపు 9 ఏళ్లు. అప్పటి నుంచే నేను నటీనటుల అలంకరణను ఇష్టపడడం, దానిని ఆస్వాదించడం మొదలైంది," అన్నాడు ముక్తా.
అలా మేకప్ ప్రపంచంపై అతని మోహం మొదలైంది. నాటి నుంచి అతను మాజులీలో జరిగే ప్రతి పండుగలో, నాటకంలో తన మేకప్ ప్రయోగాలు చేసేవాడు..
కోవిడ్ విజృంభణకు ముందు, ముక్తా తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొంత వృత్తిపరమైన సహాయాన్ని కూడా తీసుకున్నాడు. "నేను గౌహాటీలో అస్సామీ ధారావాహికలు, సినిమాలలో పనిచేసే మేకప్ కళాకారిణి పూజా దత్తాను కమలాబారీ ఘాట్ లో కలిశాను. ఆమె కూడా మీలాగే నాతో సంభాషణ ప్రారంభించింది," అన్నాడు ముక్తా. మేకప్‌పై అతనికున్న ఆసక్తిని గమనించిన ఆమె అతనికి సహాయం చేయడానికి ముందుకొచ్చింది.
అతను రూమీ ముఖం మీద పలుచని ఫౌండేషన్ పూత వేసి మాట్లాడ్డం కొనసాగించాడు. "నాకు మేకప్ మీద ఆసక్తి ఉందని పూజ కనిపెట్టింది, గారామూర్ కాలేజీలో తాను బోధించే కోర్సుకు వచ్చి నేర్చుకోవచ్చని నాతో చెప్పింది" అన్నాడు. “మొత్తం కోర్సు 10 రోజులు కానీ నేను కేవలం మూడు రోజులు మాత్రమే వెళ్ళగలిగాను. నా హోటల్‌లో పని కారణంగా అంతకన్నా ఎక్కువ రోజులు హాజరు కాలేకపోయాను. కానీ ఆమె నుండి నేను జుట్టు గురించీ, అలంకరణ గురించీ చాలానే నేర్చుకున్నాను."’
ముక్తా ఇప్పుడు రూమీ కళ్లకు రంగు వేయడం ప్రారంభించాడు - ఇది ఆ మొత్తం ప్రక్రియలో అత్యంత క్లిష్టమైన భాగం.
అతను రూమీ కళ్ళమీద ఫ్లోరొసెంట్ ఐ-షాడోను పూస్తూ, తాను ఎక్కువగా భావొనా వంటి పండుగలలో నటించడం, నృత్యం చేయడం, పాడడం కూడా చేస్తానని మాతో చెప్పాడు. రూమీకి మేకప్ చేస్తూనే అతను ఆ పనులలో ఒకదాన్ని చేశాడు; అతను పాడటం ప్రారంభించాడు. ఉద్వేగం నిండిన గొంతుతో అతను పాడుతున్న రాతి రాతి అనే అస్సామీ పాట, ప్రియమైనవారి కోసం తపిస్తూ పాడే పాట. అతనికి యూట్యూబ్ ఛానెల్ ఉండివుంటే వేలాది మంది అభిమానులు ఉండుండేవాళ్లని మేమనుకున్నాం..
గత దశాబ్దంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌ల సహాయంతో ఎంతోమంది తమంతట తామే అభివృద్ధి చెందిన మేకప్ కళాకారులు పుట్టుకొచ్చారు. ఈ వేదికలు అలాంటి వేలాది మంది వ్యక్తులను సుప్రసిద్ధులను చేశాయి. వాటి నుండి వీక్షకులు మేకప్ ద్వారా ఆకృతిని ఎలా మార్చాలి, ఎలా దాచాలి, ఎలా రంగును సరిదిద్దాలి లాంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఈ వీడియోలలో చాలామంది కళాకారులు మేకప్ చేస్తూనే పాటలు పాడడం, ర్యాప్ చేయడం లేదా సినిమాలలోని ప్రముఖ సన్నివేశాలను నటించడం లాంటివన్నీ చేస్తారు.
“అతను చాలా మంచి నటుడు. అతని నటనను చూడటం మాకు చాలా ఇష్టం,” అని ముక్తాకు అత్యంత సన్నిహిత మిత్రుడు, రూమీ రూపాంతరాన్ని చూసేందుకు వచ్చినవారిలో ఒకడైన బనమాలి దాస్ (19) అన్నాడు. “అతను సహజ ప్రతిభ కలిగిన వ్యక్తి. ఎక్కువసార్లు రిహార్సల్ చేయాల్సిన అవసరం లేకుండానే, అతనికి అది అలా వచ్చేస్తుంది.”
ఏభైల మధ్య వయసున్న ఓ పెద్ద వయసు స్త్రీ, తెర వెనుక నుండి మమ్మల్ని చూసి నవ్వారు. ముక్తా ఆమెను తన తల్లిగా పరిచయం చేశాడు. “మా అమ్మ ప్రేమా హజారికా, మా నాన్న భాయ్ హజారికాలే నాకున్న బలం. 'నువ్వీ పని చేయలేవు' అని వాళ్లు నన్నెప్పుడూ నిరుత్సాహపరచలేదు. ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.”
అతనీ పనిని ఎంత తరచుగా చేస్తాడు, దాని వల్ల అతనికి ఏమైనా అదనపు ఆదాయం లభిస్తుందా అని మేం అడిగాం. “పెళ్లికూతురికి మేకప్ చేస్తే సాధారణంగా పది వేలు తీసుకుంటారు. నేను స్థిరమైన ఉద్యోగాలు చేసేవాళ్ల దగ్గరి నుంచి పది వేలు తీసుకుంటాను. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అలాంటి క్లయింట్ దొరుకుతారు” అని అతను చెప్పాడు. "అంత చెల్లించలేనివాళ్లను వాళ్లు ఇవ్వగలిగినంత ఇవ్వమని చెబుతాను," పత్లా లేదా తేలికపాటి మేకప్ కోసం, ముక్తా 2000 రూపాయల వరకు వసూలు చేస్తాడు. "ఇది సాధారణంగా పూజలు, షాదీలు (వివాహాలు), లేదా పార్టీలప్పుడు చేస్తుంటాను."
ముక్తా కొన్ని సుకుమారమైన నకిలీ కనురెప్పల సహాయంతో రూమీ 'రూపాన్ని' మార్చేసి, ఆమె జుట్టును వదులుగా ఉండే ముడిలాగా చుట్టేసి, ఆమె ముఖం చుట్టూ కొన్ని ఉంగరాల ముంగురులను తీర్చాడు. అది పూర్తి కాగానే, రూమీ అత్యద్భుతంగా మారిపోయింది. “బహుత్ అచ్ఛా లగ్తా హై. బహుత్ బార్ మేకప్ కియా (ఇది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు మేకప్ చేయించుకున్నా)," అని రూమీ సిగ్గుపడుతూ చెప్పింది.
మేం వెళ్ళిపోబోతుండగా, హాలులో తన పెంపుడు పిల్లి పక్కన కూర్చునివున్న ముక్తా తండ్రి, భాయ్ హజారికా(56), కనిపించారు. రూమీ ఇప్పుడెలా ఉందో, ముక్తాకి ఉన్న నైపుణ్యాల గురించీ చెప్పమని మేం ఆయన్ను అడిగాం. "నా కొడుకును చూసి, అతను చేసే ప్రతి పనిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను." అన్నాడాయన.
*****
కొన్ని రోజుల తర్వాత కమలాబారీ ఘాట్ లోని అతని రెస్టారెంట్‌లో మరోసారి భోజనం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మాకు బాగా అలవాటైపోయిన తన మృదుస్వరంతో, ముక్తా తన రోజువారీ పనుల గురించి మాకు వివరించాడు..
ప్రతిరోజూ బ్రహ్మపుత్ర మీదుగా, వేలాది మంది ప్రయాణికులు మాజులీకి వెళ్ళి వచ్చే ఘాట్ మీద అతను అడుగు పెట్టకముందే హోటల్ హజారికాలో పనులు మొదలవుతాయి. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు, ముక్తా రెండు లీటర్ల త్రాగునీటిని, దాల్ (పప్పు), ఆటా (పిండి), పంచదార, పాలు, కోడిగుడ్లను తన బైక్‌పై తీసుకొని ఘాట్ నుండి 10 నిమిషాల దూరంలో ఉన్న తన గ్రామమైన ఖోరాహోలా నుండి బయలుదేరతాడు. ఏడేళ్ళుగా- తెల్లవారుజామున లేచింది మొదలు, సాయంత్రం 4.30 గంటల వరకు, ఇదే అతని దినచర్య.
హోటల్ హజారికాలో తయారుచేసే ఆహారపదార్థాలలో చాలా వరకు వాళ్లకున్న మూడు- బిఘాల (సుమారు ఒక ఎకరం) పొలంలో పండించినవే. "మేం బియ్యం, టమోటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆవాలు, గుమ్మడికాయలు, క్యాబేజీ, మిరపకాయలను పండిస్తాం" అని ముక్తా వివరించాడు. " దూద్ వాలీ చాయ్ (పాలతో చేసిన టీ) కావాలనుకున్నప్పుడల్లా జనం ఇక్కడికి వస్తారు," అని అతను గర్వంగా చెప్పాడు; అతని పొలంలో ఉన్న 10 ఆవుల నుండే ఈ పాలు వస్తాయి.
ఫెర్రీ పాయింట్‌లో టికెట్లను అమ్మే రైతు రోహిత్ ఫుకాన్ (38), ముక్తా దుకాణానికి క్రమం తప్పకుండా వచ్చే కస్టమర్. ఆయన హోటల్ హజారికా మీద ప్రశంసలు కురిపించాడు: "ఇది చాలా మంచి దుకాణం, చాలా శుభ్రంగా ఉంటుంది."
“జనం ‘ముక్తా నువ్వు చాలా బాగా వంట చేస్తావు’ అంటారు. అది వింటే నాకు సంతోషంగా ఉంటుంది, దుకాణాన్ని ఇలాగే నడపాలనిపిస్తుంది,” అని ఈ హోటల్ హజారికా యజమాని గర్వంగా చెప్పాడు.
అయితే ముక్తా ఒకప్పుడు తాను ఊహించుకున్న జీవితం ఇది కాదు. “నేను మాజులీ కాలేజీలో సోషియాలజీ చదువుతూ పట్టభద్రుడ్ని అయినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్నాను. కానీ అది నాకు అచ్చి రాలేదు. అందుకే, దానికి బదులుగా హోటల్ హజారికా ప్రారంభించాను,” అతను మా కోసం టీ తయారు చేస్తూ చెప్పాడు. “మొదట్లో, నా స్నేహితులు నా దుకాణానికి వచ్చినప్పుడు నేను సిగ్గుపడ్డాను. వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి, నేనేమో ఇక్కడ వంటవాడిని మాత్రమే,” అన్నాడతను. “మేకప్ చేసేటప్పుడు నేను సిగ్గుపడను. వంట చేసేటప్పుడు సిగ్గుపడేవాడిని కానీ మేకప్ చేసేటప్పుడు మాత్రం కాదు."
మరి గౌహాటీ లాంటి పెద్ద నగరాలలో అవకాశాలను అన్వేషించడం ద్వారా ఈ నైపుణ్యంపై ఎందుకు ప్రత్యేకదృష్టి పెట్టకూడదు? "నేను చేయలేను, ఇక్కడ మాజులీలో నాకు బాధ్యతలున్నాయి," అని, మళ్లీ మాట్లాడటానికి ముందు కొంచెం ఆగి, "అయినా నేనెందుకు ప్రయత్నించాలి? నేను ఇక్కడే ఉండి మాజులీ అమ్మాయిలను కూడా అందంగా చూపించాలనుకుంటున్నాను." అన్నాడు.
అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఎప్పటికీ రాకపోవచ్చు, కానీ ఈరోజు తాను సంతోషంగా ఉన్నానని అతను చెప్పాడు. "నేను ప్రపంచమంతా పర్యటించాలనుకుంటున్నాను, ఎక్కడ ఏమేం ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. కానీ నాకు ఎప్పటికీ మాజులీని విడిచి వెళ్లాలని లేదు, ఇది చాలా అందమైన ప్రదేశం."
అనువాదం: రవికృష్ణ