అసలు ప్రశ్న విలువలకు సంబంధించినది. ఈ విలువలనేవి మన జీవితంలో ఒక భాగం. మనల్ని మనం ప్రకృతిలో ఒకరంగా చూసుకుంటాం. ఆదివాసీలు పోరాటం చేసేటప్పుడు ప్రభుత్వం మీదనో, కార్పొరేషన్ మీదనో పోరాడరు. వారికి వారి సొంత 'భూమి సేన' ఉంది. స్వార్థం, దురాశలలో వేర్లు లోతుగా పాతుకుపోయిన విలువలకు వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తారు.
ఇదంతా నాగరికతల పెరుగుదలతో ఆరంభమైంది. వ్యక్తివాదం పెరిగిపోవడాన్ని చూడటం మొదలైనప్పుడే, మానవుడిని ప్రకృతిలోని ఒక ప్రత్యేక అస్తిత్వంగా మనం చూడటం ప్రారంభించాం. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. నది నుండి మనల్ని మనం ఎప్పుడైతే వేరుచేసుకుంటామో, అప్పుడు మనం మన మురుగునీటి వ్యర్థాలను, మన రసాయన, పారిశ్రామిక వ్యర్థాలను ఆ నదినీటిలోకి వదిలేయడానికి ఎంతమాత్రం వెనుకాడం. మనం నదిని ఒక వనరుగా మన స్వాధీనంలోకి తీసుకోవటం ప్రారంభమవుతుంది. ఒకసారి మనల్ని మనం ప్రకృతికి భిన్నమైనవారిగా, ఉన్నతమైనవారిగా భావించడం మొదలవగానే, ప్రకృతిని దోచుకోవడం, దోపిడీ చేయడం మరింత సులభమవుతుంది. మరోవైపు, ఆదివాసీ సమాజ విలువలు కేవలం కాగితంపై రాసిపెట్టిన విలువలు కాదు. మన విలువలే మన జీవన విధానం.
నేను భూమి పిండాన్ని
నేను భూమికి మూలమైన బీజరూప పిండాన్ని
నేను సూర్యుడిని,
అనుభూతిని, తాపాన్ని,
అనంతాన్ని
నేను భిల్లును,
ముండాను, బోడోను,
గోండును, సంథాల్ను కూడా.
యుగాల క్రిందట పుట్టిన మొదటి మానవుడిని నేనే
నువ్వు నన్ను జీవించు,
నన్ను సంపూర్ణంగా జీవించు
నేను ఈ భూమిపై స్వర్గాన్ని
నేను ఈ భూమికి మూలమైన బీజరూప పిండాన్ని
నేను సూర్యుడిని,
అనుభూతిని, తాపాన్ని,
అనంతాన్ని
నేను సహ్యాద్రిని,
సాత్పురాను, వింధ్యను,
ఆరావళిని
నేను హిమాలయాల శిఖరాన్ని,
దక్షిణ సంద్రపు కొనను
కాంతులీనే ఆకుపచ్చ ఈశాన్యాన్ని నేను
మీరు ఎక్కడ చెట్టును నరికినా,
ఎప్పుడు పర్వతాన్ని విక్రయించినా
నన్ను వేలం వేస్తారు
నువ్వు నదిని చంపినప్పుడు నేను ప్రాణాలు విడుస్తాను
మీ శ్వాసలో నన్ను పీల్చుకోండి
నేనే జీవనామృతాన్ని
భూమికి మూలమైన బీజరూప పిండాన్ని
నేను సూర్యుడిని,
అనుభూతిని, తాపాన్ని,
అనంతాన్ని
మీరు నా సంతానం
నా రక్తం కూడా.
ప్రలోభాల,
దురాశల, అధికారాల అంధకారం
వాస్తవ ప్రపంచాన్ని చూడనివ్వదు
మీరు భూమిని,
భూమి అనే పిలుస్తారు,
భూమి మాకు అమ్మ
మీరు నదిని నది అని పిలుస్తారు
నది మా సోదరి
పర్వతాలు మీకు పర్వతాలు మాత్రమే,
అవే మా సోదరులమంటాయి
సూర్యుడు మా తాత
చంద్రుడు మా మేనమామ.
ఈ అనుబంధం కోసమే
మీకూ నాకూ మధ్య
నేనొక గీతను గీయాలని వాళ్ళంటున్నారు
కానీ నేను చెవినపెట్టడంలేదు.
నేను నమ్ముతాను
మీకు మీరే కరిగిపోతారని.
నేను మంచును పీల్చుకునే వేడిని
నేను భూమికిమూలమైన బీజరూప పిండాన్ని
నేనే సూర్యుడిని,
అనుభూతిని, తాపాన్ని,
అనంతాన్ని
అనువాదం: సుధామయి సత్తెనపల్లి