కనుచీకటి పడుతోన్న సమయంలో అతను పాడుబడిన తోటలోకి నడిచాడు. బల్ల మీద కూర్చుని, ఒక పెద్ద కర్రనీ, చిన్న ఫోన్‌నీ తన పక్కనే ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం కాలవ్యవధిలో ఆ తోట అలా నిశ్శబ్దంగా ఉండడం ఇది రెండవసారి. పిల్లలూ పెద్దలందరూ మరోసారి తమ ఇళ్లకు తాళాలు వేశారు.

అతను కొన్ని రోజులుగా ఆ తోటకు వస్తున్నాడు. చీకటి పడి వీధి దీపాలు వెలుగుతుండగా, కొమ్మలు నేలపై నీడలు పరిచాయి. చెట్లు కాసింత గాలిని అందించాయి, నేలపై ఎగురుతూ తిరుగాడుతున్న ఎండు ఆకులు పరధ్యానంగా ఆటలాడాయి. అయినప్పటికీ, అతనిలోని చీకటి మరింత లోతుగా పాతుకుపోయింది. నిశ్శబ్దంగా, లోలోపల వెంటాడుతున్న జ్ఞాపకాలతో అతనలా గంటల తరబడి కూర్చునే ఉన్నాడు.

20 ఏళ్ల వయస్సులో ఉన్న ఆ యువకుడు ఇక్కడ కొందరికి సుపరిచితుడు - కాని చాలామందికి అతను అపరిచితుడే. అతని యూనిఫామ్ అతను చేసే పనిని సూచిస్తోంది. సమీపంలోనే ఉన్న ఒక భవనంలో అతను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతని పేరు...తెలియదు. దానితో ఎవరికేం అవసరం? ఏడు సంవత్సరాల కాపలా పని తరువాత కూడా తాను పనిచేస్తోన్న అపార్ట్‌మెంట్ సొంతదారులకు అతనెవరో పరిచయం లేనివాడు

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ నుంచి అతనిక్కడికి వచ్చాడు. అక్కడ అతని తండ్రి - స్థానికంగా ఒక కవీ, కథకుడూ. తన అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకుగాను ఆయన చంపబడ్డాడు. అతని రచనలూ, పుస్తకాలూ –అవే అతని విలువైన ఆస్తులు – ఆగ్రహజ్వాలల్లో కాలిపోయాయి. విరిగి, కాలిపోయిన గుడిసె మాత్రం  అలాగే ఉంది. అదేవిధంగా మనసు విరిగి భయపడుతూవున్న ఒక తల్లి , ఆమె పదేళ్ల కొడుకు అందులో ఉంటున్నారు. ఆమెలో భయం వ్యాపించింది. వాళ్ళొకవేళ  తన పిల్లాడిని కూడా తీసుకెళ్ళిపోతే? ఆ భయంతోనే ఆమె, వీలైనంత దూరం పరుగెత్తమని తన పిల్లవాడికి చెప్పింది.

అతను చదువుకోవాలనుకున్నాడు, పెద్ద పెద్ద బూట్లు తొడుక్కోవాలనుకున్నాడు. కానీ తానాశ్రయించిన ముంబై నగరంలోని రైల్వే స్టేషన్లలో బూట్లు శుభ్రం చేస్తున్నాడు. అతను కాలువలను శుభ్రం చేశాడు, నిర్మాణ స్థలాల్లో పనిచేశాడు. క్రమంగా తనను తాను గార్డు హోదాకు పెంచుకున్నాడు. తన తల్లికి డబ్బు పంపించేందుకు ఆ ఉద్యోగం సరిపోయేది. త్వరలోనే తల్లి అతనికి పెళ్ళి జరగాలని కోరుకుంది.

తల్లి ఒక మంచి యువతిని చూసిపెట్టింది. చురుకైన చూపున్న ఆమె నల్లని కళ్ళను చూసి అతను ముగ్ధుడయ్యాడు. మధున భంగీకి అప్పటికి 17 ఏళ్లు. సరిగ్గా తన పేరుకు తగ్గట్టే ఆమె మధురమైనది, ఆహ్లాదకరమైనది. పెళ్లి తర్వాత అతనామెను ముంబైకి తీసుకొచ్చాడు. అప్పటి వరకు నాలాసోపారాలోని ఒక చిన్న చాల్‌(గది)లో 10 మంది మగవాళ్ళతో కలిసి ఉండేవాడతను. ఇప్పుడు తనతోపాటు మధున కూడా ఉండాలి కాబట్టి, కొన్ని రోజుల కోసం స్నేహితుడి గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆమె ఎప్పుడూ అతన్ని అంటిపెట్టుకుని ఉండేది. బెదరగొట్టే రైలు ప్రయాణం,, ఎత్తైన భవనాలు, ఇరుకిరుగ్గా ఉండే ఆ బస్తీలో ఆమె జీవించలేకపోయింది. త్వరలోనే చెప్పేసింది: “నేనింక ఇక్కడ ఉండలేను. ఇక్కడ గాలి మా ఊరిగాలిలా లేదు.” తన ఊరిని విడిచిపెట్టినప్పుడు ఈ గార్డ్ కూడా అచ్చం ఇలాగే భావించాడు.

ఇంకొన్ని రోజులలో మధునకు బిడ్డ పుట్టబోతుంది. అందుకని ఆమె తమ ఊరికి తిరిగి వెళ్లిపోయింది. తాను కూడా ఆమెతో ఉండాలనుకొని వెళ్ళేందుకు సిద్ధపడుతుండగానే లాక్‌డౌన్ గార్డుని పోనీకుండా ఆపేసింది. అతను సెలవు కోసం వేడుకున్నాడు కానీ అందుకు అతని యజమానులు నిరాకరించారు. ఇంటికి వెళ్తే మాత్రం అతను తిరిగి వచ్చేసరికి ఈ ఉద్యోగం ఉండదని హెచ్చరించారు. అంతే కాకుండా తాను ఇంటికి వెళ్తే తన బిడ్డకి కూడా ఈ కొత్త బీమారీ (జబ్బు) సోకే అవకాశం ఉందని వారు వివరించారు.

గార్డు వారి అక్కర చూసి తనను తాను ఓదార్చుకున్నాడు (నిజానికి వారి అక్కర తమ భవనానికి కాపలా లేకుండా ఉంచడం గురించి). ఇది కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటుందని అతననుకున్నాడు. డబ్బు ముఖ్యమైనది - తాను చిన్నతనంలో ఆశించి పొందలేకపోయినదంతా ఇప్పుడు తన బిడ్డకు ఇవ్వాలని అతను కోరుకున్నాడు. కొంతకాలం క్రితం, అతను బజారు లోఒక బుల్లి పసుపు రంగు దుస్తును చూశాడు. దుకాణం తిరిగి తెరిచిన తర్వాత, తన బిడ్డ కోసం ఆ పసుపు రంగు దుస్తులతో పాటు మధునకు చీర కూడా కొనాలనుకున్నాడు. అతని అశాంతి అంతటినీ తన నవజాత శిశువుకోసం కన్న కలలు పూరించాయి.

ఊరిలో ఉన్న మధున దగ్గర ఫోన్ లేదు. అందుకు తోడు సిగ్నల్స్ కూడా దాగుడుమూతలు ఆడుతుండేవి. గార్డు తన నంబర్ రాసిచ్చిన పర్చీ (చీటీ)ని తీసుకొని ఆమె కిరాణా దుకాణం దగ్గర ఉన్న ఫోన్ బూత్‌కు వెళ్లేది. ఆ సమయంలో దుకాణాలు మూతపడటంతో, ఆమె పొరుగువారి దగ్గరనుండి మొబైల్ అరువు తీసుకునేది.

ఇంటికి తిరిగి రావాలని ఆమె భర్తను వేడుకుంది. అతనేమో ఎటూ కదిలే వీలు లేక ముంబైలోనే ఉండిపోయాడు. కొన్ని వారాల తర్వాత అతనికి వార్త వచ్చింది: అతని భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారు ఆమెకు ఇంకా పేరు పెట్టలేదు. మొదట తన భర్త ఆ బిడ్డను చూడాలని మధున కోరుకుంది.

అర్ధరాత్రి దీపాలు మసకబారటంతో, గార్డు తన నైట్ రౌండ్స్ ప్రారంభించడానికి తోటలోని బెంచీ మీద నుంచి లేచాడు. ఫ్లాట్లన్నీ వెలిగిపోతున్నాయి. అక్కడక్కడా టెలివిజన్ తెరల కాంతి కిటికీలగుండా ప్రసారమవుతోంది. ఒక చిన్న బిడ్డ కిలకిల నవ్వు వినిపిస్తోంది. ప్రెషర్ కుక్కర్లు కూతపెడుతున్నాయి.

లాక్‌డౌన్ సమయంలో అతను రాత్రీ పగలూ అన్నివేళల్లో ఆహారపు ఆర్డర్లను ఫ్లాట్‌ల వరకూ తీసుకెళ్తూ ఉండేవాడు. తన మధునకూ, బిడ్డకూ తినటానికి చాలినంత ఉండేవుంటుందని అతను ఆశించాడు. ఫ్లాట్లలో ఉండేవారు అనారోగ్యంతో ఉంటే, వారిని  అంబులెన్స్‌ల దగ్గరకు తీసుకెళ్లడంలో అతను సహాయం చేసేవాడు. మెల్లిగా ఆ బీమారీ తనకు కూడా ఏదో రోజు తగులుతుందని అతను మరిచిపోయాడు. వైరస్ సోకిన సహోద్యోగి ఒకరిని ఉద్యోగం నుండి తొలగించడాన్ని అతను కళ్లారా చూశాడు. తన ఉద్యోగం కూడా పోతుందనే భయంతో గార్డు మౌనంగా దగ్గాడు.

భవనంలో పని చేయడానికి తిరిగి అనుమతించమని వేడుకుంటున్న ఒక పనిమనిషిని అతను చూశాడు. ఆమె కొడుకు ఆకలితోనూ క్షయవ్యాధితోనూ బలహీనంగా ఉన్నాడు. ఆమె భర్త వారు  పొదుపు చేసుకున్న డబ్బు మొత్తాన్నీ తీసుకొని ఎటో వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత, ఆమె తన చిన్న బిడ్డతో కలిసి వీధుల్లో అడుక్కోవడాన్ని గార్డు చూశాడు.

కూరగాయల వ్యాపారి ఠేలా ను స్థానికంగా ఉండే దుండగులు కొందరు తలకిందులు చేయడాన్ని అతను చూశాడు. దాంతో ఆ వ్యాపారి జీవితమే తలక్రిందులైంది. అతను పని చేయడానికి అనుమతించమని వేడుకున్నాడు, ఏడ్చాడు, అరిచాడు - ఆ రోజు ఇఫ్తార్ కోసం అతని వద్ద ఏమీ లేదు. అతని కోసం అతని కుటుంబం ఎదురుచూస్తోంది. పని చేస్తూ ఉంటే అతనికి వ్యాధి సోకుతుందనీ, అందుకే అతన్ని తాము కాపాడుతున్నామనీ ఆ గూండాలు చెప్పారు. వాళ్ళు అతని ఠేలా ను తలకిందులు చేసినప్పుడు కూరగాయలన్నీ వీధిలో పెద్ద బఫే లాగా చిందరవందరగా పడిపోయాయి. అతను ఆ కూరగాయలను ఒక్కొక్కటిగా తన చొక్కాలోకి తీసుకున్నాడు. ఎర్రని టమోటాలు అతని చొక్కాని ఎరుపు రంగులోకి మార్చేశాయి. ఇంతలోనే బరువెక్కువై అవన్నీ దొర్లిపోయాయి...

చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్నవారు కిటికీల నుండి ఇదంతా చూస్తూ, వారి ఫోన్‌లలో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. ఆ వీడియోలు, కొందరు కోపంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాసిన పోస్టులు సోషల్ మీడియాలో ప్రసారం చేయబడ్డాయి.

కొంతకాలం క్రితం అతను బజారులోఒక బుల్లి పసుపు రంగు దుస్తును చూశాడు. దుకాణం తిరిగి తెరిచిన తర్వాత, ఆ పసుపురంగు దుస్తులనూ, మధున కోసం ఒక  చీరను కూడా కొనాలనుకున్నాడు

డిసెంబరు నాటికి, ఇతర గార్డులు తిరిగి పనికి రావడం ప్రారంభించినప్పుడు, మన గార్డు తన గ్రామానికి వెళ్ళిరావచ్చని ఆశపడ్డాడు. కానీ పని కోసం వెతుక్కుంటూ కొత్తవారు వచ్చేవారు. అతను పనికోసం వారు పడే ఆతృతనూ, అసూయతో తన వైపు చూసే చూపునూ గమనించాడు. ఇప్పుడు గనుక వెళ్లిపోతే తన ఉద్యోగం పోతుందని అర్థమైన గార్డు, మరికొంత కాలం అక్కడే బలవంతంగా ఉండిపోయాడు. ఎంతైనా ఇదంతా మధున కోసం, తమ బిడ్డ కోసమే కదా. అప్పు చెల్లించమని గ్రామ భూస్వామి చేసే వేధింపుల గురించి, లేదా ఎలాగోలా తాను తినగలుగుతున్న కొద్దిపాటి ఆహారం గురించి ఆమె ఎన్నడూ ఫిర్యాదు చేయదని అతనికి తెలుసు.

ఆ తర్వాత మరొక లాక్‌డౌన్ వార్తలు వచ్చాయి. అంబులెన్స్‌ల రోదనలు ఆగకుండా వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి పరిస్థితి మునుపటి సంవత్సరం కంటే కూడా దారుణంగా ఉంది. వృద్ధుడైన ఒక తండ్రికి పరీక్షలో పాజిటివ్ వచ్చినపుడు ఆయనను ఇంటి నుండి బయటకు తోసేయటం అతను చూశాడు. అరుస్తోన్న చిన్న పిల్లలను ఆసుపత్రులకు తీసుకెళ్లడం చూశాడు.

అతను పని చేస్తూనే ఉన్నాడు, త్వరలోనే ఇంటికి వస్తానని మధునకు వాగ్దానం చేశాడు. ఆమె ప్రతిసారీ ఏడ్చేది, భయపడేది: "నిన్ను నువ్వు కాపాడుకో. మాకు నువ్వు మాత్రమే కావాలి. మన పాపకి ఇంకా తన తండ్రి ఉనికి కూడా తెలియదు." ఆమె మాటలు అతనిని చీల్చివేశాయి, అయితే ఆమె గొంతు అతనికి ఓదార్పునిచ్చింది. వారిద్దరికీ ఆ కొద్ది నిమిషాల ఫోన్ సంభాషణలే ప్రపంచం. వారు మాట్లాడుకున్నది కొంచమే, కానీ దూరం నుంచి కూడా ఒకరి ఊపిరిని మరొకరు వింటూ కొంత సాంత్వన పొందేవారు.

తర్వాత మరో కాల్ వచ్చింది: “ఒక్క ఆసుపత్రి కూడా వారిని చేర్చుకోలేదు. ఆసుపత్రులలో పడకలు నిండిపోయాయి, ఆక్సిజన్ లేదు. నీ భార్య, బిడ్డ చివరి వరకూ ఊపిరి అందక బాధపడ్డారు,” అంటూ భయాందోళనలకు గురైన ఆ గ్రామస్థుడు తన స్వంత తండ్రి కోసం ఆక్సిజన్ ట్యాంక్ కోసం వెతుక్కుంటూ పరుగులుపెట్టాడు. ఊపిరి కోసం గ్రామం మొత్తం వేడుకుంటున్నది.

అప్పటి వరకు గార్డును పట్టివుంచిన ఆ బలహీనమైన దారం తెగిపోయింది. అతని మాలిక్ (యజమాని) చివరకు అతనికి చుట్టి (సెలవు) ఇచ్చాడు. ఇప్పుడయితే, అతను ఎవరికోసం తిరిగి వెళ్తాడు? ఆహార ప్యాకెట్లు తీసుకుని మళ్లీ ‘డ్యూటీకి వచ్చాడు. ఆ చిన్ని పసుపు రంగు దుస్తులు, చీర అతని చిన్న సంచిలో జాగ్రత్తగా సర్దిపెట్టి ఉన్నాయి. మధున, ఇంకా పేరుపెట్టని అతని బిడ్డ ఎక్కడో కాలిపోయో లేదా పూడ్చిపెట్టబడో ఉన్నారు.

అనువాదం: జి. విష్ణువర్ధన్

Aakanksha

আকাঙ্ক্ষা পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার একজন সাংবাদিক এবং ফটোগ্রাফার। পারি'র এডুকেশন বিভাগে কনটেন্ট সম্পাদক রূপে তিনি গ্রামীণ এলাকার শিক্ষার্থীদের তাদের চারপাশের নানান বিষয় নথিভুক্ত করতে প্রশিক্ষণ দেন।

Other stories by Aakanksha
Illustrations : Antara Raman

বেঙ্গালুরুর সৃষ্টি ইন্সটিটিউট অফ আর্ট, ডিজাইন অ্যান্ড টেকনোলজির স্নাতক অন্তরা রামন একজন অঙ্কনশিল্পী এবং ওয়েবসাইট ডিজাইনার। সামাজিক প্রকরণ ও পৌরাণিকীতে উৎসাহী অন্তরা বিশ্বাস করেন যে শিল্প ও দৃশ্যকল্পের দুনিয়া আদতে মিথোজীবী।

Other stories by Antara Raman
Editor : Sharmila Joshi

শর্মিলা জোশী পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার (পারি) পূর্বতন প্রধান সম্পাদক। তিনি লেখালিখি, গবেষণা এবং শিক্ষকতার সঙ্গে যুক্ত।

Other stories by শর্মিলা জোশী
Translator : G. Vishnu Vardhan

G. Vishnu Vardhan obtained a Post-graduation Diploma in Rural development and management from Hyderbad. Currently he works with ICRISAT in tribal agency area of Utnoor, Telangana.

Other stories by G. Vishnu Vardhan