ఈ రోజు మనం 170 మంది వ్యక్తులతో కూడిన, PARI ఏకైక అనువాద బృందంలో అద్భుత విజయాలు జరుపుకుంటున్నాము. ఇందులో ప్రతీ నెల కనీసం 45 మంది క్రియాశీలకంగా పాల్గొంటారు. ఇలా మేమంతా ఈ సంస్థలో ఉన్నతమైన ఉద్దేశాలతో పనిచేస్తున్నాము. ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 30 వ తేదీని అంతర్జాతీయ అనువాద దినం గా ప్రకటించింది.
ఈ రోజు, అనువాదకుల గురించి UN, "భాషా నిపుణుల పనికి నివాళి అర్పించడానికి ఒక అవకాశం, ఇది దేశాలను ఒకచోట చేర్చడంలో, సంభాషణ, అవగాహన మరియు సహకారాన్ని సులభతరం చేయడంలో, అభివృద్ధికి దోహదం చేయడం ..." ఇంకా చాలా పనులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని తెలియ చెప్పింది. కాబట్టి ఈ రోజు, వేరే ఏ ఇతర జర్నలిజం వెబ్సైట్లోను మాకు సమానమైన అనువాద బృందం లేదని మేము నమ్ముతూ వారికి వందనం అర్పిస్తున్నాము.
మా అనువాదకులలో వైద్యులు, భౌతిక శాస్త్రవేత్తలు, భాషావేత్తలు, కవులు, గృహిణులు, ఉపాధ్యాయులు, కళాకారులు, పాత్రికేయులు, రచయితలు, ఇంజనీర్లు, విద్యార్థులు, ప్రొఫెసర్లు ఉన్నారు. మా అనువాదకులలో అతి పెద్దవారి వయసు 84 అయితే అతి చిన్నవారి వయసు 22. ఇందులో కొందరు ప్రవాస భారతీయులు అయితే మరి కొందరు దేశంలోని మారుమూల ప్రదేశాలలో, చాలా తక్కువ అంతర్జాల కనెక్టివిటీతో నివసిస్తున్న వారు ఉన్నారు.
PARI యొక్క భారీ అనువాద కార్యక్రమం, తనకున్న పరిమితులు, స్థాయిలతో, ఈ దేశాన్ని కూడగట్టి, దేశపు భాషల పట్ల గౌరవాన్ని, సమానమైన స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. PARI సైట్‌లోని ప్రతి కథనం 13 భాషల్లో అందుబాటులో ఉంది - లేదా అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ 13 భాషలలో ఒక సాధారణ PARI ప్రచురణ ఉంది: మన స్వాతంత్ర్యాల కై భగత్ సింగ్ జుగ్గియన్ పోరాటం . ఇప్పటిదాకా మా బృందం దాదాపు 6,000 ప్రచురణలు చేసింది, వాటిలో చాలా ప్రచురణలు మల్టీమీడియా ద్వారా జరిగాయి.
PARI భారతీయ భాషలకు చాలా విలువనిస్తుంది - లేదంటే మేము కేవలం ఇంగ్లీష్ పైనే దృష్టి ఉంచి, సమాచార లభ్యతను పెంచేవారిమి. కానీ అలా చేస్తే ఇంగ్లిష్ భాష రాని గ్రామీణ భారతీయులలో ఎక్కువమందిని మేము పట్టించుకోని వారిమి అవుతాము. మన దేశంలో 800 సజీవ భాషలు ఉన్నాయని, పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా చెబుతుంది. గత 50 ఏళ్లలో 225 భారతీయ భాషలు అంతరించిపోయాయి. భారతదేశం యొక్క బహుళ, విభిన్న సంస్కృతుల మధ్య, ఆయా భాషలు ఆయువుపట్టు అని మేము అనుకుంటాము. కేవలం ఇంగ్లీష్ వచ్చిన వారికి మాత్రమే కాక ప్రతి ఒక్కరికి నాణ్యమైన సమాచారం అందుకునేందుకు, జ్ఞానాన్ని పెంచుకునేందుకు హక్కు ఉందని మేము భావిస్తాము.
BBC వంటి భారీ మీడియా కార్యకలాపాలు ఉన్నాయి - ఇవి 40 భాషల్లో ప్రసారం చేస్తున్నాయి. కానీ ఇది తరచుగా విభిన్న భాషలలో విభిన్న సమాచారాన్ని అందిస్తుంది. భారతదేశంలో కూడా, కార్పొరేట్ యాజమాన్యంలోని ఛానెల్‌లు అనేక భాషలలో సమాచారాన్ని అందిస్తున్నాయి. వాటిలో అతిపెద్దది 12 భాషలో పనిచేస్తుంది.
కానీ PARI - ఇది నిజానికి అనువాద కార్యక్రమం . ఇక్కడ వెబ్సైట్లో ఆంగ్లంలో అందించే ప్రతి భాగం, 12 ఇతర భాషలలో అందుబాటులో ఉంటుంది. మూల వ్యాస ప్రచురణా సమయానికి దగ్గరగా అనువాదాలు కూడా ప్రచురితమవుతున్నాయి. 13 భాషలలో ప్రతి భాషకు ఒక ప్రత్యేక ఎడిటర్ ఉన్నారు. త్వరలో ఛత్తీస్‌గఢీ, సంతాలిని భాషలను కూడా మేము ప్రచురించే భాషల జాబితాలో చేర్చాలనుకుంటున్నాము.
ముఖ్యంగా, PARI అనువాదాలు కేవలం భాషాపరమైన చర్య మాత్రమే కాదు, లేదా ప్రతీదీ ఇంగ్లీష్ లో మాత్రమే చదివించడంతో పరిమితం చేయడం కాదు. మనకు తెలిసిన ప్రపంచాలకావల చేరుకొని, తెలియని ఆయా ప్రదేశాల విషయాలను మనకు తెలియజేయడం దీని ముఖ్యోద్దేశం. మా అనువాదకులు బహుళ భారతీయ భాషలలో భారతదేశ ఉనికిని తెలియజేస్తారు. అలాగే కేవలం భాష నుండి పదజాలం అనువాదం చేయడం మాత్రమే మా విధానం కాదు- అటువంటి పధ్ధతి పాటిస్తే వచ్చే హాస్యభరితమైన ఫలితాలు Google అనువాదాలలో తరచుగా చూస్తూనే ఉంటాము. మా బృందం, కథనాలలోని సున్నితత్వాన్ని, సందర్భాన్ని, సన్నివేశాన్ని, సంస్కృతిని, సామెతలను, అతి చిన్న వివరాలను తమ అనువాదంలో ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అలానే ప్రతి కథనాన్ని అనువదించాక, వేరొకరు ఆ అనువాదాన్ని సమీక్షించి, తప్పులు సవరించి, ఆ అనువాద నాణ్యతను పెంచి ప్రచురణకు పంపుతారు.
మా యువ PARI ఎడ్యుకేషన్ విభాగం కూడా భారతీయ భాషలలో తన ఉనికిని చాటుకోవడం ప్రారంభించింది. సమాజంలో ఇంగ్లీషు ఒక సాధనంగా, ఆయుధంగా మారితే, అనేక భాషల్లో కనిపించే ఒకే వ్యాసం అనేక విధాలుగా సహాయపడుతుంది. విద్యార్థులు - ప్రైవేట్ ట్యూషన్లు లేదా ఖరీదైన రెమిడియల్ కోర్సులు పొందలేని వారితో సహా - వారి ఇంగ్లీషును మెరుగుపరచడంలో PARI సహాయపడుతుందని మాకు చెప్పారు. వారు తమ మాతృభాషలో అదే వ్యాసాన్ని చదవగలరు, ఆపై మళ్లీ ఇంగ్లీష్‌లో (లేదా హిందీ లేదా మరాఠీ ... ఏ భాషను నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ భాషలో) కూడా చదవగలరు. ఇదంతా ఉచితంగానే. PARI ప్రచురణలు చదవడానికి ఎటువంటి చందాలు కట్టనవసరం లేదు.
మీరు దాదాపు 300 వీడియో ఇంటర్వ్యూలు, చలనచిత్రాలు, డాక్యుమెంటరీలు భారతీయ భాషలలో - ఇప్పుడు ఇంగ్లీష్, ఇతర భాషల సబ్ టైటిళ్లతో చూడవచ్చు.
హిందీ, ఒడియా, ఉర్దూ, బంగ్లా, మరాఠీ భాషలలో స్థానికీకరించిన, స్వతంత్ర సైట్లుగా కూడా PARI అందుబాటులో ఉంది. త్వరలో తమిళం, అస్సామీస్ భాషలలో కూడా మొదలవుతుంది. మేము ఇంగ్లీష్‌తో పాటు హిందీ, ఉర్దూ, తమిళంలో కూడా సోషల్ మీడియాలో చురుకుగా పని చేస్తున్నాము. అంటే, ఎన్నీ భాషల వాలంటీర్లు ఉంటే, అన్ని భాషలలోనూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండగలము.
వాలంటీర్ల
సహకారాన్ని,
విరాళాలను
పెంచితే PARI కార్యకలాపాలను మరింతగా విస్తరించగలమని, అందుకు సహకరించమని పాఠకులకు మా అభ్యర్ధన. ముఖ్యంగా, తరవాత పెద్ద విభాగమైన - అంతరించిపోతున్న భాషలపై పనిచేయడం ప్రారంభించేందుకు మీ సహకారం ఎంతో ఉపయోగపడుతుంది . ఇక మనం ఈ విధంగా చూడాలి:
ప్రతి భారతీయ భాష, మన భాష.
అనువాదం
:
అపర్ణ
తోట