తిప్పి తిప్పి చూస్తే ఆమె వయసు 22 ఏళ్ళు మాత్రమే, అయినా ఇప్పటికే మూడునాలుగేళ్ళుగా ఆరోగ్య సమస్యలతో అలసిపోయుంది మీనూ సర్దార్. 2021 వేసవిలోని ఆమె ఆ ఉదయం వేళ నీరు తీసుకురావడానికి బయలుదేరినప్పుడు, ఏదో ఘోరం జరగబోతోందనే ముందస్తు హెచ్చరిక ఏమి రాలేదు. దయాపూర్ గ్రామంలోని చెరువుకు వెళ్లే మెట్టదారి కొన్నిచోట్ల పగిలిపోయింది. మీనూ మెట్ల మీద జారిపడి, దొర్లుకుంటూ వెళ్ళి బోర్లా పడిపోయింది.

"నా ఛాతీలో, కడుపులో విపరీతమైన నొప్పిగా ఉండింది," అని ఆమె బెంగాలీలో వివరించారు. “యోని నుండి రక్తస్రావం మొదలైంది. నేను బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు, లోపలి నుండి ఏదో జారి నేలపై పడిపోయింది. నా నుండి ఒక మాంసం లాంటి పదార్ధం బయటకు వస్తుండటం గమనించాను. నేను దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించాను, కానీ మొత్తాన్ని తీయలేకపోయాను.”

సమీప గ్రామంలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌ను సందర్శించగా, గర్భస్రావం జరిగినట్లు నిర్ధారించారు. ఎన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ పొడుగ్గా, సన్నగా, చిరునవ్వుతో ఉండే మీనూ, అప్పటి నుండి తీవ్రమైన శారీరక నొప్పి, మానసిక క్షోభకు గురైంది. దానితో పాటు ఆమెకు బహిష్టులు కూడా సక్రమంగా రావడంలేదు.

పశ్చిమ బెంగాల్‌, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గోసాబా బ్లాక్‌లో ఉండే మీనూవాళ్ళ గ్రామంలో సుమారు 5,000 మంది జనాభా ఉన్నారు. విశాలంగా విస్తరించివున్న వరి పొలాలతో, సుందర్‌బన్లలోని మడ అడవులతో ఈ ప్రాంతమంతా పచ్చగా ఉంటుంది. గోసాబా బ్లాక్‌లో రోడ్డుకు అనుసంధానించబడి ఉన్న కొన్ని లోతట్టు గ్రామాలలో ఈ గ్రామం కూడా ఒకటి.

మీనూకి మెట్లమీంచి జారిపడిన తర్వాత నెల రోజులకు పైగా విరామం లేకుండా రక్తస్రావం అయింది. ఆమె బాధలు అంతటితోనే ముగియలేదు. " శారీరిక్ సంపొర్కో ఎతో వ్యథా కొరే [లైంగిక సంభోగం చాలా బాధాకరమైనది]," అని ఆమె చెప్పారు. “నేను రెండుగా చీలిపోతున్నట్లు అనిపిస్తుంది. మలాన్ని విసర్జించవలసి వచ్చినప్పుడు, ఒత్తిడిని కలిగించవలసి వచ్చినప్పుడు, లేదా బరువైన వస్తువులను ఎత్తినప్పుడు, నా గర్భాశయం క్రిందికి జారుతున్నట్లు నాకు తెలిసిపోతోంది.”

Meenu Sardar was bleeding for over a month after a miscarriage
PHOTO • Ritayan Mukherjee

గర్భస్రావం అయిన తరవాత నెలరోజులకు పైగా మీనూ సర్దార్‌కు రక్తస్రావం అవుతూనే ఉంది .

పరిస్థితులు, అలవాటు చేయబడిన పద్ధతులు (కండిషనింగ్) ఆమె బాధను మరింతగా పెంచాయి. జారిపడినప్పటినుండి యోని నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న, 10వ తరగతికి మించి చదవని మీను, దయాపూర్‌లోని ఆశా(ASHA) (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) కార్యకర్తని సంప్రదించకూడదని నిర్ణయించుకుంది. “నా గర్భస్రావం గురించి ఆమెకు తెలియకూడని అనుకున్నాను. ఎందుకంటే ఆమెకి తెలిస్తే, ఈ సంగతి మా గ్రామంలోని ఇతరులకు కూడా తెలిసిపోతుంది. అదీగాక, ఆమెకు ఏమి చేయాలో తెలియదని కూడా నేను అనుకుంటున్నా." అన్నది మీను.

మీనూ, ఆమె భర్త బప్పా సర్దార్‌లు బిడ్డను కనాలని అనుకోలేదు. అయితే, ఆ సమయంలో ఆమె ఎటువంటి గర్భనిరోధకాలను ఉపయోగించలేదు. “నాకు పెళ్లయ్యాక కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలియదు. నాకు ఎవరూ చెప్పలేదు. గర్భస్రావం అయిన తర్వాత మాత్రమే నేను దాని గురించి తెలుసుకున్నాను."

దయాపూర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోసాబా రూరల్ హాస్పిటల్‌లో ఉన్న ఏకైక మహిళా గైనకాలజిస్ట్ గురించి మీనుకు తెలుసు, కానీ ఆమె ఎప్పుడూ అందుబాటులో ఉండేది కాదు. గ్రామంలో వైద్యసహాయాన్ని అందించే ఇద్దరు లైసెన్స్ లేని రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎమ్‌పిలు) ఉన్నారు.

దయాపూర్‌లో ఉన్న ఆర్ఎమ్‌పిలు ఇద్దరూ మగవాళ్ళు.

"నా సమస్యను గురించి ఒక మగవాడితో చెప్పటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. అదీగాక, వాళ్ళంత నైపుణ్యం కలిగినవాళ్ళు కూడా కాదు." అని మీనూ అంటుంది.

మీనూ, బప్పాలు జిల్లాలోని అనేకమంది ప్రైవేట్ వైద్యులను కలిశారు, రూ. 10,000కు పైగా ఖర్చుపెట్టి కొల్‌కతాలో కూడా ఒక డాక్టర్‌ని కలిశారు కానీ, ఏం లాభంలేకపోయింది. ఈ జంట ఏకైక ఆదాయ వనరు, బప్పా పనిచేసే చిన్న కిరాణా దుకాణం నుండి అతనికి జీతంగా వచ్చే రూ.5,000 మాత్రమే. ఈ వైద్య సలహాలన్నిటి కోసం అతను స్నేహితుల దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు.

A number of women in the Sundarbans have had hysterectomy, travelling to hospitals 4-5 hours away for the surgery
PHOTO • Ritayan Mukherjee
A number of women in the Sundarbans have had hysterectomy, travelling to hospitals 4-5 hours away for the surgery
PHOTO • Ritayan Mukherjee

సుందర్ బన్లలోని చాలామంది మహిళలు శస్త్రచికిత్స కోసం 4-5 గంటల ప్రయాణదూరంలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళి , శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని తొలగించుకున్నారు ( హిస్టరెక్టమీ )

దయాపూర్‌లోని ఒక హోమియోపతి డాక్టర్ ఇచ్చిన మాత్రల కోర్సు వాడిన తర్వతనే ఆమె ఋతుచక్రం తిరిగి మామూలయింది. తన గర్భస్రావం గురించి సౌకర్యంగా చర్చించగలిగిన ఏకైక వైద్యుడు ఆయనేనని మీనూ చెప్పింది. ఆమె యోని నుంచి కొనసాగుతున్న రక్తస్రావం, తీవ్రమైన అసౌకర్యానికి గల కారణాన్ని నిర్ధారించడానికి ఉదరభాగంలో అల్ట్రాసౌండ్ చేయించుకోమని అతను సూచించాడు. అందుకోసం మీనూ తగినంత డబ్బు ఆదా అయ్యేవరకూ వేచి ఉండాల్సిందే.

అప్పటివరకూ ఆమె బరువైన వస్తువులను ఎత్తకూడదు, ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూవుండాలి.

తమ ఆరోగ్య సంరక్షణను కోసం మీనూలా అన్ని చోట్లకూ ప్రదక్షిణలు చేయటమే సుందర్‌బన్ల గ్రామాల్లోని ఆడవారికి తెలుసు.

భారతీయ సుందర్‌బన్స్‌లోని ఆరోగ్య వ్యవస్థపై 2016లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఇక్కడ నివాసితులకు ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి అవకాశాలు లేవు. ప్రజానిధుల ద్వారా సమకూర్చే సౌకర్యాలు "ఉనికిలో ఉండవు లేదా పని చేయవు". ఇక్కడికి చేరుకునేందుకు సరైన మార్గాలు లేనందున, క్రియాత్మక సౌకర్యాలు ఉన్నా అవి భౌతికంగా అందుబాటులోకి రాకపోవచ్చు. ఈ అంతరాన్ని పూరించేది "వాతావరణ సంక్షోభ సమయంలోనూ సాధారణ సమయాల్లోనూ ఉన్న ఏకైక శరణ్యం" అయిన అనధికారిక ఆరోగ్య సంరక్షణ ప్రదాతల సైన్యం- అని ఆర్ఎమ్‌పిల సోషల్ నెట్‌వర్క్‌ను పరిశీలిస్తున్న అధ్యయనం పేర్కొంది.

*****

ఇది మీనూని విసిగించే మొదటి ఆరోగ్య సమస్య కాదు. 2018లో ఆమె శరీరమంతా దురద, దద్దుర్లతో బాధపడింది. ఎర్రటి బొబ్బలు ఆమె చేతులు, కాళ్ళు, ఛాతీ, ముఖాన్ని కప్పివేసాయి. తన చేతులు కాళ్ళు ఉబ్బినట్లు మీనూకి అనిపించింది. వాతావరణంలోని వేడి దురదను మరింత తీవ్రతరం చేసింది. డాక్టర్ సంప్రదింపులు, మందుల కోసం ఆ కుటుంబం దాదాపు రూ. 20,000 ఖర్చుచేసింది.

"ఒక సంవత్సరానికి పైగా, ఇదే నా జీవితం - కేవలం ఆసుపత్రులకు వెళ్లడం," అని ఆమె చెప్పింది. నెమ్మదిగా నయమవుతుండటంతో, చర్మ వ్యాధి తిరిగి వస్తుందేమోననే భయం ఆమెను నిరంతం వేధిస్తోంది.

The high salinity of water is one of the major causes of gynaecological problems in these low-lying islands in the Bay of Bengal
PHOTO • Ritayan Mukherjee

బంగాళాఖాతంలోని లోతట్టు ద్వీపాలలో స్త్రీల జననేంద్రియ సమస్యలకు ప్రధాన కారణాలలో నీటిలో ఉన్న అధిక లవణీయత ఒకటి

మీనూ నివసించే ప్రదేశానికి 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న రజత్ జూబ్లీ గ్రామానికి చెందిన 51 ఏళ్ల ఆలాపి మండల్ సరిగ్గా ఇలాంటి కథనే వివరించారు. “మూడు నాలుగు సంవత్సరాల క్రితం, నేను నా చర్మం అంతటా తీవ్రమైన దురదతో బాధపడ్డాను. ఒకోసారి ఈ వ్యాధి ఎంత తీవ్రంగా ఉండేదంటే, చీము బయటకు వచ్చేది. ఇదే సమస్యను ఎదుర్కొన్న అనేక మంది మహిళలు నాకు తెలుసు. ఒకానొక సమయంలో, మా గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ప్రతి కుటుంబంలో చర్మవ్యాధి సోకినవారు ఉన్నారు. ఇది ఒక రకమైన వైరస్ అని డాక్టర్ నాకు చెప్పారు."

దాదాపు ఏడాది కాలంగా మందులు వాడుతున్న ఆలాపి అనే ఈ మత్స్యకార మహిళ ఇప్పుడు బాగానే ఉన్నారు. ఆమె సోనార్‌పూర్ బ్లాక్‌లోని ఒక ధార్మిక ప్రైవేట్ క్లినిక్‌లోని వైద్యులను కలుస్తారు. వారిని కలిసేందుకు ఫీజు కేవలం రూ.2లే అయినా మందులు మాత్రం ఖరీదైనవి. ఆమె కుటుంబం, ఆమె చికిత్స కోసం రూ.13,000 ఖర్చుచేసింది. ఆ క్లినిక్‌కు వెళ్ళడానికి 4-5 గంటల ప్రయాణం చేయాలి. ఆమె స్వంత గ్రామంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చిన్న క్లినిక్ ఉంది, కానీ దాని ఉనికి గురించి ఆమెకు అప్పుడు తెలియదు.

"నా చర్మ సమస్యలు తీవ్రమైన తర్వాత, నేను చేపలు పట్టడం మానేశాను" అని ఆమె చెప్పారు. ఇంతకుముందు ఆమె తరచుగా నదీతీరంలో గంటల తరబడి మెడలోతు నీటిలో మునిగి, టైగర్ రొయ్యల విత్తనాల కోసం తన వలని లాగుతూ నడిచేవారు. ఆమె తిరిగి ఎప్పుడూ ఆ పనిని ప్రారంభించలేదు.

రజత్ జూబ్లీ గ్రామంలోని చాలామంది మహిళలు చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి వారు సుందర్‌బన్ల‌ నీటిలోని అధిక లవణీయతనే నిందించారు.

PHOTO • Labani Jangi

ఇది మీనూకి వచ్చిన మొదటి ఆరోగ్య సమస్య కాదు. 2018లో ఆమె శరీరమంతా దురద, దద్దుర్లతో బాధపడింది. ఎర్రటి బొబ్బలు ఆమె చేతులు, కాళ్ళు, ఛాతీ, ముఖాన్ని కప్పివేసాయి. తన చేతులు కాళ్ళు ఉబ్బినట్లు మీనూకి అనిపించింది

పాండ్ ఎకోసిస్టమ్స్ ఆఫ్ ది ఇండియన్ సుందర్ బన్స్ ( Pond Ecosystems of the Indian Sundarbans ) అనే పుస్తకంలో, స్థానిక జీవనోపాధిపై నీటి నాణ్యత ప్రభావంపై రాసిన ఒక వ్యాసంలో రచయిత సౌరవ్ దాస్, మహిళలు నీటి మడుగులలోని ఉప్పునీటిని వంట చేయడానికి, స్నానం చేయడానికి, కడగడానికి ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధులకు గురవుతున్నారని రాశారు. రొయ్యల విత్తనాల రైతులు రోజుకు 4-6 గంటలపాటు అధిక లవణీయత గల నది నీటిలో గడుపుతారు. "వారు ఈ అధిక ఉప్పునీటిని ఉపయోగించడం ద్వారా పునరుత్పత్తి నాళ సమస్యలతో కూడా బాధపడుతున్నారు," అని ఆయన చెప్పారు.

సముద్ర మట్టాలు పెరగడం, తుఫానులు చెలరేగటం వంటి అన్ని వాతావరణ మార్పుల సంకేతాలతో పాటు రొయ్యల పెంపకం, తగ్గిపోయిన మడ అడవులు సుందర్‌బన్స్‌లోని నీటికి అసాధారణంగా అధిక లవణీయత పెరగటానికి కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తాగునీటితో సహా అన్ని నీటి వనరులు ఉప్పునీటితో కలుషితమవడం ఆసియాలోని పెద్ద నదుల డెల్టాల విలక్షణత .

"సుందర్‌బన్లలో స్త్రీల జననేంద్రియ సమస్యలకు, ముఖ్యంగా పునరుత్పత్తి అవయవాల వాపు (పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి) ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలలో నీటిలోని అధిక లవణీయత ఒకటి," అని కొల్‌కతాలోని ఆర్.జి. కర్ వైద్య కళాశాల-ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ శ్యామల్ చక్రవర్తి చెప్పారు. కర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్ సుందర్బన్స్ అంతటా వైద్య శిబిరాలను నిర్వహించింది. “కానీ ఉప్పునీరు మాత్రమే కారణం కాదు. సామాజిక-ఆర్థిక స్థితి, జీవావరణం, ప్లాస్టిక్ వాడకం, పరిశుభ్రత లేకపోవడం, పోషకాహారం లోపం, ఇంకా ఆరోగ్య సంరక్షణ పంపిణీ వ్యవస్థలు అన్నీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి."

ఇంటర్నేషనల్ మీడియా సపోర్ట్ ఆర్గనైజేషన్ అయిన ఇంటర్‌న్యూస్‌కు ఆరోగ్య సంబంధ మీడియా సీనియర్ సలహాదారు డాక్టర్ జయ శ్రీధర్ ప్రకారం, "ఈ ప్రాంతంలోని మహిళలు, ముఖ్యంగా రొయ్యల రైతులు, రోజుకు 4-7 గంటల పాటు ఈ అధిక ఉప్పునీటిలో గడుపుతారు. వారు విరేచనాలు, అతిసారం, చర్మ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు, పొత్తికడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ అల్సర్‌లతో సహా అనేక వ్యాధులకు గురవుతారు. అధిక ఉప్పునీరు  హైపర్‌టెన్షన్‌కు దారితీయవచ్చు- ముఖ్యంగా మహిళల్లో గర్భాలను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు గర్భస్రావాలకు కూడా కారణమవుతుంది."

Saline water in sundarbans
PHOTO • Urvashi Sarkar
Sundarbans
PHOTO • Urvashi Sarkar

సుందర్ బన్స్ నీటిలో అధిక స్థాయిలో ఉప్పు ఉండటం వల్ల స్త్రీలు చర్మ వ్యాధులకు గురవుతారు

*****

సుందర్‌బన్స్‌లో నివసించే 15-59 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులలో, పురుషుల కంటే మహిళలలో అసమానమైన రీతిలో జబ్బుల భారం ఎక్కువగా ఉందని కొల్‌కతాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ 2010లో జరిపిన ఒక అధ్యయనం తెలిపింది.

దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలను అందజేస్తున్న సదరన్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ సమితి అనే ఎన్‌జిఓకు చెందిన సంచార మెడికల్ యూనిట్ సమన్వయ కర్తగా పనిచేస్తున్న అన్వరుల్ ఆలమ్, తమ సంచార మెడికల్ యూనిట్‌కు సుందర్‌బన్ల‌లోని గ్రామాల నుంచి వారానికి 400-450 మంది రోగులు వస్తుంటారని చెప్పారు. ఇందులో దాదాపు 60 శాతం మంది స్త్రీలు, వారిలో ఎక్కువమందికి చర్మవ్యాధులు, ల్యుకోరియా (యోని స్రావాలు), రక్తహీనత, అమెనోరియా (బహిష్టు రాకపోవడం లేదా సక్రమంగా రాకపోవడం) ఉన్నాయి.

మహిళా రోగులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆలమ్ చెప్పారు. "చాలారకాల పండ్లు, కూరగాయలు పడవల ద్వారా ఈ ద్వీపాలకు వస్తాయి. వీటిని స్థానికంగా పండించరు. అందుకని అందరూ వాటిని కొనలేరు. వేసవిలో పెరిగిపోయే వేడి, మంచినీటి కొరత కూడా అనారోగ్యాలకు ప్రధాన కారణం,” అని ఆయన చెప్పారు.

మీనూ, ఆలాపి ఎక్కువ రోజులు అన్నం, పప్పు, బంగాళాదుంపలు, చేపలను తింటారు. వారు పండించనందున వారు చాలా కొద్ది మొత్తంలోనే పండ్లు, కూరగాయలను తింటారు. మీనూకి ఉన్నట్టే, ఆలాపికి కూడా అనేక వ్యాధులు ఉన్నాయి

PHOTO • Labani Jangi

సముద్ర మట్టాలు పెరగడం, తుఫానులు, ఉప్పెనల వంటి వాతావరణ మార్పుల అన్ని సంకేతాల కారణంగా సుందర్‌బన్ల‌లో అసాధారణ స్థాయిలో అధిక లవణీయత ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి

ఐదేళ్ల క్రితం ఆలాపికి అధిక రక్తస్రావం అయింది. “సోనోగ్రఫీద్వారా కణితి ఉన్నట్టు తెలియడంతో నా జరాయును [గర్భాశయం] తొలగించడానికి నేను మూడు శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. ఇందుకు నా కుటుంబం 50,000 రూపాయల కంటే ఎక్కువే ఖర్చు చేసి ఉంటుంది,” అని ఆమె చెప్పారు. మొదటి శస్త్ర చికిత్స అపెండిక్స్‌ను తొలగించడం కోసం, మిగిలిన రెండూ గర్భాశయాన్ని పూర్తిగా తొలగించడం కోసం (హిస్టరెక్టమీ) చేశారు.

పొరుగున ఉన్న బసంతి బ్లాక్‌లోని సోనాఖాలి గ్రామంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం ఒక సుదీర్ఘ ప్రయాణం. ఆలాపికి గర్భాశయ శస్త్రచికిత్స ఇక్కడే జరిగింది. ఆలాపి రజత్ జూబ్లీ నుండి గోసాబాలోని ఫెర్రీ ఘాట్‌కి వెళ్ళేందుకు ఒక పడవలో, గఢ్‌ఖలి గ్రామంలోని ఫెర్రీ ఘాట్‌కి మరొక పడవలో, అక్కడి నుండి సోనాఖాలికి బస్సు లేదా షేర్డ్ వ్యాన్‌లో వెళ్లాలి - మొత్తం ప్రయాణానికి 2-3 గంటల సమయం పడుతుంది.

ఇద్దరు పిల్లలు - ఒక కొడుకు, ఒక కూతురు - ఉన్న ఆలాపికి రజత్ జూబ్లీలో శస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్ని పూర్తిగా తొలగించుకున్న మరో నలుగురైదుగురు మహిళలు తెలుసు.

వారిలో 40 ఏళ్ల జాలరి వనిత బసంతి మండల్ ఒకరు. “నా గర్భాశయంలో కణితి ఉందని డాక్టర్లు చెప్పారు. ఇంతకుముందు, చేపలు పట్టడానికి నాకు చాలా శక్తి ఉండేది. చాలా కష్టపడి పని చేసేదాన్ని” అని ముగ్గురు పిల్లల తల్లి బసంతి చెప్పారు. "కానీ నా గర్భాశయాన్ని తొలగించిన తర్వాత నాకు అంత బలం ఉన్నట్లు అనిపించడంలేదు." ఆమె ఒక ప్రయివేటు ఆసుపత్రిలో రూ. 40,000 చెల్లించి శస్త్రచికిత్స చేయించుకున్న్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -4 (2015-16) గ్రామీణ పశ్చిమ బెంగాల్‌లో 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 2.1 శాతం మంది గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స చేయించుకుంటున్నారని పేర్కొంది. ఇది పట్టణ పశ్చిమ బెంగాల్ రేటు 1.9 శాతం కంటే స్వల్పంగా ఎక్కువ. (అఖిల భారత రేటు 3.2 శాతం.)

For women in the Sundarbans, their multiple health problems are compounded by the difficulties in accessing healthcare
PHOTO • Urvashi Sarkar

సుందర్ బన్స్ లోని మహిళలకున్న రకరకాల ఆరోగ్య సమస్యలకు తోడు ఆరోగ్య సంరక్షణను పొందడంలో కలిగే ఇబ్బందులు కూడా తోడయ్యాయి

గత సంవత్సరం సెప్టెంబర్‌లో బెంగాలీ దినపత్రిక ఆనందబజార్ పత్రిక లో ప్రచురించబడిన ఒక కథనం లో, జర్నలిస్ట్ స్వాతి భట్టాచార్జీ ఇలా రాశారు: సుదర్బన్స్‌లో 26-36 సంవత్సరాల చిన్న వయస్సులోని మహిళలు కూడా యోనిలో ఇన్ఫెక్షన్, అధికంగా, లేదా ఒక క్రమమనేది లేకుండా రక్తస్రావం కావడం, బాధాకరమైన లైంగిక సంపర్కం, కటి వలయంలో వాపు వంటి ఆరోగ్య సమస్యల వలన వారి గర్భాశయాలను తొలగించే శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.

ఎటువంటి అర్హతలు లేని 'వైద్య నిపుణులు' గర్భాశయంలో కణితులు ఉన్నాయని ఈ మహిళలను భయపెట్టటంతో, ఆపై వారు ఏదో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స చేయించుకుంటారు. భట్టాచార్జీ ప్రకారం: లాభాలు దండుకుంటున్న ఈ ప్రైవేట్ క్లినిక్‌లు, రాష్ట్ర ప్రభుత్వ స్వాస్థ్య సాథీ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు సంవత్సరానికి 5 లక్షల వరకూ బీమా రక్షణ లభిస్తుంది.

మీను, ఆలాపి, బసంతి, ఇంకా సుందర్‌బన్స్‌లోని లక్షలాది మంది మహిళలకు లైంగిక, పునరుత్పత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలకు తోడు ఆరోగ్య సంరక్షణను పొందడంలో గల ఇబ్బందులు కూడా తోడవుతున్నాయి.

బసంతి తన గర్భాశయ శస్త్రచికిత్స కోసం గోసాబా బ్లాక్‌లోని తన ఇంటి నుండి ఐదు గంటల దూరం ప్రయాణించారు. “ప్రభుత్వానికి మరిన్ని ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు ఎందుకు లేవు? ఇంకా ఎక్కువ మంది గైనకాలజిస్టులు ఎందుకు లేరు?” అని ఆమె అడుగుతున్నారు. "మేము పేదవారమైనప్పటికీ, చనిపోవాలని కోరుకోము."

మీనూ , బప్పా సర్దార్ పేర్లు , వారుండే ప్రదేశం పేరు వారి గోప్యతను కాపాడేందుకు మార్చబడ్డాయి

గ్రామీణ భారతదేశంలోని కౌమారదశలో ఉన్న బాలికలు , యువతులపై PARI, CounterMedia ట్రస్ట్ యొక్క దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ - పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా - మద్దతుతో - కీలకమైనవైనప్పటికీ , అట్టడుగున ఉన్న సమూహాల పరిస్థితులను సాధారణ ప్రజల గొంతుకలో , వారి జీవన అనుభవం ద్వారా అన్వేషించడంలో ఒక భాగం .

కథనాన్ని తిరిగి ప్రచురించాలనుకుంటున్నారా ? దయచేసి [email protected]కు మెయిల్ చేయండి , కాపీని [email protected] కు పంపండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Urvashi Sarkar

উর্বশী সরকার স্বাধীনভাবে কর্মরত একজন সাংবাদিক। তিনি ২০১৬ সালের পারি ফেলো।

Other stories by উর্বশী সরকার
Illustrations : Labani Jangi

২০২০ সালের পারি ফেলোশিপ প্রাপক স্ব-শিক্ষিত চিত্রশিল্পী লাবনী জঙ্গীর নিবাস পশ্চিমবঙ্গের নদিয়া জেলায়। তিনি বর্তমানে কলকাতার সেন্টার ফর স্টাডিজ ইন সোশ্যাল সায়েন্সেসে বাঙালি শ্রমিকদের পরিযান বিষয়ে গবেষণা করছেন।

Other stories by Labani Jangi
Photographs : Ritayan Mukherjee

ঋতায়ন মুখার্জি কলকাতার বাসিন্দা, আলোকচিত্রে সবিশেষ উৎসাহী। তিনি ২০১৬ সালের পারি ফেলো। তিব্বত মালভূমির যাযাবর মেষপালক রাখালিয়া জনগোষ্ঠীগুলির জীবন বিষয়ে তিনি একটি দীর্ঘমেয়াদী দস্তাবেজি প্রকল্পের সঙ্গে যুক্ত।

Other stories by Ritayan Mukherjee
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli