'కెప్టెన్
భావు' (రామచంద్ర శ్రీపతి లాడ్)
స్వాతంత్య్ర
సమరయోధుడు, తూఫాన్ సేన అధినేత
జూన్
22, 1922- ఫిబ్రవరి 5, 2022.
చివరకి, ఏ దేశం కోసం అతను పోరాడాడో ఆ దేశం చేత అతను గౌరవించబడలేదు, గుర్తించబడలేదు, కానీ 1940లలో తన సహచరులతో కలిసి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ధిక్కరించిన ఈ అద్భుతమైన మనిషి గురించి తెలిసిన వేలాది మంది ఆరాధించారు. 1943లో బ్రిటిష్ సామ్రాజ్యం నుండి సతారా విడిపోతున్నట్లు ప్రకటించిన ఐతిహాసిక వ్యక్తి నానా పాటిల్ నేతృత్వంలోని అజ్ఞాత తాత్కాలిక ప్రభుత్వం 'ప్రతి సర్కార్'లో రామచంద్ర శ్రీపతి లాడ్ ఒక ముఖ్యమైన భాగం.
కానీ కెప్టెన్ భావు (అజ్ఞాతంలో మారుపేరు), అతని యోధులు అంతటితో ఆగలేదు. మూడు సంవత్సరాల పాటు, 1946 వరకు, వాళ్ళు బ్రిటీష్ వాళ్ళని నిలువరించి, తమ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన దాదాపు 600 గ్రామాలలో ప్రతి సర్కార్ ఆధిపత్యం చెలాయించారు. ఒక రకంగా చెప్పాలంటే, ఫిబ్రవరి 5న ఆయన మరణం బ్రిటిష్ రాజ్ ని ఎదిరించిన ఒక సర్కార్ ముగింపుకు సూచిక.
కెప్టెన్ భావు (అన్నయ్య) ప్రతి సర్కార్ యొక్క భూగర్భ సాయుధ దళం అయిన'తూఫాన్ సేన' లేదా సుడిగాలి సైన్యం అనే అద్భుతమైన విభాగానికి నాయకత్వం వహించాడు. తన వ్యక్తిగత హీరో జి.డి. బాపు లాడ్‌తో కలిసి, జూన్ 7, 1943న మహారాష్ట్రలోని షెనోలిలో బ్రిటిష్ రాజ్‌లోని అధికారుల జీతభత్యాలతో పూణే-మిరాజ్ ప్రత్యేక గూడ్స్ రైలుపై దాడికి నాయకత్వం వహించాడు. వారు దోచుకున్న డబ్బు ప్రధానంగా లేమి, కరువు, ఆకలితో ఉన్న రైతులకు, కూలీలకు సహాయం చేయడానికి ఖర్చు చేయబడింది.
దశాబ్దాల తర్వాత, అతను, ప్రతి సర్కార్ మరుగున పడిపోయినప్పుడు, PARI కెప్టెన్ అన్న ను మళ్లీ కనుగొని అతని కథను మాకు చెప్పమని అడిగాము. అప్పుడే అతను స్వాతంత్య్రంకు స్వేచ్ఛకు మధ్య వ్యత్యాసాన్ని చెప్పాడు. భారతదేశానికి స్వతంత్రం మాత్రమే వచ్చింది. స్వేచ్ఛ మాత్రం ఇప్పటికీ కొందరికే గుత్తాధిపత్యంగా ఉందన్నారు. ఇంకా "ఇప్పుడు డబ్బున్నవాడు పాలిస్తాడు ... కుందేలుని ఎవరు పట్టుకుంటే అతనే వేటగాడు - ఇది మన స్వేచ్ఛ యొక్క స్థితి."
నవంబర్ 2018లో, 100,000 మంది రైతులు పార్లమెంటుకు కవాతు చేస్తున్నప్పుడు, అతను PARI లో పనిచేస్తున్న భరత్ పాటిల్ ద్వారా వాళ్ళకి ఒక వీడియో సందేశాన్ని పంపాడు. "నేను ఆరోగ్యంగా ఉండి ఉంటే మీతో పాటు కవాతు చేసేవాడిని," అని 96 సంవత్సరాల ఆ యోధుడు గర్జించాడు.
జూన్ 2021లో, అతను మహారోగం(కోవిడ్) నుండి బయటపడినట్లు నాకు నేను భరోసా ఇచ్చుకోడానికి నేను ఆయన్ని మరోసారి చూడాలని నిర్ణయించుకున్నాను. నా సహోద్యోగి మేధా కాలేతో కలిసి నేను ఆయన పుట్టినరోజున అభినందించడానికి వెళ్ళాను. PARI తరపున, మేము అయన కోసం పుట్టినరోజు బహుమతులు తీసుకెళ్ళాము: ఒక అందమైన నెహ్రూ జాకెట్ (ఆయన వాటిని ఇష్టపడేవాడు), చేతితో చెక్కిన చేతికర్ర, మేము తీసిన ఆయన ఫోటోల ఒక ఆల్బమ్. నేను ఆయన్ని చివరిసారిగా 2018లో కలిసినప్పటికి ఇప్పటికి ఆయన ఎంత కుంచించుకుపోయాడో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ముసలి యోధుడు బలహీనంగా, నీరసంగా ఉన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేడు - కానీ మేము తెచ్చిన బహుమతులు ఆయనకి నచ్చాయి. ఆయన వెంటనే జాకెట్ ధరించాడు - సాంగ్లీ ఎండలో వేడిగా ఉన్నప్పటికీ. మోకాళ్లపై చేతికర్రను ఉంచి, ఫోటో ఆల్బమ్‌లో మునిగిపోయాడు.
ఏడు దశాబ్దాలకు పైగా తన భాగస్వామి అయిన కల్పనా లాడ్‌ను ఒక సంవత్సరం క్రితం ఆయన కోల్పోయాడని అప్పుడే మేము తెలుసుకున్నాము. ఆ నష్టం భరించలేని పెద్దాయన దాని వల్ల కృంగిపోయాడు. అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఆయన మరణం ఎంతో దూరంలో లేదని నాకు అనిపించింది.
దీపక్ లాడ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు: "ఆయన చనిపోయినప్పుడు ఆ నెహ్రూ జాకెట్ వేస్కుని ఉన్నాడు", చేతికర్ర కూడా ఆయన పక్కనే ఉంది. భావుకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, అయితే అది కార్యరూపం దాల్చలేదని దీపక్ చెప్పారు. అయినప్పటికీ, చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ కెప్టెన్ చివరి యాత్ర కోసం గుమిగూడారు.
మా 85 నెలల ఉనికిలో PARI 44 జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. కానీ కెప్టెన్ అన్న తన స్వస్థలమైన కుండల్‌లో ఆయనపై తీసిన చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత అందించిన ఈ ఒక్క ప్రశంస అన్నిటికంటే విలువైనదని నేను నమ్ముతున్నాను. 2017లో దీపక్ లాడ్ ద్వారా ఆయన మాకు పంపిన సందేశం ఇది:
"పి.సాయినాథ్, PARI పునరుద్ధరించే వరకు ప్రతి సర్కార్ చరిత్ర మొత్తం కనుమరుగయ్యింది. మన చరిత్రలో ఆ గొప్ప అధ్యాయం చెరిగిపోయింది. మేము స్వాతంత్య్రం కోసం స్వేచ్ఛ కోసం పోరాడాము, ఆ తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి, మా భాగస్వామ్యం మరిచిపోయారు. మమ్మల్ని అలక్ష్యం చేసారు. నా కథ కోసం సాయినాథ్ గతేడాది మా ఇంటికి వచ్చారు. ఆయన నాతో పాటు షెనోలిలో బ్రిటీష్ రైలుపై మేము చేసిన గొప్ప దాడి జరిగిన ప్రదేశానికి, మేము పోరాడిన ట్రాక్‌ల వరకు వెళ్ళాడు.
“నా గురించి, నా తోటి యోధుల గురించిన ఈ చిత్రం, దీని కథనంతో, సాయినాథ్ మరియు PARI ప్రతి సర్కార్ జ్ఞాపకాన్ని, ప్రజల కోసం ఎలా పోరాడిందో ఆ జ్ఞాపకాలని, వాళ్ళు మాకు గర్వకారణమైనఅనుభవాలని, మా గౌరవాన్ని పునరుద్ధరించారు. మన సమాజ స్పృహలోకి మమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఇది మా నిజమైన కథ.
“ఆ సినిమా చూస్తున్నప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ఇంతకు ముందు, నా సొంతఊరిలో చాలా మంది యువతకు ఏమీ తెలియదు, నేను ఎవరో లేదా నా పాత్ర ఏమిటో తెలియదు. కానీ ఈ రోజు, ఈ చిత్రం, కథనం PARIలో వచ్చిన తర్వాత, యువ తరం కూడా నన్ను సరికొత్త గౌరవంతో చూస్తుంది, భారతదేశాన్ని స్వేచ్ఛా దేశంగా మార్చడంలో నా సహచరులు, నా పాత్ర పోషించారని ఇప్పుడు వాళ్లకి తెలుసు. ఇది నా చివరి సంవత్సరాల్లో మా గౌరవాన్ని మళ్ళీ బ్రతికించింది."
ఆయన మరణంతో భారతదేశం తన గొప్ప స్వాతంత్య్ర సమార యోధులలో ఒకరిని కోల్పోయింది - ఈ దేశ స్వాతంత్య్రం కోసం వ్యక్తిగత లాభం గురించి ఆలోచించకుండా, వాళ్ళకి కలిగే ప్రమాదాల గురించి పూర్తి స్పృహతో పోరాడిన వాళ్ళు, ఈ వీరులు.
2017లో, మొదటి ఇంటర్వ్యూ జరిగిన ఒక సంవత్సరం తర్వాత, భరత్ పాటిల్ నాకు కుండల్‌లో రైతు సమ్మె వద్ద కవాతు చేస్తున్న ముసలాయన ఫోటో పంపించారు. నేను కెప్టెన్ భావుని తర్వాత కలిసినప్పుడు అడిగాను, ఆయన అక్కడ ఎండలో ఏం చేస్తున్నారని. ఆయన ఇప్పుడు దేని కోసం పోరాడుతున్నారు? స్వాతంత్య్ర పోరాట జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఇలా అన్నారు.
"అప్పుడూ ఇప్పుడూ కూడా అది రైతులు, కార్మికుల కోసం సాయినాథ్. రైతులు, కార్మికుల కోసమే."
ఇది కూడా చదవండి: ‘కెప్టెన్ ఎల్డర్ బ్రదర్’ మరియు సుడిగాలి సైన్యం మరియు ప్రతిసర్కార్ ఆఖరి ఆనందాతిరేకం
అనువాదం: దీప్తి సిర్ల