“పుట్టినప్పటినించి ఇంతే, నేను ఒక కూలీగానే పని చేసాను,” ఆగష్టు నెలలోని పలచని మంచులో తన ఇంటి నుంచి పొలానికి చకచకా నడుస్తూ, అన్నది రత్నవ్వ ఎస్.హరిజన్, ఆమె అక్కడ దినవారి కూలీగా పనిచేస్తుంది. జీవంతో తొణికిసలాడుతున్న ఆమె కాస్త ఒంగి గబగబా నడుస్తుంటే ఆమెకుర్ర వయసులో కుంటుపడిన కాలు కూడా బయటకు తెలియడం లేదు.
పొలానికెళ్లగానే ఆమె తనతో తెచ్చుకున్న పని బట్టలు బయటకు తీసింది. ముందు ఆమె తాను కట్టుకున్న చీర మీద ఒక నీలం చొక్కాని వేసుకుంది. ఆ తరువాత పుప్పొడి దుమ్ము నుండి కాపాడుకోవడానికి ఒక పసుపు ప్రింట్ ఉన్న నైటీని తన నడుము చుట్టూ కట్టుకుంది. దానిమీద ఒక చిరిగిపోయిన నీలి షిఫాన్ బట్టను సంచిలాగా కట్టుకుంది. అందులో ఆమె బెండ మొక్కల కొన్ని గండు హువు(మగ పూవు) వేసుకుంటుంది. కొన్ని దారాలను చేతిలో పట్టుకుని, నెత్తి మీద ఒక తెల్లగుడ్డ వేసుకుని, ఈ 45 ఏళ్ళ రత్నవ్వ, తన పనిని మొదలుపెడుతుంది.
ఆమె ఒక పూవును తీసుకుని దాని పూరెక్కలను సున్నితంగా వంచి మగ పూవు నుంచి పుప్పొడిని ప్రతి కీలాగ్రానికి రాస్తుంది. అలా చేసిన పూవుని గుర్తుపట్టడానికి దాని చుట్టూ ఒక దారాన్ని కడుతుంది. ఆమె వెన్ను వంచి, ఒక పూవు నుండి మరో పువ్వుకు కదులుతూ, లయబద్దంగా అన్ని బెండ మొక్కలలో ప్రతి పూవుని పరాగసంపర్కానికి సిద్ధం చేస్తుంది. ఆమె చేతి -పరాగసంపర్కంలో నైపుణ్యం చెందింది- చిన్నప్పటినుంచి ఆమె వృత్తి ఇదే.
రత్నవ్వ మాదిగ వర్గానికి చెందినది. కర్ణాటకలో ఇది ఒక దళిత కులం. ఆమె కర్ణాటకలోని హవేరి జిల్లాలో రాణిబెన్నూర్ తాలూకాలో కొననతాలి గ్రామం లోని మాదిగ కేరి(మాదిగ యిల్లు)లో నివసిస్తున్నది.












