లద్దాఖ్‌లోని సురు లోయ గ్రామాలు వేసవి నెలల్లో జీవనోత్సాహంతో పొంగిపొరలుతుంటాయి. పచ్చని పొలాల గుండా జలజల ప్రవహించే జలపాతాలతో, శిఖరాగ్రాలలో మంచు కప్పిన పర్వతాలు చుట్టుముట్టి ఉన్న ఈ ప్రదేశాలలో అనేక రకాల అడవి పువ్వులు విరివిగా విరబూసి ఉంటాయి. పగటి ఆకాశాన్ని అందమైన నీలిమబ్బు కమ్మివుండగా, ప్రశాంతమైన రాత్రి ఆకాశంలో పాలపుంత మిలమిలలాడుతుంది!
కర్గిల్ జిల్లాలోని ఈ లోయలోని పిల్లలు తమ చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో ఒక సంవేదనాత్మకమైన సంబంధాన్ని కలిగివుంటారు. ఈ ఫోటోలు 2021లో తాయ్ సురు గ్రామంలో తీసినవి. ఈ గ్రామంలోని అమ్మాయిలు కొండలవంటి బండరాళ్ళపైకి ఎక్కుతుంటారు, వేసవిలో పూలను, శీతాకాలంలో మంచును సేకరిస్తారు, ప్రవాహాల్లో గెంతులేస్తారు. బార్లీ పొలాల్లో ఆడుకోవడం వేసవికాలంలో వారికెంతో ఇష్టమైన పని.
కర్గిల్ చాలా మారుమూల ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో ఉన్న రెండు జిల్లాలలోని మరో జిల్లా, ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన లేహ్‌కు ఇది చాలా దూరంలో ఉంటుంది.
ఇతర ప్రాంతాలకు చెందిన చాలామంది కర్గిల్, కశ్మీర్ లోయలో ఉందని తికమకపడతారు, కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. కశ్మీర్లో సున్నీ ముస్లిమ్‌లు ఎక్కువగా ఉంటారు. కర్గిల్లోని మెజారిటీ ప్రజల మత విశ్వాసం షియా ఇస్లామ్.
సురు లోయలోని షియా ముస్లిమ్‌లు, కర్గిల్ పట్టణానికి దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాయ్ సురును ఒక ముఖ్యమైన మతకేంద్రంగా భావిస్తారు. ఇక్కడి ప్రజలకు, మహమ్మదీయుల నూతన సంవత్సరంలోని మొదటి నెల - ముహర్రం - మొహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ కోసం ఆచరించే సంతాప మాసం. అక్టోబరు 10, 680న కర్బలా(ఇప్పటి ఇరాక్) యుద్ధంలో హుస్సేన్, అతని సహచరులు 72 మంది మరణించారు.
ఈ ముహర్రం సందర్భంగా పాటించే ఆచారాలలో పురుషులు, మహిళలు కూడా పాల్గొంటారు. జూలూస్ లేదా దస్తా అని పిలిచే ఊరేగింపులు చాలా రోజులపాటు జరుగుతాయి. వీటిలో అతిపెద్దదైన ఆశూరా మొహర్రం పదవ రోజున జరుగుతుంది. ఇది హుస్సేన్, అతని పరివారం కర్బలాలో అమరవీరులైన రోజు. కొంతమంది పురుషులు గొలుసులు, బ్లేడ్లతో తమని తాము శిక్షించుకునే (కామా ౙాని) ఆచారాన్ని పాటిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఛాతీపై కొట్టుకుంటారు (సీనా ౙాని).


























