"తుఫాను తీవ్రత తగ్గిపోయింది. ఇక మమ్మల్ని వెళ్ళిపొమ్మంటున్నారు," కాళిదాస్పూర్ గ్రామానికి చెందిన ఆమినా బీబీ, మే నెల చివర్లో నాతో అన్న మాటలివి. " కానీ మేం ఎక్కడికి వెళ్ళాలి?"
ఆ తుఫానుకు ఒక రోజు ముందు, ఆంఫాన్ తుఫాను పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న ఆమినా గ్రామానికి 150 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని తాకింది. స్థానిక అధికారులు చాలా గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సహాయక శిబిరాలకు తరలించారు. మే నెల 19వ తారీఖున ఆమినా వాళ్ళ కుటుంబాన్నికూడా పక్క గ్రామంలోని తాత్కాలిక నివాసాల్లోకి తరలించారు.
సుందరవనాలలో గోసాబా బ్లాక్‌లో 5800 మంది జనాభా వుండే వాళ్ళ గ్రామంలో ఆమినా మట్టి ఇంటిని ఆమె సామానులతో సహా తుఫాను తుడిచిపెట్టేసింది. 48 ఏళ్ల ఆమినా, ఆవిడ భర్త 56 ఏళ్ల మొహమ్మద్ రంజాన్ మొల్లా, 2 నుంచి 16 ఏళ్ళ వయసున్న వాళ్ళ ఆరుగురు పిల్లలు ఎలాగో బతికి బట్టకట్టారు.
తుఫాను రావడానికి కేవలం రెండు వారాల ముందే మొహమ్మద్ మొల్లా గ్రామానికి తిరిగి వచ్చారు. 56 ఏళ్ల అతను మహారాష్ట్రలోని పూనాలో, ఒక మాల్లో క్లీనర్‌గా నెలకు పదివేల జీతానికి పనిచేసేవారు. ఈసారి అతను గ్రామంలోనే వుండి దగ్గలోని మొల్లా ఖలీ బజార్లో టీ దుకాణం తెరవాలనుకుంటున్నారు.
తన ఇంటి పనులు పూర్తిచేసుకున్నాక దగ్గరలోని గోమర్ నదిలో ఆమినా చేపలు, పీతలు పట్టి ఎంతో కొంత సంపాదించేవారు. ఆవిడ పట్టిన కొద్ది చేపలను బజార్లో అమ్మేవారు. "అయితే, కనీసం రోజుకు 100 రూపాయలు కూడా సంపాదించేదాన్ని కాదు." అని నాతో అన్నారామె.
వారి పెద్ద కొడుకు రకీబ్ అలీ 2018లో బడికి వెళ్లడం మానేశాడు. అప్పుడతని వయసు 14 ఏళ్ళు. "నాన్న పంపించే డబ్బుతో మేము బతకడం అసాధ్యం. అందుకే నేను పనికి వెళుతున్నాను" అన్నాడు రకీబ్. కొల్కతాలో ఒక టైలర్ షాప్‌లో సహాయకుడిగా నెలకు 5000 రూపాయలు సంపాదించేవాడు. కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో ఆంఫన్ తుఫాను వచ్చినప్పుడు అతను ఇంటికి తిరిగి వచ్చాడు.
రెల్లు గడ్డి పైకప్పుతో వున్న వాళ్ళ మట్టి ఇల్లు గోమర్ నది ఒడ్డున వుంది. ఒక్కో తుఫాను వచ్చినప్పుడల్లా - సిద్ర్ (2007), ఐలా (2009), బుల్బుల్( 2019) - నది వాళ్ళ ఇంటికి మరింత దగ్గరగా చొచ్చుకువస్తోంది. చిన్నగా వాళ్ళు ఏడాదికొకసారి వరితో పాటు కొన్ని కూరగాయలు పండించుకునే మూడు బిఘాల (ఒక ఎకరం) భూమి మొత్తం మునిగిపోయింది. ఆంఫాన్ తుఫాను వచ్చే సమయానికి ఇక ముంచడానికి భూమి మిగల్లేదు.














