“ఆమె ఎందుకు చనిపోయిందో నాకు తెలీదు కానీ, ఆమెకు శ్రద్ధగా చికిత్స చేయలేదని మాత్రమే చెప్పగలను,” అన్నాడు సుభాష్ కబడే, చనిపోయిన తన చెల్లి గురించి చెబుతూ.
మహారాష్ట్ర బీడ్ నగరంలోని సివిల్ హాస్పిటల్ లో, లతా సుర్వసే చనిపోయే ముందు రాత్రి, ఆమెకు అర్జెంటుగా ఇవ్వవలసిన రెండు ఇంజెక్షన్ల ను ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసాడు. సుభాష్ వెంటనే మెడికల్ షాప్ కు పరుగెట్టి, నిముషాలలో ఇంజెక్షన్లను తెచ్చిపెట్టాడు. కానీ అప్పటికే ఆ డాక్టరు వెళ్లిపోయాడు.
“ఆయనకు అప్పటికే చాలామంది పేషెంట్లున్నారు. ఆయన వేరే వార్డ్ కి వెళ్ళిపోయాడు.” అన్నాడు పాతికేళ్ల సుభాష్. “నేను నర్స్ కి ఆ ఇంజెక్షన్లు ఇమ్మన్నాను కాని ఆ నర్స్, మా చెల్లి ఫైల్ వెతికి, అందులో ఏమి రాయలేదని చెప్పింది. కొద్ధినిముషాల క్రితమే ఆ మందులు డాక్టర్ నాకు రాసి ఇచ్చారని కాబట్టి ఫైల్ లో ఆ మందుల వివరాలు ఉండవని, చెప్పడానికి ప్రయత్నించాను.”
కానీ నర్స్ అతని మాటను వినలేదు. అతను గాభరాగా ఇంజెక్షన్లని ఇమ్మని బతిమాలితే, “ఆ వార్డ్ ఇంచార్జి సెక్యూరిటీ ని పిలుస్తానని బెదిరించాడు.” అన్నాడు సుభాష్. ఈ గొడవ సమసి ఆ రోగికి ఇంజక్షన్ ఇవ్వడానికి గంట పైనే పట్టింది.
లత ఆ తరవాత రోజు ఉదయం, మే 14 న చనిపోయింది. ఆమె ఏప్రిల్ 23 నుంచి ఆసుపత్రిలో ఉంది. ఆమెకి కోవిడ్ పాజిటివ్ అని పరీక్ష లో తేలింది. “అప్పుడప్పుడు నయం అవుతున్న లక్షణాలు కనిపించేవి.” అన్నాడు బీడ్ లో లాయర్ గా పనిచేస్తున్న సుభాష్. అతను ఇంజెక్షన్ల గురించి కచ్చితంగా ఏం చెప్పలేకపోతున్నాడు, అవి సరైన టైం కి ఇచ్చి ఉంటే ఆమె బతికేదేమో. కానీ ఆసుపత్రిలో సిబ్బంది ఉండవలసిన వారి కన్నా చాలా తక్కువగా ఉన్నారని మాత్రం అతనికి కచ్చితంగా తెలుసు. “దీని వలన రోగులకు ఇబ్బంది అవుతోంది.” అన్నాడు.
కోవిడ్ 19 మార్చ్ నుంచి బాగా వ్యాపించడంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాల పై చాలా భారం పడింది. తక్కువ మంది సిబ్బంది ఉన్న ఆసుపత్రులు, అలసటతో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, సరైన చికిత్స కొరవడిన రోగులు- ఇవి గ్రామీణ ప్రాంతాలలో లక్షలాదిమందికి అందే వైద్య సంరక్షణ గురించి చెబుతాయి.







