గ్రామీణ భారతదేశం అన్న విషయం మీద బోధిస్తున్నది PARI అయినపుడు, ఆ విద్య వాస్తవికంగాను, సులభగ్రాహ్యంగాను యింకా, చాలాకాలం పాటు నిలిచిపోయేదిగానూ ఉంటుందని మేము గమనించాము.
ఆయుష్ మంగళ్ మా దగ్గర ఇంటర్న్ గా పనిచేసినప్పటి తన అనుభవాన్నే తీసుకోండి. PARI తో తన సమయాన్ని గ్రామీణ ఛత్తీస్గఢ్ లోని ఆదివాసీలకు ఆరోగ్యసేవలు అందుబాటులో లేకపోవడానికి, ఝోలా చాప్ వైద్యులకి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. "ప్రభుత్వానికి, ప్రైవేటుకి అలాగే పట్టా ఉన్న వైద్యునికి, పట్టా లేని వైద్యునికి మధ్య గల సంక్లిష్టమైన సంబంధాన్ని గమనించాను. ఏ ప్రభుత్వ విధానమైనా దీనిని పరిష్కరించేదిగా ఉండాలి" అంటాడు ఛత్తీస్గఢ్ లోని జాంజ్గిర్ చంపా జిల్లాకు చెందిన ఈ విద్యార్థి. అప్పటికి అతను ఆర్థికశాస్త్రంలో పి.జి. చేస్తున్నాడు.
తమ పాఠ్యపుస్తకాల్లో కనబడనటువంటి అట్టడుగు వర్గాల ప్రజల గురించి యువత మరింతగా తెలుసుకుంటోంది. జర్నలిజం చదువుతోన్న శుభశ్రీ మహాపాత్ర, ఒడిశాలోని కొరాపుట్ లో ఉండే గౌరా లాంటి అంగవైకల్యం ఉన్నవారికి రాష్ట్రప్రభుత్వం అందించే సహాయం పొందడం ఎంత కష్టంగా ఉందో వివరిస్తూ, తన నివేదికలో యిలా ప్రశ్నిస్తారు: "ఏ పాలనాలోపం వల్ల గౌరా యింతటి శారీరక, మానసిక ఒత్తిడికి గురికావలసి వస్తోంది?".
పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా విద్యా విభాగమైన PARI ఎడ్యుకేషన్, సెప్టెంబరు 2022 లో తన అయిదవ ఏట అడుగు పెడుతున్నది. ఇన్ని సంవత్సరాలలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, సామాజిక మార్పు కోసం పని చేస్తున్న సంస్థల్లో పనిచేసే యువత, అలాగే పాఠశాలల్లో చదువుకుంటోన్న విద్యార్థులు చాలామంది సాధారణ ప్రజలకున్న వైవిద్యభరితమైన నైపుణ్యాల గురించి, వారి జ్ఞానం గురించి లోతైన అవగాహన పొందారు. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ లో ధన్ ఝూమర్స్ గురించి డాక్యుమెంట్ చేసిన ప్రజ్వల్ ఠాకూర్ అనే ఒక ఉన్నతపాఠశాల విద్యార్థి యిలా అంటాడు: "పండుగలలో రైతుల పాత్ర గురించి అలాగే వరిపంట ప్రాధాన్యత గురించి నేను మరింత తెలుసుకున్నాను. PARI ఎడ్యుకేషన్ తో కలిసి పనిచేయడం వల్ల నేను జీవిస్తున్న సమాజం పట్ల నాకొక కొత్త దృష్టి ఏర్పడింది".



