ఘారాపురీలోని తన ఇంటి సమీపంలో ఉన్న అడవికి కట్టెలు ఏరుకొచ్చేందుకు వెళ్లిన జయశ్రీ మాత్రేను ఏదో కాటు వేసింది. 43 ఏళ్ల వయసు, ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయిన జయశ్రీ ఆ కాటును పట్టించుకోలేదు; బహుశా చిన్న కొమ్మేదో గుచ్చుకొని ఉండొచ్చు అనుకున్నారామె. 2020 జనవరిలోని ఆ తేలికపాటి శీతాకాలపు మధ్యాహ్నం, తాను సేకరించిన కట్టెలను తీసుకుని ఆమె ఇంటికి బయలుదేరారు.
కాసేపటి తర్వాత, తన ఇంటి గుమ్మంలో నిల్చొని ఒక బంధువుతో మాట్లాడుతున్న ఆమె ఉన్నట్టుండి నేలమీదకు కుప్పకూలిపోయారు. ఆవిడ ఉపవాసం ఉండటం వల్ల నీరసంతో పడిపోయివుంటుందని ఆమెకు దగ్గరలో ఉన్నవాళ్ళు అనుకొన్నారు..
"మా అమ్మ స్పృహతప్పి పడిపోయిందని నాకు చెప్పారు," అని జయశ్రీ పెద్ద కుమార్తె, 20 ఏళ్ల భావిక గుర్తుచేసుకుంది. ఆమె, ఆమె చెల్లెలు గౌరి(14) ఇంటికి దూరంగా, బంధువుల ఇంటిదగ్గర ఉన్నందున ఈ సంఘటనను చూడలేదు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు, బంధువులు చెప్పగా తెలుసుకున్నారు. కాసేపటి తర్వాత స్పృహ వచ్చిన జయశ్రీకి చేయి వణుకుతున్నట్లుగా వాళ్ళు భావికతో చెప్పారు. "ఏమి జరిగిందో ఏమో ఎవరికీ అర్థంకాలేదు," అంది భావిక.
ఘారాపురీ ద్వీపంలో తాను నిర్వహిస్తున్న ఫుడ్ షాప్లో ఉన్న జయశ్రీ భర్త, 53 ఏళ్ల మధుకర్ మాత్రేకి ఎవరో సమాచారం అందించారు. అరేబియా సముద్రంలో ఉన్న ఈ ద్వీపం ఇక్కడ ఉన్న ఎలిఫెంటా గుహల వల్లనే ప్రసిద్ధి చెందింది. ముంబై నగరానికి సమీపంలో, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఈ ప్రదేశం యునెస్కో(UNESCO) ద్వారా ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తించబడింది. ఇక్కడి రాతి వాస్తుశిల్పం క్రీ.శ. 6వ నుండి 8వ శతాబ్దం నాటిది. ఇది ప్రతి సంవత్సరం లక్షలాదిమంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ద్వీపంలో నివాసముండేవారు టోపీలు, సన్ గ్లాసులు, జ్ఞాపికలు(సువనీర్లు), తినుబండారాలు అమ్మడం వంటివి చేస్తూ ఆదాయం కోసం పర్యాటకంపై ఆధారపడతారు. కొంతమంది గుహలకు మార్గదర్శకులు(గైడ్లు)గా వ్యవహరిస్తారు.
ఇది పర్యాటక చిత్రపటంలో ప్రముఖంగా కనిపించినప్పటికీ, ఈ ద్వీపంలోని ఘారాపురీ గ్రామంలో ప్రజారోగ్య కేంద్రం వంటి ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా లేవు. రెండు సంవత్సరాల క్రితం ఒకటి ఏర్పాటు చేశారు కానీ దానిని ఎవరూ పట్టించుకోవడంలేదు. గ్రామంలోని 1,100 మంది జనాభా రాజ్బందర్, శేత్బందర్, మోరాబందర్ అనే మూడు కుగ్రామాల్లో నివసిస్తున్నారు. వైద్య సౌకర్యాలు లేకపోవడం వలన వారు వాటికోసం వెతుకుతూ పడవ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ ప్రయాణాలు మరింత ఖరీదైనవవటమే కాకుండా, వైద్య సంరక్షణలో జరిగే ఆలస్యం కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు.














