కడలూరు చేపల రేవులో వ్యాపారం ప్రారంభించేనాటికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలే. ఆమె దగ్గర ఉన్నదల్లా కేవలం రూ. 1800; అది వ్యాపారం ప్రారంభించడానికి ఆమె తల్లి ఇచ్చిన పెట్టుబడి. ఈనాడు 62 ఏళ్ళ వేణి, ఓడరేవులో ఒక విజయవంతమైన వేలంపాటదారు, వ్యాపారీ కూడా. తాను చాలా కష్టపడి నిర్మించుకున్నందుకు గర్వపడే ఇంటిలాగే, ఆమె తన వ్యాపారాన్ని కూడా "అంచెలంచెలుగా" నిర్మించుకున్నారు.
మద్యానికి బానిసైన భర్త తనను విడిచిపెట్టిన తర్వాత వేణి ఒక్కచేతిమీదుగా తన నలుగురు పిల్లలను పెంచారు. ఆమె రోజువారీ సంపాదన చాలా తక్కువగా ఉండేది, కనాకష్టంగా జీవించడానికి మాత్రం సరిపోయేది. రింగుల వలలు రంగంలోకి రావడంతో, ఆమె లక్షల్లో అప్పులు చేసి పడవలపై పెట్టుబడి పెట్టారు. ఆమె పెట్టుబడికి వచ్చిన రాబడి తన పిల్లలను చదివించడానికి, ఇల్లు కట్టుకోవడానికి వీలు కల్పించింది.
రింగుల వలలతో చేపల వేట 1990ల చివరి నుండి కడలూరు తీరంలో ప్రజాదరణ పొందింది. అయితే 2004 సునామీ తర్వాత దీని వినియోగం వేగంగా పెరిగింది. సముద్రపు ఉపరితల జలాల్లో తిరుగాడే కవళ్ళు (sardine), కనగర్తలు (mackerel), నెత్తళ్ళు (anchovies) వంటి చేపల గుంపులను రింగుల వల ద్వారా చుట్టుముట్టే పద్ధతులను ఉపయోగించి పట్టుకుంటారు.


