"మీ నంబరు గాంధీ డైరీలో దొరికింది. ఆయన హైవే మీద కారు ఢీకొని చనిపోయారు," రాజకీయ కార్యకర్త, రేషన్ షాపు యజమాని బి. కృష్ణయ్య ఆదివారం, డిసెంబర్ 9వ తేదీ రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఫోన్ చేసి నాతో చెప్పారు.
నవంబరు 24వ తేదీన చివరిసారిగా నేను గంగప్ప లేక 'గాంధీ'ని బెంగళూరు-హైదరాబాదు హైవేపై నడుస్తూ వెళ్తుండగా కలిశాను. అది సుమారుగా ఉదయం 10:30 ప్రాంతం. అతను గాంధీ వేషంలో తన దినచర్య మొదలుపెట్టటానికి అనంతపూర్ పట్టణానికి వెళ్తున్నారు. అనంతపురం నుంచి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలోని రాప్తాడు గ్రామంలో గల రోడ్డు ప్రక్క భోజనశాలలో అతడు నివసించేవాడు. “సుమారుగా రెండు నెలల క్రితం ఒక ముసలతనికి ఉండటానికి ఏదైనా చోటు కావాలని ఎవరో చెబితే నేను అతనిని ఇక్కడ ఉండనిచ్చాను. అప్పుడప్పుడు భోజనం కూడా పెట్టేవాడిని," భోజనశాల యజమాని వెంకటరామిరెడ్డి తెలిపారు. నాకు ఫోన్ చేసిన కృష్ణయ్య తరచుగా ఇక్కడ టీ తాగేవారు, అప్పుడప్పుడు గంగప్పతో మాట్లాడుతుండేవారు.
మే, 2017లో నేను PARI కొరకు గంగప్ప గురించి ఒక కథనాన్నిరాశాను. అతనికి అప్పుడు 83 సంవత్సరాలు. 70 ఏళ్ళు వ్యవసాయ కూలీగా పనిచేసిన గంగప్ప ఆ తరువాత మహాత్మునిలా రూపాంతరం చెందారు. గాంధీ వేషధారణలో పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్లోని అనంతపురం పట్టణంలో బహిరంగ ప్రదేశాలలో నిలబడి యాచించేవారు. వ్యవసాయ కూలీగా కంటే ఈ విధంగా భిక్షాటన చేయటం వలన అతను ఎక్కువ ఆర్జించేవారు.
2016లో గంగప్ప పొలాల్లో కూలీ పని చేస్తూ స్పృహ కోల్పోయినప్పటి నుంచి ఆ పనిని చాలించారు. తరువాత తాళ్లు అల్లే పని చేసినా వృద్ధాప్యం వలన వచ్చే ఇబ్బందుల వల్ల అంతగా సంపాదించలేకపోయారు. అప్పుడే అతడు గాంధీలా వేషం దాల్చాలనుకున్నారు.
మామూలుగా దొరికే సామాగ్రితోనే సొంతంగా తానే మేకప్ వేసుకునేవారు. పది రూపాయల పాండ్స్ పౌడర్ డబ్బాతో తనను తాను మహాత్మునిలా ‘మెరిసేటట్లు’ చేసుకునేవారు. రోడ్డు ప్రక్క దొరికే చవకబారు కళ్లద్దాలు అతనికి గాంధీగారి కళ్ళజోడు అయింది. స్థానిక మార్కెట్లో దొరికే పది రూపాయల పేము కర్ర అతని చేతి కర్ర అయింది. ఎక్కడో దొరికిన ఒక మోటార్ బైక్ రియర్ వ్యూ అద్దాన్ని అతను మేకప్, వస్త్రాలు సరిచూసుకోవడానికి వాడేవారు .



