ఆ ప్రాంతంలోని మిగిలిన చోట్ల 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం చల్లగా ఉంటుంది. మాకు కొంచెం దూరంలో మైనస్ 13 డిగ్రీల ఉష్ణొగ్రత ఉన్న ఒక చిన్న ప్రదేశం ఉంది. ఇది "భారతదేశపు మొట్టమొదటి మంచుగుమ్మటం (స్నోడోమ్)" - అది కూడా ఎండలతో మండిపోతోన్న విదర్భలో! దాని ఐస్ రింక్ను కరిగిపోకుండా ఉంచడానికి ఒక్క రోజుకు అయ్యే విద్యుత్ ఛార్జీలు రూ. 4,000.
నాగ్పూర్ (గ్రామీణ) జిల్లాలోని బజార్గాఁవ్ గ్రామ పంచాయితీలోని ఫన్ & ఫుడ్ విలేజ్ వాటర్ & అమ్యూజ్మెంట్ పార్కుకు స్వాగతం! ఆ భారీ వాణిజ్య సముదాయం కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటం సందర్శకులను పలకరిస్తుంటుంది. ఇంకా మీకోసం రోజువారీ డిస్కో, ఐస్ స్కేటింగ్, ఐస్ స్లైడింగ్, 'అనేక కాక్టెయిల్ నిల్వలున్న బార్' కూడా తప్పకుండా ఉంటాయి. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ 18 రకాల వాటర్ స్లైడ్లను, గేమ్లను అందిస్తుంది. సమావేశాల నుండి కిట్టి పార్టీల వరకూ అనేక ఈవెంట్ల కోసం కూడా తన సేవలను అందిస్తుంది.
బజార్గాఁవ్ గ్రామం (జనాభా 3,000) భారీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. "నీటి కోసం రోజూ అనేకసార్లు తిరగాల్సి ఉంటుంది. మహిళలు నీటిని తీసుకురావడానికి ఒక్క రోజులో 15 కిలోమీటర్ల దూరాలు నడుస్తారు," అని సర్పంచ్ యమునాబాయి ఉయికే చెప్పారు. “ఈ గ్రామం మొత్తానికి ఒకే ఒక సర్కారీ (ప్రభుత్వం తవ్వించిన) బావి ఉంది. ఒక్కోసారి నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందుతుంది. కొన్నిసార్లు, పది రోజులకు ఒకసారి కూడా."
2004లో కరవు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బజార్గాఁవ్ గ్రామం ఉంది. ఇంతకు ముందెన్నడూ ఇంటువంటి గతిని ఈ గ్రామం ఎదుర్కోలేదు. గ్రామంలో మే నెల వరకు ఆరు గంటలపాటు - ఇంకా ఎక్కువ గంటలు కూడా - విద్యుత్ కోతలు కూడా ఉన్నాయి. ఈ విద్యుత్ కోతలు ఆరోగ్యంతో సహా రోజువారీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. పరీక్షలకు హాజరయ్యే పిల్లలకు చాలా నష్టం చేస్తాయి. వేసవి తాపం 47 డిగ్రీలకు చేరుకోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది.
గ్రామీణ జీవితంలోని ఈ ఉక్కు నియమాలన్నీ ఫన్ & ఫుడ్ విలేజ్లో వర్తించవు. ఈ ప్రైవేట్ ఒయాసిస్లో బజార్గాఁవ్ కలలో కూడా ఊహించనంత ఎక్కువ నీరు ఉంది. విద్యుత్ సరఫరాలో ఒక్క క్షణం కూడా విరామం ఉండదు. "మేం సగటున చెల్లిస్తాం," అని పార్క్ జనరల్ మేనేజర్ జస్జీత్ సింగ్ చెప్పారు, "నెలకు సుమారు రూ. 4 లక్షల విద్యుత్ బిల్లులు వస్తాయి."






