"నేను బడిలో నేర్చుకున్నదంతా మా ఇంట్లోని వాస్తవికతకు వ్యతిరేకంగానే ఉంది."
పర్వతాల రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని రాజపుత్ సామాజికవర్గానికి చెందిన ఒక బడికి వెళ్ళే బాలిక, ప్రియ. ఆమె బహిష్టు అయినపుడు తప్పక పాటించాల్సినవిగా స్పష్టంగా ఆమెపై రుద్దిన కఠిన సూత్రాలను గురించి ప్రియ మాట్లాడుతోంది. "ఇది దాదాపు రెండు వేరువేరు ప్రపంచాల్లో నివసించడంలాంటిది. ఇంటిదగ్గర నేను అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటూ అన్నిరకాల ఆచారాలనూ, ఆంక్షలనూ పాటించేలా చేస్తారు. బడిలోనేమో మహిళలు పురుషులతో సమానం అని బోధిస్తారు." అని ప్రియ చెప్పింది.
పదకొండవ తరగతి విద్యార్థిని అయిన ప్రియ చదివే పాఠశాల నానక్‌మత్తా పట్టణంలో ఉంది. ఇక్కడినుంచి గ్రామంలో ఉండే ఆమె ఇల్లు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజూ ఆమె సైకిల్ తొక్కుతూ బడికి వెళ్ళివస్తుంటుంది. మంచి విద్యార్థిని అయిన ప్రియ, మొదట్లో ఈ విషయాల గురించి తనకు తాను అవగాహన ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. “నేను పుస్తకాలు చదివి ఇది చేస్తాను, అది చేస్తాను, ప్రపంచాన్ని మారుస్తాను అనుకునేదాన్ని. కానీ ఈ ఆచారాలకు అర్థం లేదని నేను నా కుటుంబాన్ని ఒప్పించలేకపోయాను. నేను వారితో పగలూ రాత్రీ కలిసే జీవిస్తాను, కానీ ఈ ఆంక్షలకు అర్థం లేదని నేను వారికి అర్థం చేయించలేకపోతున్నాను.” అని ఆమె చెప్పింది.
ఈ నియమాలు, నిబంధనల పట్ల ఆమెకు మొదట్లో ఉన్న చిరాకూ, అసౌకర్యం ఏమాత్రం తగ్గలేదు కానీ ఇప్పుడామె తన తల్లిదండ్రుల ఆలోచనతో పాటు సర్దుకుపోతోంది.
ప్రియ, ఆమె కుటుంబం తరాయీ (లోతట్టు) ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇది రాష్ట్రంలో అత్యధిక దిగుబడినిచ్చే వ్యవసాయ ప్రాంతం (సెన్సస్ 2011). ఈ ప్రాంతంలో మూడు పంటలు పండుతాయి - ఖరీఫ్, రబీ, జాయద్. ఇక్కడున్న జనాభాలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. పశువులను- ఎక్కువగా ఆవులనూ గేదెలనూ పెంచుతారు.











