సదర్ లో PHC తెరిచిన కొద్ది నిమిషాలకే సునీత దత్తా తన భర్తతో కలిసి అక్కడికి వచ్చింది. కానీ ఆ దంపతులు వెంటనే వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ పనిచేసే ANM సునీత ని ప్రసవాల గది కి తీసుకెళ్ళింది. “ఇస్మే కైసే హోగా బచ్చా, బహుత్ గందిగి హై ఇధర్(ఇక్కడ కాన్పు ఎలా జరుగుతుంది, చాలా మురికిగా ఉంది ఇక్కడ),“అని ఏ రిక్షాలో వచ్చిందో అదే రిక్షాలో ఎక్కుతూ అన్నది.
ఆమె కాన్పు తేదీ ఈ రోజుకి ఇచ్చారు. “ఇప్పుడు మేము ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి.” అన్నాడు ఆమె భర్త అమర్ దత్త, రిక్షా లో వెళ్ళిపోతూ. సునీతా తన మూడో బిడ్డని ఇక్కడే, ఈ PHC లో ప్రసవించింది. కానీ ఈ నాలుగోసారి వేరే చోటకి వెళదామని నిర్ణయించుకుంది.
పదకొండు గంటలకి, PHC లో ప్రసవాల గది, తన గచ్చుమీద పడిన రక్తపు మరకలు తుడవడానికి ఊడ్చే వారి కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంకా క్రితం రోజు కాన్పు జరిగిన ఆనవాళ్లతో ఆ గది ఇంకా కంగాళీగా ఉంది.
“నా భర్త నన్ను వచ్చి తీసుకెళ్తాడని ఎదురుచూస్తున్నాను. నా డ్యూటీ టైం అయిపోయింది. నేను నైట్ షిఫ్ట్ చేశాను, పేషెంట్లు ఎవరూ రాలేదు. కానీ ఈ దోమల వలన అసలు నిద్ర పట్టలేదు.” అన్నది 43 ఏళ్ళ పుష్ప(పేరు మార్చబడింది). పుష్ప ANM గా బీహార్ రాష్ట్రం సదర్ పట్టణంలో పనిచేస్తోంది. ఆమె మాతో ఆఫీస్ లోనే ANM కోసం కేటాయించిన కుర్చీలో కూర్చుని మాట్లాడుతుంది. ఆ కుర్చీ వెనుక ఉన్న టేబుల్ మీద పేపర్లన్నీ పరిచి ఉన్నాయి. ఆ పక్కనే ఒక మంచం కూడా ఉంది. పుష్పకి సరిగ్గా నిద్రపట్టనిది ఆ మంచం మీదనే.
మంచం పైన వెలసిపోయిన దోమతెర కన్నాలు పడి కొత్త పురుగులను ఆహ్వానిస్తున్నట్టుంది. దాని మీద దిండు పక్కనే బెడ్డింగ్ ని మడతపెట్టి, తర్వాత రోజు ANM వాడుకోడానికి పెట్టారు







