“దేవుడు మమ్మల్ని ఇన్నిసార్లు ముక్కలు ముక్కలుగా చంపే బదులు ఒకేసారి చంపేసుంటే బావుండేది.” అని మే 26న సముద్రపు ఉప్పెన వలన, సుందర్బన్లలో మౌసుని ద్వీపంలో తన ఇంటిని కోల్పోయిన అజార్ ఖాన్ అన్నాడు.
ఆ రోజు సాయంత్రం బంగాళాఖాతంలో ఎగసిన ఉప్పెన వలన మురిగంగ నదిలో మామూలు కన్నా 1-2 మీటర్ల ఎత్తున్న పెద్ద అలలు వచ్చాయి. నీళ్లు ఒడ్డును దాటి దిగువ ప్రాంతంలో ఉన్న ద్వీపాలను ముంచెత్తి, ఇళ్ళని, పొలాలని నాశనం చేసేశాయి.
సైక్లోన్ యాస్ వలన మే 26 మధ్యాహ్నం లోపల మౌసునికి నైరుతి దిశలో 65 నాటికల్ మైళ్ళ దూరం లో ఉన్న ఒడిశా లోని బాలాసోర్ వద్ద కొండచరియ విరిగిపడిన తరవాత ఈ ఉప్పెన వచ్చింది. తీవ్రమైన ఈ తుఫాను లో గాలి 130-140 కిలోమీర్ల వేగంతో వీచింది.
“మేము సముద్రం పోటెత్తడం చూసాను. మాకు మా వస్తువులను భద్రమైన చోటుకు మార్చుకునే సమయం, ఉందనుకున్నాం, కానీ నీళ్లు ఒక్కసారి గా ముంచెత్తాయి”, అన్నది బాగ్దంగా మౌజా (ఊరి)లో ఉండే మజుర బిబి. “మేము ప్రాణాలను చేతిలో పెట్టుకుని పరిగెత్తాము, కానీ మా వస్తువులను కాపాడుకోలేకపోయాము. మాలో చాలా మంది ప్రాణాలను రక్షించుకోవడానికి చెట్లను ఎక్కాము.”
ఎడతెరపి లేని వానల వలన బాగ్దంగా, బాలియారా, కుసుంతలా, మౌసుని- ఈ నాలుగు ఊర్లలో మూడురోజులుగా లాంచీలను పడవలను నడపడం నిలిపివేశారు. నేను 29న మౌసునికి చేరే సమయానికి ఆ ప్రాంతం ఇంకా చాలావరకు నీళ్లలోనే మునిగి ఉంది.
“మా భూమి ఇప్పుడు ఉప్పు నీటిలో మునిగి ఉంది,” అన్నాడు బాగ్దంగా ఆశ్రయంలో కలిసిన అభిలాష్ సర్దార్. “మా రైతులు వారి జీవనోపాధిని కోల్పోయారు. నేను నా పొలంలో ఇంకో మూడేళ్లు సేద్యం చేయలేను. మళ్లీ ఈ భూమి సారవంతమవడానికి ఇంకో ఏడేళ్లు పడుతుంది.“ అని చాలా బాధపడుతూ అన్నాడు.





















