ఆగష్టు 2020 లో తన రెండవ కాన్పు తరవాత, అంజనీ యాదవ్ ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అప్పటి నుంచి ఇంతదాకా మళ్లీ వెనక్కి వెళ్లలేకపోయింది. 31 ఏళ్ళ అంజనీ, ఆమె ఇద్దరు పిల్లలు బీహార్ రాష్ట్రం, గయా జిల్లాలో, బోధ్ గయ బ్లాక్ లో, బాక్రూర్ గ్రామంలో ఉన్న ఆమె తల్లిదండ్రులతో ఉంటున్నారు. తన భర్త ఏ గ్రామానికి చెందినవాడో చెప్పలేదు గాని అది అరగంట దూరంలోనే ఉందని తెలిసింది.
“ప్రభుత్వ ఆసుపత్రిలో నా కాన్పు అయిన రెండు రోజుల తరవాత, నా భాభీ(భర్తకు వదిన) వంట చేసి ఇల్లు శుభ్రం చేయమని అడిగింది. ఆమె కూడా తన కాన్పయ్యాక ఈ పనులన్నీ అదే ఇంట్లో చేశానని చెప్పింది. ఆమె నాకన్నా పదేళ్లు పెద్దది. నా ప్రసవం అప్పుడు నేను చాలా రక్తాన్ని కోల్పోయాను. బిడ్డ పుట్టకముందే మా నర్స్ నాకు అధిక రక్త హీనత ఉందని చెప్పి నన్ను కూరగాయలు, పండ్లు తినమని చెప్పింది. నేను నా అత్తగారింట్లో ఉండిపోయుంటే నా పరిస్థితి అధ్వానంగా తయారయ్యేది.”
చాలా రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో, పిల్లలు, మహిళలలో రక్తహీనత, పోయిన అర్ధ దశాబ్దంలో ఘోరంగా మారింది అని ఇటీవలి నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే (NFHS - 5) తెలుపుతోంది.
తన భర్త, 32 ఏళ్ళ సుఖీరామ్, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఒక బట్టల కంపెనీలో పనిచేస్తాడని అంజని చెప్పింది. అతను తన ఇంటికి గత ఏడాదిన్నరగా రాలేదు. “అతను నా కాన్పు సమయానికి రావలసి ఉంది, కానీ అతని కంపెనీవారు రెండు రోజులకన్నా ఎక్కువ సెలవు తీసుకుంటే అతనిని పనిలోంచి తీసేస్తామని బెదిరించారు. ఈ కరోనా రోగం తరవాత మా పరిస్థితి ఆర్ధికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా చాలా పాడయింది. ఇవన్నీ ఒంటరిగా భరిస్తున్నాను.”
“అందుకే అతను లేని సమయంలో, ఇక చచ్చిపోయే పరిస్థితి వస్తుందని అక్కడనుంచి తప్పించుకుని వచ్చేశాను. ప్రసవం తర్వాత తీసుకునే జాగ్రత్తల గురించి మర్చిపోండి, ఎవరూ నాకు పనులు చేయడానికి సాయం వచ్చేవారు కాదు, ఇక బిడ్డని చూసుకోవడానికి ఎవరూ లేరు,” అన్నదామె PARI తో. అంజని యాదవ్ ఇంకా రక్తహీనతతో బాధపడుతూనే ఉంది, రాష్ట్రంలో ఆమె ఉన్నటువంటి పరిస్థితిలో లక్షలాదిమహిళలున్నారు.
బీహార్లోని 64 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని NFHS - 5 రిపోర్ట్ చెబుతోంది.
“పునరుత్పత్తి వయసులో ఉన్న ఆడవారిలో రక్త హీనత తగ్గించే ప్రయత్నాలలో భారత దేశం ఏ మాత్రం మెరుగుపడలేదని, 15 నుండి 49 మధ్య ఉన్న మహిళలలో 51.4 శాతం ప్రభావితమయ్యారని”, కోవిడ్ - 19 సందర్భం గురించి ప్రస్తావిస్తూ 2020 గ్లోబల్ న్యూట్రిషనల్ రిపోర్ట్ చెబుతోంది.








