కొన్ని నెలల క్రితం, ఒక రోజు ఉదయం, వర్సోవా జెట్టీలో క్రీక్ అంచున ఉన్న రాయిపై కూర్చున్న రామ్‌జీ భాయ్‌ని ఏం చేస్తున్నాడని నేను ఆరా తీస్తే, "టైంపాస్," అని బదులిచ్చారు. అతను అప్పుడే పట్టుకున్న చిన్న టెంగ్డాని (ఒక రకమైన క్యాట్ ఫిష్) నాకు చూపిస్తూ, "దీన్ని ఇంటికి తీసుకెళ్లి తింటాను," అన్నారు. ఇంతలో వేరే మత్స్యకారులు ముందు రోజు రాత్రి క్రీక్‌లో విసిరిన తమ వలలను శుభ్రం చేయడం చూశాను - ఆ వలల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నాయి కానీ చేపలు లేవు!
"ఖడీలో (క్రీక్) చేపలు పట్టడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది. మా చిన్నప్పుడు ఇక్కడి తీరం మారిషస్ తీరంలా ఉండేది. ఒక నాణెం నీటిలోకి విసిరితే అది స్పష్టంగా కనబడేంత స్వచ్ఛంగా ఉండేవి ఇక్కడి నీరు," అని భగవాన్ నామ్‌దేవ్ భాంజీ వాపోయారు. అతను ఉత్తర ముంబై కె-వెస్ట్ వార్డ్‌లోని వర్సోవా కొలివాడ అనే మత్స్యకార గ్రామంలో 70 ఏళ్లకు పైగా నివసిస్తున్నారు.
ఈ జాలర్లు ఇప్పుడు సముద్రపు లోతుల వరకూ వేటకు వెళ్తున్నా, వాళ్ళ వలల్లో తరచూ చిన్న చేపలే చిక్కుకుంటున్నాయి."ఇంతకుముందు మేము పెద్ద పెద్ద పాంఫ్రెట్లని (స్థానికంగా పాప్లెట్ అని కూడా పిలవబడే ఓకే రకమైన చేప; ముంబై వాసులు ఇష్టంగా తింటారు, తెలుగులో వీటిని చందువాయి చేపలు అంటారు) పట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్నవే దొరుకుతున్నాయి. ఇది మా వ్యాపారంపై చాలా ప్రభావం చూపిస్తోంది, " అని భగవాన్ కోడలు, 48 ఏళ్ళ ప్రియా భాంజీ చెప్పింది. ఆమె 25 సంవత్సరాలుగా ఇక్కడ చేపలు అమ్ముతోంది.
2010 మెరైన్ ఫిషరీస్ సెన్సస్ ప్రకారం, కొలివాడలో దాదాపు 1,072 కుటుంబాలు ( 4,943 మంది జనాభా) చేపల వేట పైనే ఆధారపడి బతుకుతున్నాయి. కనుమరుగవుతున్న మత్స్య సంపద గురించి ఇక్కడ ఎవరిని అడిగినా, స్థానిక కాలుష్యం, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న గ్లోబల్ వార్మింగ్ లే మూల కారణాలని చెబుతున్నారు. మొత్తానికి వర్సోవా, అలాగే ముంబైలోని ఇతర తీర ప్రాంతాలపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.











