పార్బతి బహుశా విశిష్టమైన వంశం నుంచి వచ్చి ఉంటుంది. సర్గుజాలోని ఏనుగులు యుద్ధాల్లో కీలకమైన పాత్ర పోషించినవిగా చరిత్రలో ప్రసిద్ధి చెందాయి. “మధ్యయుగ యుద్ధ రంగంలో, ఏనుగులు సామర్థ్యానికి సంబంధించిన ముఖ్యమైన వనరు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సర్గుజా ముఖ్యమైన కేంద్రాల్లో ఒకటి, ఆ కాలంలో ఏనుగులను ఇక్కడి నుంచే సేకరించేవారు. మాల్వా సుల్తాన్లకూ, సర్గుజా పాలకులకూ ఈ ప్రాతిపదికనే ఒక వ్యూహాత్మకమైన సంబంధం ఉంది: మాల్వాకు నిరంతరంగా ఏనుగులను సరఫరా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు” అని జిల్లా గెజిట్లో రాసి ఉంది.
వాస్తవానికి, సర్గుజా మీద తన ఆధిపత్యాన్ని మాల్వా నిలబెట్టుకోడానికి దీన్ని అతి ముఖ్యమైన కారణంగా పరిగణిస్తారు. పర్భూని, పార్బతిని చూసినప్పుడు, వాళ్ళ పూర్వీకులు ఉగ్రంగా, యుద్ధస్వభావంతో ఉండేవారని ఊహించుకోవడం కష్టం. పర్భూ విధేయత కలిగిన ఆత్మలా కనిపిస్తాడు. పార్బతి ఒక కుందేలు లాంటి పోరాటతత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. (చాలా చాలా పెద్దదీ, ప్రశాంతమైనదీ అయిన కుందేలుని మీరు ఊహించుకోగలిగితే.)
సమీపంలోని సంచార భావనలు
దలీప్, నేను, మేం అంబికాపూర్***లో కుదుర్చుకున్న ఒక పురాతనమైన జీపుకు డ్రైవర్, కలిసి ఒక గ్రామం కోసం వెతికేం, కానీ చివరికది మాకు కనిపించనే లేదు. ఒక చిన్న బిర్హోర్ కాలనీ సమీపంలో మేం మా జీపుని నిలబెట్టి ఉంచాం. హో, సంతల్, ముండాల మాదిరిగానే బిర్హోర్లు కూడా ఆస్ట్రో-ఆసియాటిక్ భాషా విభాగానికి చెందిన అత్యంత ప్రాచీనమైన తెగ. ఛోటానాగపూర్ ప్రాంతంలోని సంచార జాతులైన వీళ్ళు ప్రధానంగా పలామూ, రాంచీ, లోహర్దగా, హజారీబాగ్, సింఘ్భూమ్ పరిసరాల్లో తిరుగుతుంటారు. వాళ్ళిప్పుడు ఒక అంతరించిపోతున్న తెగ. ప్రస్తుతానికి వీరు సుమారు 2 వేల మంది మాత్రమే మిగిలేరు, బహుశా ఇంకా తక్కువ కూడా కావచ్చు.
'దగ్గర్లోనే’ ఒక ఆసక్తికరమైన గ్రామం ఉందని, ఈ బిర్హోర్ తెగవాళ్ళు మాకు చెప్పేరు. ఇప్పుడు మేం నేర్చుకొనే ప్రక్రియలో ఉన్నాం. రోడ్డు మీద అనేక మైళ్ళు ప్రయాణించాక, ‘దగ్గర్లోనే’ అనే ఒక సంచార వ్యక్తి భావనను ఆమోదించడం ప్రాణాంతకం అనేది నేర్చుకొనే ప్రక్రియలో ఇప్పుడు మేం ఉన్నాం. ఇబ్బందిని కలిగిస్తున్న జీపును బిర్హోర్ల సంరక్షణ కింద వదిలేసి, మేం కాలి నడకన ముందుకి సాగేం.
డ్రైవర్ కూడా మాతో వద్దామనుకున్నాడు. బిర్హోర్లు కనిపిస్తున్న తీరుకు తాను భయపడ్డానని అతను చెప్పేడు. ఇప్పుడతను పార్బతి కనిపించే తీరు చూసి భయపడుతున్నాడు. డ్రైవర్ తనకెలా కనిపిస్తున్నాడని తాననుకుంటున్నాడో, దాని గురించి దలీప్ కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసేడు. అయినా అతను కూడా అలాగే మావెంట వచ్చాడు.
పర్భూ మమ్మల్ని ఏనుగును ఎక్కించుకుంటానంటూ ఉదారంగా ఒక అవకాశం ఇచ్చాడు. మేం దాన్ని ఆమోదించేం. కొన్ని నెలల కిందట, 1993 మధ్యలో, నా ప్రాజెక్ట్ కోసం నేను బయటికి వచ్చినప్పటి నుంచీ నేను ఉపయోగించిన వివిధ రకాల రవాణా సాధనాల సంఖ్యని లెక్కెట్టడం మొదలెట్టేను. అవి నాటు పడవలు, తెప్పల నుంచి రైళ్ళ పైకప్పుల వరకూ అనేక రకాలున్నాయి. కానీ ఆ జాబితాలో ఏనుగు లేదు. బాటలో కొంతదూరం కిందికి వెళ్ళిన తరువాత, పర్భూతో మాట్లాడడానికి కూర్చున్నాం. ఒక గ్రామం కోసం వెతుకుతున్న సంగతి మరచిపోయేం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేదో ఉంది. అది కూడా ‘దగ్గరలో'నే. పార్బతికి అతనెలా తిండి పెడుతున్నాడో, సంరక్షిస్తున్నాడో మేం తెలుసుకోవాలనుకున్నాం.
ఇంటర్వ్యూలు చేయటంలో మా ఎన్నికైన నైపుణ్యాల్ని ఉపయోగించి గంటన్నరసేపు గడిపిన తరువాత కూడా, మేం నేర్చుకున్నది ఖచ్చితంగా ఏమీ లేదు. పర్భూ చక్కటి మనిషే కానీ సమాచారాన్ని చెప్పడానికి ఇష్టపడలేదు. జనం నించి, ఆలయ ఉత్సవాల నించి వచ్చేవాటితో తమ జీవనం బాగానే సాగుతోందని అతను చెప్పేడు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అది నిజమే కావచ్చు కానీ, ఇక్కడ కాకపోవచ్చు. “నువ్వో *%*#* అబద్ధాలకోరువి,” అన్నాడు దలీప్. “దీనికి 200 కిలోల గడ్డి కావాలి. ఇంకా ఇతర ఆహారం కూడా. నువ్వేం చేస్తావో నేను చెబుతా చూడు, దగ్గిర్లో ఉన్న వ్యవసాయ భూముల్లోకి అది చొరబడేలా చేస్తావు, కదూ?” అని అడిగేడతను.
బహుశా ఇది నిజమే కావచ్చు. కానీ పర్భూ దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చేడు. “మేం ఈ చెత్త ఏనుగుని కూడా ఇంటర్వ్యూ చేయగలం,” అన్నాడు దలీప్. “అదే మరింత యథార్థంగా ఉంటుంది. ఇతను దీన్ని మేపడానికి మరీ అడవుల్లోపలికి వెళ్ళడు. అక్కడ అసలైన అడవి ఏనుగులు ఉంటాయి. ఇతర జీవులూ ఉంటాయి. లేదు, అతను పొలాల్లోని పంటను దోచుకుంటున్నాడు. ఇతను దీన్నక్కడికి తీసుకుపోతాడు, దానితో పంటని నాశనం చేయిస్తాడు.” అన్నాడు దలీప్. దాని తిండి గురించీ, ఖర్చుల గురించీ మేం చర్చిస్తూ ఉంటే, పార్బతి మాత్రం పర్భూతో ఆటలాడుతూనే ఉంది, దాని తొండం అతని తలమీంచి తతిరుగుతోంది. అది అతన్ని ఇష్టపడుతోందన్నది స్పష్టం. అది పొలాల్లో పంటని దోచుకుంటున్నట్లయితే, ఆ పనిని చాలా బాగా చేస్తున్నట్టే.