“మూడు వేల సార్లు దీనిని కొట్టాలి.” ఈ మాటలు అన్న వెంటనే మీనాక్షి అదే పని చేయడం ప్రారంభిస్తుంది. ఆ దెబ్బలు తింటున్న వస్తువు వంటకు ఉపయోగించే మట్టి పాత్రల్లాంటి, ఇంకా కొలిమిలో కాల్చని ఒక మట్టి కుండ. అయితే, ఆ కుండ ఆమె చేతుల్లో దెబ్బలు తిని రూపు మార్చుకుని ఒక లయ వాయిద్యంగా మారుతుంది.
కుండని తన ఒళ్లో పెట్టుకుని పెద్ద కర్ర గరిటెతో అటూ ఇటూ చరచడం మొదలుపెడుతుంది మీనాక్షి. ఆ పని పూర్తయ్యే సరికి, కుండ ఘటంగా మారుతుంది. దక్షిణ భారత కర్ణాటక సంగీత కచ్చేరీలలో తప్పనిసరిగా ఉపయోగించే అతి సున్నితమైన లయ పలికే వాయిద్యం ఘటం. అరవై మూడు సంవత్సరాల మీనాక్షి కేశవన్ నిపుణురాలైన ఘటం తయారీదారు. మనమదురై అనే ఒక ప్రత్యేకమైన ఘటం తయారు చేసే కుటుంబం బహుశా ఇంక మీనాక్షి కుటుంబం మాత్రమే మిగిలి ఉందేమో.
తమిళనాడులో మదురై నుంచి సుమారు గంట ప్రయాణం చేస్తే మీనాక్షి స్వస్థలం మనమదురై చేరతాం. ఆ ఊరు ఘటం తయారీకి ప్రసిద్ధి. “పదిహేనేళ్ళ వయసులో నన్ను నాలుగు తరాల నుంచి ఘటాలు చేస్తున్న కుటుంబంలో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు.” తన భర్త, మామగారి దగ్గర ఘట చేయడం నేర్చుకుంది మీనాక్షి. “ఈ పని చక్కగా రావడానికి ఆరేళ్ళు పడుతుంది,” మీనాక్షి కుమారుడు రమేష్ చెప్తాడు. అది చాలా వేగంగా నేర్చుకోగలిగే వారికి. “కుమ్మరి కుటుంబానికి చెందిన వారు కాకపోతే ఇంకా చాలా సమయం పడుతుంది.”
“స్వరం సరిగా వచ్చేలా ఘటాన్ని తయారు చేయడం అసలు కష్టమైన పని," తన కుడి చేతితో ఘటం పక్కల చరుస్తూ వివరిస్తుంది మీనాక్షి. ఎడమ చేత్తో కుండ లోపల ఆమె ఒక గుండ్రటి రాయిని తిప్పుతోంది. "కుండ గబుక్కున ముక్కలు కాకుండా చూసేందుకు, గోడలు నున్నగా వచ్చేలా చూసేందుకు అలా రాయితో నొక్కాలి." నలభై ఏళ్ళ నుంచి మట్టి పిసికీ పిసికీ ఎప్పుడూ చేతులు నెప్పిగానే ఉంటాయి అంటుంది మీనాక్షి. అలిసిపోయిన భుజాల నుంచి వేళ్ళ కొసల వరకు నెప్పి కత్తిలా పొడుస్తుంది. ఈ విషయం చెప్తూనే ఆమె మళ్ళీ తన కట్టె, రాయి తీసుకుని పని ప్రారంభిస్తుంది. మళ్ళీ కుండకి దెబ్బలు.







