అది 1997వ సంవత్సరం.
సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్, మణిపూర్ జట్లు తలపడ్డాయి. ఏటేటా జరిగే ఈ అంతర్రాష్ట్రీయ టోర్నమెంట్లో గతంలో జరిగిన మూడు ఫైనల్స్‌లోనూ బెంగాల్ మణిపూర్ చేతిలో ఓడిపోయింది. కానీ వారిప్పుడు తమ పసుపు-మెరూన్ రంగు జెర్సీలు ధరించి ధాటీగా నిలబడివున్నారు. పశ్చిమ బెంగాల్, హల్దియా నగరంలోని ఆ దుర్గాచక్ స్టేడియం బెంగాల్ జట్టులోని ఫుట్‌బాల్ క్రీడాకారిణి వందన(బందన) పాల్ సొంతగడ్డ.
విజిల్ ఊదారు, ఆట ప్రారంభమయింది.
అంతకుముందు జరిగిన ఈ ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 16 ఏళ్ల ఈ స్ట్రైకర్ హ్యాట్రిక్ సాధించింది. ఆ మ్యాచ్‌లో గోవాపై పశ్చిమ బెంగాల్ గెలిచింది, కానీ పాల్‌కు ఎడమ చీలమండపై గాయమయింది. “నేను అలాగే సెమీ-ఫైనల్లో [పంజాబ్‌పై] ఆడాను, కానీ చాలా నొప్పితో ఉన్నాను. ఆ రోజు మేం ఫైనల్స్‌కు చేరుకున్నప్పుడు, నేనసలు నిలబడలేకపోయాను."
పశ్చిమ బెంగాల్ జట్టులో అతి పిన్న వయస్కురాలైన పాల్, ఛాంపియన్షిప్ ఫైనల్స్‌ను బెంచ్ మీద కూర్చొని చూసింది. మ్యాచ్ ముగియడానికి ఇంకా కొన్ని నిమిషాలు మిగిలి ఉన్నాయి. రెండు జట్లలో ఎవరూ గోల్ చేయలేదు. పశ్చిమ బెంగాల్ జట్టు శిక్షకురాలు (కోచ్) శాంతి మల్లిక్ సంతోషంగా లేరు. ఆమె పడుతున్న ఒత్తిడిని మరింత పెంచుతూ, 12,000 మంది వీక్షించే వీలున్న ఆ స్టేడియంలో క్రిక్కిరిసిన ప్రేక్షకులలో రాష్ట్ర ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి కూడా ఉన్నారు. మల్లిక్, సిద్ధంగా ఉండమని పాల్‌తో చెప్పారు. “‘నా పరిస్థితి చూడండి, ఎలావుందో’ అని నేను ఆమెకు చెప్పాను. కానీ కోచ్, ‘నువ్వు లేచి ఆడావంటే ఖాయంగా గోల్ పడుతుంది. అలా అని నా మనసు నాకు చెబుతోంది’ అన్నారు," అని పాల్ చెప్పారు.
దాంతో నొప్పిని తగ్గించడానికి గబగబా రెండు ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత, గాయం చుట్టూ ముడతలుగల రబ్బరు పట్టీతో గట్టిగా కట్టు కట్టి, ఆట దుస్తులు ధరించి పాల్ వేచి ఉంది. మ్యాచ్ డ్రా అయింది, గోల్డెన్ గోల్ కోసం అదనపు సమయం ఇచ్చారు- ఇప్పుడు ఏ జట్టు మొదట స్కోర్ చేస్తే ఆ జట్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంటుంది.
"నేను క్రాస్‌బార్‌ను లక్ష్యంగా చేసుకున్నాను, బంతి కుడివైపుకు తూగింది. కీపర్ ఎగిరి దూకింది. కానీ బంతి ఆమెను దాటి నెట్లోకి దూసుకెళ్లింది.





















