“ఎక్కడా ఏ ఇబ్బంది లేదు. తేడాగా ఏమీ జరగలేదు.అంతా బానే ఉంది, జీవితం సాదాగా గడిచిపోతోంది.” అన్నాడు దినేష్ చంద్ర సుతార్- తమ కుటుంబపు దస్తావేజుల మధ్యలో కూర్చుని, రోజువారీ జీవితం ఎలా ఉండేదో తలుచుకుంటూ, జరగరానిది ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ…
బాన్సీ గ్రామంలో తన ఇంటి గోడల మీద అతని చనిపోయిన భార్య ఫోటోలు వేలాడుతున్నాయి. దినేష్ దగ్గర ఫైల్ లో ఉన్న ఫోటోనే గోడ మీద కూడా ఉంది. 2015లో వాళ్ల పెళ్ళైన కొన్ని నెలలకు ఏదో ప్రభుత్వ స్కీం కు దరఖాస్తు చేసుకోవడానికి ఆ ఫోటో తీయించుకున్నారు.
ఐదేళ్లుగా దినేష్ ఈ పేపర్లను, ఫోటోలను తన మున్నాళ్ల ముచ్చటైన పెళ్లికి గుర్తుగా ఉంచుకున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు- మూడేళ్ళ చిరాగ్, 29 రోజుల దేవాన్ష్. చిన్న వాడికి పేరు కూడా పెట్టకముందే దినేష్ భార్య భావన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్న సమయంలో లోపలి పేగు లో కన్నాలు పడి, 50 మంచాలున్న బారిసద్రి మున్సిపాలిటీ కి చెందిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC) లో చనిపోయింది.
బి.ఎడ్ డిగ్రీ వుండి, బన్సీకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్వాల్ లో స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ 15,000 రూపాయలు సంపాదిస్తున్న దినేష్ జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తూ తమ జీవితం ఇలా గాడి తప్పడానికి ఏది కారణమో అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆఖరికి తననే తిట్టుకుంటాడు.
“డాక్టర్లు అంతా బానే జరుగుతుందని చెప్పారు అది నమ్మి నేను ఆపరేషన్ కు ఒప్పుకోవడం వలన ఇదంతా జరిగిందా? నేను ఇంకా తెలుసుకుని ఉండవలసింది. నేను ఆపరేషన్ కి ఒప్పుకోకపోవలసింది, ఎవరినీ నమ్మకపోవలసింది. ఇదంతా నా తప్పే” అన్నాడు దినేష్. ఇలా అతను 24 జులై 2019 న అతని భార్య చనిపోయిన దగ్గరనుంచి తనని తాను నిందించుకుంటూనే ఉన్నాడు.
25 జూన్, 2019 న, తాను చనిపోయే నెల ముందుగానే 25 ఏళ్ళ భావన ఒక ఆరోగ్యమైన మగ శిశువుకు జన్మనిచ్చింది. మొదటిసారి లానే రెండవ సారి కూడా సుఖప్రసవం జరిగింది. ఆమె రిపోర్టులు, చెకప్ లే గాక ఊరికి 60 కిలోమీటర్ల దూరం లో చిత్తగడ్ జిల్లా, బారి సద్రి CHC లో జరిగిన ఆమె కాన్పు తో సైతం అన్ని సరిగ్గానే ఉన్నాయి.







