ఫలై గ్రామంలో ఒక గుడిసెలో, మహారాష్ట్ర లో వాయువ్య దిశగా సత్పుడా కొండల నడుమ, ఎనిమిదేళ్ల షర్మిల పావ్ర ఆమె ‘స్టడీ టేబుల్’ వద్ద పెద్ద కత్తెర, బట్టలు, సూది దారాలతో. కుర్చుని ఉంది
ఆ టేబుల్ మీద ఒక పాత కుట్టు మెషిన్ ఉంది. దాని మీద వాళ్ళ నాన్న ఇంకా కుట్టడం పూర్తి చెయ్యని ఒక డ్రెస్ ఉంది. ఆమె దానిని తీసుకుని, కుట్టుమెషిన్ మీద పనిచేయడంలో తన నైపుణ్యాన్ని మెరుగు పరచుకుంటోంది.
నందుర్బర్ జిల్లాలో తోరణమాల్ ప్రాంతంలోని ఈ కుగ్రామంలో ఉన్న ఈ టేబుల్ పైనే ఆమె ఏదన్నా నేర్చుకునేది. మార్చ్ 2020 లో ఆమె హాస్టల్(రెసిడెన్షియల్ స్కూల్) మూసేసినప్పటి నుంచి ఇదే ఆమె నేర్చుకునే స్థలం. “అమ్మ నాన్న కుట్టడం చూసి, ఈ మెషిన్ నడపడం నా అంతట నేనే నేర్చుకున్నాను. ” అన్నది ఆమె.
ఆమె తన బడిలో నేర్చుకున్నదంతా, ఈ పద్దెనిమిది నెలల విరామంలో పూర్తిగా మర్చిపోయింది.
ఫలైలో బడి లేదు. తమ పిల్లలకు చదువు చెప్పించుదామన్న కోరికతో, 2019లో, షర్మిల తల్లిదండ్రులు నందుర్బార్ పట్టణంలోని అటల్ బిహారి వాజపేయి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ లో వేశారు. ఇది వారి ఊరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొత్తం 60 ఆశ్రమశాలల్లో(షెడ్యూల్ ట్రైబ్ వర్గాల కోసం ప్రత్యేకమైన బడులు) ఈ బడి కూడా ఒకటి. వీటిని జిల్లా పరిషత్తు నడుపుతుంది, ఇది 2018లో మహారాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డుకు అనుసంధానించబడింది. అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పబడిన దీని విద్యా విధానం స్థానికంగా రూపొందించి,మరాఠీ భాషలో భోదించబడుతుంది.(ఇప్పుడు ఆ బోర్డుని తీసేశారు, ఇవి ఇప్పుడు స్టేట్ బోర్డు లో భాగమయ్యాయి.)
















