“వ్యవసాయంలో సంక్షోభం అంటూ ఏమీ ఉండదు.”
ఈయన దర్శన్ సింగ్ సంఘేరా – పంజాబ్లో శక్తివంతమైన సంస్థల్లో ఒకటైన అర్థియాస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు; ఆ సంస్థ బర్నాలా జిల్లా చాప్టర్ అధినేత. అర్థియాలు రైతులకూ, వారి ఉత్పత్తుల కొనుగోలుదారులకూ మధ్య ఉండే దళారులు. రైతులు పండించిన పంటను వేలం వేసి, కొనుగోలుదారులకు అందజేసే ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ వ్యాపారంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వీళ్ళు వడ్డీ వ్యాపారులు కూడా. ఇటీవలి కాలంలో, పెట్టుబడి డీలర్లుగా కూడా అవతారమెత్తారు. వీటన్నిటి అర్థం: ఈ రాష్ట్ర రైతులపై వీళ్ళకు గొప్ప పట్టు ఉందని.
ఆర్థియాలు రాజకీయంగా కూడా శక్తివంతులు. శాసనసభ సభ్యులను వీళ్ళు తమ సోదరులుగా లెక్కిస్తారు. గతేడాది జులైలో, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ను “ఫఖ్ర్-ఎ-క్వామ్” ('సామాజికవర్గానికే గర్వకారణం') అనే బిరుదుతో వీళ్ళు సత్కరించారు. దీనిని ఒక “ఘన సత్కారపు వేడుక”గా స్థానిక మీడియా వర్ణించింది. రైతులు ఆర్థియాలకు ఉన్న బాకీలను మాఫీ చేయడం కష్టమని ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే, ఆయన గౌరవార్థం ఆర్థియాలు చేపట్టిన కార్యక్రమం అది.
“గ్రామీణ పంజాబ్లోని రైతులపై, వ్యవసాయ కూలీలపై ఋణభారం” అనే ఒక అధ్యయనం ప్రకారం, 86 శాతం రైతు కుటుంబాలు, 80 శాతం వ్యవసాయ కార్మిక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఋణ మొత్తంలో ఐదోవంతు కమిషన్ ఏజెంట్లకు, వడ్డీ వ్యాపారులకు చెల్లించాలని పటియాలాలోని పంజాబీ యూనివర్శిటీలో పరిశోధకులుగా పనిచేస్తున్న ఈ అధ్యయన రచయితలు తెలిపారు. ఈ అప్పుల బాధ రైతుల్లో ఆందోళనను కలిగిస్తోంది; చిన్న, సన్నకారు రైతులపైనే ఈ భారం ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనంలో భాగంగా 1,007 రైతులతో, 301 వ్యవసాయ కార్మిక కుటుంబాలతో పరిశోధకులు మాట్లాడారు. 2014-15లో, దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి సర్వేలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జరిగాయి. ఇదే సమయంలో, పెరుగుతున్న ఋణభారం, దిగజారుతున్న రైతు పరిస్థితులపై అనేక అధ్యయనాలు జరిగాయి.
వ్యవసాయ రంగంలోని కష్టాలను కొట్టిపారేస్తూ, “అనవసరంగా పెట్టే ఖర్చులే రైతుని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఉత్పాదకాలు కొనుగోలు చేయడానికి మేం తనకి డబ్బు సహాయం చేస్తాం; పెళ్లిళ్లు, వైద్యం, ఇతర ఖర్చుల కోసం కూడా. పంట చేతికి రాగానే, అతను ఆర్థియాకు అప్పగిస్తాడు. మేం ఆ పంటను శుభ్రం చేసి, గోతాలకు ఎత్తి, మార్కెట్లో అమ్మడానికి తగిన చర్యలు చేపడతాం; అలాగే ప్రభుత్వం, బ్యాంకుల వ్యవహారాలు చూస్తాం,” అని దర్శన్ సింగ్ సంఘేరా వివరించాడు. ఇలా సేకరించిన గోధుమలు, వరి పంటల మొత్తం విలువలో, 2.5 శాతాన్ని ప్రభుత్వం ఈ ఏజెంట్లకు చెల్లిస్తుంది. వీళ్ళ అధికార కార్యకలాపాలన్నిటినీ పంజాబ్ రాష్త్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు సమీక్షిస్తుంది. ఈ దళారీల ద్వారానే రైతులకు చెల్లింపులు జరుగుతాయి. ఇది ఈ ఆర్థియాలకు వడ్డీ వ్యాపారం నుండి వచ్చే ఆదాయానికి అదనం.





