మొట్టమొదటిసారి మన్వరా బేవా బకెట్ (బీడీ చుట్టడానికి కావాల్సిన ముడిసరుకు పెట్టుకునే తట్ట) ఖాళీగా వుంది. కర్మాగారం మూతపడిపోయింది. మున్షీ (గ్రామాల్లో ఇళ్లకు ముడి సరుకు ఇచ్చి, బీడీలు తీసుకువెళ్లే కాంట్రాక్టర్) 20 రోజులుగా కనపడ్డంలేదు. కుటుంబానికి తిండి పెట్టడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. దేశంలో ఎక్కడో ఒక ప్రాంతంలో కొందరు 'నల్లదానికి' వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమే తన ఈ దుస్థితికి కారణం అని తనకు తెలుసని మన్వారా అన్నారు.
45 ఏళ్ల మన్వారా గత 17 ఏళ్లుగా బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషిస్తున్నారు. 1000 బీడీలు చుట్టినందుకు 126 రూపాయలు వస్తాయి. తన భర్త చనిపోయాక ఆమె ఈ పని మొదలుపెట్టారు. వాళ్లకు భూమి లేదు. ఇద్దరు కొడుకులు వున్నారు. ఆమె భర్త చనిపొయ్యేనాటికి చిన్న కొడుక్కి ఆరు నెలలు మాత్రమే. వయసులో వున్నప్పుడు ఆమె రోజుకి 2000 బీడీల వరకూ చుట్టేవారు. ఇప్పుడు 500 బీడీలు మాత్రమే చెయ్యగలుగుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ లెక్కల ప్రకారం, పశ్చిమ బెంగాల్లో మొత్తం ఇంటి నుంచి పనిచేసే బీడీ కార్మికులలో మహిళలు 70 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారు. "ఇక్కడ బీడీలు తయారు చేయడం రాకపోతే అమ్మాయిలకు సరైన భర్త దొరకడం కూడా కష్టమే," అని మనిరుల్ హక్ అనే మున్షీ అన్నారు. అతను పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ జిల్లా జంగిపూర్ సబ్ డివిజన్లోని ఒక బీడీలు తయారుచేసే కర్మాగారంలో కాంట్రాక్టర్.






