చిటెంపల్లి పరమేశ్వరికి తరచుగా ఎక్కడికైనా పరుగెట్టి పారిపోవాలనిపిస్తుంటుంది. "కానీ నేను నా పిల్లలను విడిచిపెట్టి పోలేను. వాళ్ళకున్నది నేనొక్కదాన్నే," అంటుంది 30 ఏళ్ళ వయసున్న ఈ తల్లి.
పరమేశ్వరి భర్త చిటెంపల్లి కమల్ చంద్ర ఒక రైతు. 2010 నవంబర్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయే నాటికి అతని వయసు ముప్పయ్యేళ్ళు కూడా లేవు. "అతను ఉత్తరంలాంటిదేమీ రాసిపెట్టి పోలేదు. బహుశా అతనికి రాయటం సరిగ్గా రాకపోవటం వలన కావొచ్చు," పేలవంగా నవ్వుతూ చెప్పిందామె.
ఆ విధంగా ఆమె తన ఇద్దరు పిల్లలైన శేషాద్రి, అన్నపూర్ణలకు తల్లీ తండ్రీ తానే అయింది. ఆ పిల్లలిద్దరూ ఇప్పుడు వాళ్ళ ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్లో ఉంటూ ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. "వాళ్ళు నాకు బాగా గుర్తొస్తుంటారు, బెంగగా ఉంటుంది," అంటుంది ఆ తల్లి. ఇంతలోనే తనను తాను ఓదార్చుకుంటున్నట్టుగా, "వాళ్ళకక్కడ సమయానికి తిండి దొరుకుతుందని నాకు తెలుసు" అంటుంది.
ప్రతినెలకు ఒకసారి వాళ్ళను చూసివచ్చే రోజు కోసం ఆమె ఎదురుచూస్తుంటుంది. "నా దగ్గర డబ్బులున్నప్పుడు, వాళ్ళకి (పిల్లలకు) 500 (రూపాయలు) ఇస్తుంటాను. నా దగ్గర తక్కువ డబ్బులున్నపుడు వాళ్ళకు 200 (రూపాయలు) ఇస్తాను," అంటుందామె.
ఈ కుటుంబం తెలంగాణాలో షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న మాదిగ సముదాయానికి చెందినది. పరమేశ్వరి చిల్తంపల్లె గ్రామంలో ఒక ఒంటి గది ఇంటిలో నివాసముంటోంది. ఆమె ఉండే ఇంటి పైకప్పు కుంగిపోతోంది. ఇంటి బయట ఒక తలుపులు లేని కొట్టాం ఉంది. తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న ఈ ఇల్లు చనిపోయిన ఆమె భర్త కమల్ చంద్ర కుటుంబానికి చెందినది. అతనితో పెళ్ళి జరిగిన తరవాత ఆమె ఇక్కడకు వచ్చి ఉంటోంది.










