“ఏమి చెప్పను? నా వెన్ను విరిగింది, నా పక్కటెముక బయటకి పొడుచుకు వచ్చింది" అని బిబాబాయి లోయారే అన్నది. “నా పొత్తికడుపు లోపలి వెళ్ళిపోయింది, గత 2 లేదా 3 సంవత్సరాలుగా నా పొట్ట,వెన్ను కలిసిపోయాయి. డాక్టర్ నా ఎముకలు బోలుగా మారాయని చెప్పారు.”
ముల్షి బ్లాక్‌లోని హదాషి గ్రామంలోని ఆమె ఇంటికి ఆనుకుని ఉన్న, టిన్ షీట్లతో తయారుచేసిన వంటగదిలో, మసక వెలుతురులో మేము కూర్చున్నాము. దాదాపు 55 ఏళ్ల వయసున్న బీబాబాయి గిన్నెలో మిగిలిపోయిన అన్నాన్ని మట్టి పొయ్యి మీద వేడి చేస్తోంది. ఆమె నాకు కూర్చోవడానికి ఒక చెక్క పాట్(పీట) ఇచ్చి తన పనులను చేసుకుంటోంది. ఆమె మధ్యలో లేచినప్పుడు, ఆమె గడ్డం దాదాపు ఆమె మోకాళ్లను తాకేలా నడుము నుండి ఆమె పూర్తిగా వంగి పోయినట్లుండడం నేను చూశాను. ఆమె గొంతుకు కూర్చున్నప్పుడు, ఆమె మోకాళ్లు, చెవులను తాకుతున్నాయి.
గత 25 ఏళ్లలో బోలు ఎముకల వ్యాధి, నాలుగు సర్జరీలు బిబాబాయిని ఈ విధంగా చేశాయి. మొదట, ఆమె ట్యూబెక్టమి చేయించుకుంది, ఆ తర్వాత హెర్నియాకు శస్త్రచికిత్స, తరువాత గర్భాశయ శస్త్రచికిత్స, ఆపై ఆమె ప్రేగులు, పొత్తికడుపులో కొవ్వు కండరాలలో కొంత భాగాన్ని తొలగించే ఆపరేషన్ చేయించుకుంది.
“నాకు 12 లేదా 13 సంవత్సరాల వయస్సులో పెళ్లి జరిగింది, నేను వయస్సులోకి రాగానే [ఆమెకు మొదటి పీరియడ్ వచ్చింది] పెళ్ళిచేసినా, మొదటి ఐదేళ్లు నేను గర్భం దాల్చలేదు,” అని బీబాబాయి చెప్పింది, ఆమె పాఠశాలకు వెళ్ళలేదు. ఆమె భర్త, మహిపతి లోయారే - అందరూ అప్పా అని పిలుస్తారు- ఆమె కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు, ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు, పూణే జిల్లాలోని ముల్షి బ్లాక్‌లోని వివిధ గ్రామాలలోని పాఠశాలల్లో పనిచేశాడు. లోయరే కుటుంబం, వారి వ్యవసాయ భూమిలో వరి, బెంగాల్ పప్పు, బీన్స్ మరియు చిక్కుళ్ళు పండిస్తున్నారు. వారికి ఒక జత ఎద్దులు, ఒక గేదె, ఒక ఆవు, దాని దూడ కూడా ఉన్నాయి. ఆవు ఇచ్చే పాలు వారికి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తాయి. మహిపతికి పెన్షన్ కూడా వస్తుంది.
"నా పిల్లలందరూ ఇంట్లోనే పుట్టారు," అని బిబాబాయి చెప్పింది. ఆమెకు 17 ఏళ్ల వయసులో మొదటి సంతానం, అబ్బాయి పుట్టాడు. “మేము మా తల్లిదండ్రుల ఇంటికి [“కొండ శ్రేణికి ఆవల” ఉన్న గ్రామంలో] పక్కా రోడ్డు, వాహనాలు లేని కారణంగా ఎద్దుల బండిలో వెళ్తున్నాము. దారిలో నా ఉమ్మనీటి సంచి పగిలింది. నాకు ప్రసవం అక్కడే జరిగి, ఆ ఎద్దుల బండిలోనే నా మొదటి బిడ్డ పుట్టాడు.” అని బిబాబాయి గుర్తుచేసుకుంది. ప్రసవ సమయంలో చినిగిన కండరానికి ఆమెకు ఎపిసియోటమి (episiotemy- ప్రసవ సమయంలో కొందరికి యోని కింది కణజాలం చిరిగిపోతుంది, కొన్నిసార్లు కావాలనే ప్రసవం తేలికగా అవడానికి కత్తిరిస్తారు, రెండు సమయాలలోను తిరిగి కుట్లు వేస్తారు, దానినే ఎపిసియోటమి అంటారు) చేశారు. కానీ అదెక్కడ జరిగిందో ఆమెకి గుర్తు లేదు.







