జూన్ 16, 2022 నాటి రాత్రి, అస్సాంలోని నొగాఁవ్ గ్రామంలో, ఇతరులందరి మాదిరిగానే లబా దాస్ కూడా ననోయ్ నది ఒడ్డున నిర్విరామంగా ఇసుక బస్తాలను ఒకదానిపై మరొకటి పేరుస్తున్నారు. బ్రహ్మపుత్రా నదికి ఉపనది అయిన ఈ నది కట్టలు తెంచుకొని పొంగిప్రవహించబోతోందని అంతకు 48 గంటల ముందే వారిని హెచ్చరించారు. ఆ నది ఒడ్డునే ఉన్న దరంగ్ జిల్లాలోని ఈ గ్రామాలకు జిల్లా యంత్రాంగం ఇసుక బస్తాలను అందించింది.
"తెల్లవారుజామున (జూన్ 17) ఒంటిగంటకు కరకట్ట విరిగిపోయింది" అని శిపాఝార్ బ్లాక్‌కు చెందిన నొగాఁవ్‌లోని హీరా సూబూరి కుగ్రామంలో నివసిస్తున్న లాబా వరదను గురించి మాట్లాడుతూ చెప్పారు. "ఇది వేర్వేరు పాయింట్ల వద్ద విరిగిపోతుండటంతో మేం ఏం చేయలేకపోయాం." అప్పటికి ఐదు రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ, నెల ప్రారంభంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలమైపోయింది. జూన్ 16-18 తేదీల మధ్య అస్సాం, మేఘాలయలలో 'అత్యంత భారీ వర్షపాతం' (రోజులో 244.5 మి.మీ, లేదా అంతకంటే ఎక్కువ) పడవచ్చునని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది..
జూన్ 16వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో, నొగాఁవ్‌కు దక్షిణంగా ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఖాశ్దిపిలా గ్రామంలోని కాలితపరా కుగ్రామంలోకి కూడా ననోయ్ ప్రవాహం విపరీతమైన శక్తితో దూసుకెళ్లింది. జయమతి కలిత కుటుంబం ఈ వరదల్లో తమ సర్వస్వాన్నీ కోల్పోయింది. "ఒక్క చెంచా కూడా మిగల్లేదు," అని తగరపు పైకప్పు ఉన్న ఒక తాత్కాలిక టార్పాలిన్ ఆశ్రయం బయట కూర్చుని ఉన్న జయమతి చెప్పారు. "మా ఇల్లు, వడ్ల కొట్టు, గోశాల బలమైన నీటి ప్రవాహంతో కొట్టుకుపోయాయి," అన్నారామె.
అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణా యంత్రాంగం ఇచ్చిన వరద నివేదిక ప్రకారం, జూన్ 16 నాటి వర్షం కారణంగా రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సుమారు 19 లక్షల మంది (1.9 మిలియన్లు) ప్రజలు ప్రభావితమయ్యారు. ఆ రాత్రి వర్షానికి రాష్ట్రంలో ఎక్కువగా దెబ్బతిన్న మూడు జిల్లాలలో దాదాపు 3 లక్షల మంది ప్రజలు ప్రభావితమైన దరంగ్ జిల్లా కూడా ఒకటి. ననోయ్ నదీ జలాలు తన ఒడ్డును దాటి పొంగి ప్రవహిస్తున్నప్పుడు, రాష్ట్రంలోని మరో ఆరు నదులు - బెకీ, మానస్, పగ్లాదియా, పుఠిమరి, జియా-భరొలీ, బ్రహ్మపుత్ర - కూడా ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. ఆ తర్వాత వారం రోజుల పాటు వర్షాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూనే ఉన్నాయి..

























