డెబ్బైల ముది వయస్సును దాటుతున్న ఇతను స్ట్రాబెర్రీలను పండించే ఓ రైతు. పాత మహాబలేశ్వర్‌లోని తన మూడెకరాల పొలంలో తవ్వించిన బావి ఎండిపోయి రాళ్ళుతేలింది. ఎంతో కొంత నీరున్న బోరుబావితోనే, నానా తంటాలు పడుతూ, భార్యతో కలిసి వ్యవసాయాన్ని నెట్టుకొస్తున్నారు. అంత కొద్ది నీటిలో కూడా ఈయన తన పొలానికి పక్కనే ఉన్న గుడికి కొన్ని నీళ్ళను సరఫరా చెస్తారు, అది కూదా పూర్తి ఉచితంగా. ఈ పెను కరవు అతని పంటను ఎండగట్టగలిగిందే కాని, అతని ఔదార్యాన్ని కాదు. ఇతని పేరు యూనుస్ ఇస్మాయిల్ నాలబంద్. అమిత సంతోషంతో ఈయన నీళ్ళు వదిలేది కృష్ణామాయి దేవాలయానికి. ఈ దేవాలయం సాతారా జిల్లాలోని కృష్ణా నది మూలానికి సంబంధించిన అతి పురాతన చిహ్నం.
“అసలీ నీరేమైనా నా సొత్తేమిటయ్యా? అంతా ఆ ఊపర్‌వాలా (సర్వశక్తిమంతుడు)దే కదా?" అంటారతను. డెబ్బై ఏళ్ళు దాటిన అతని భార్య రోషన్ నాలబంద్ కూడా ఈ మాటకు ఔనన్నట్టు తలూపుతారు. స్ట్రాబెర్రీలను చిన్న పెట్టెల్లో సర్దుతూ, “వ్యాపారులొచ్చి వీటిని పట్టుకుపోతారు." అన్నారు రోషన్. "ఈ ఏడాది పంట కొరతవల్ల ధర పోయినేడాదికంటే ఎక్కువగానే ఉంది. కానీ తక్కువ దిగుబడి, పంట నాణ్యత తగ్గిపోవడం ఈ ధర పెరుగుదలని సమానం చేశాయి.” ఈ నీటి సంక్షోభం తమనెంతెలా పీడిస్తోందో, తాము చేస్తున్న పనిని ఆపకుండానే, వాళ్ళు మాకు చెబుతూపోయారు. ఒక్క రోషన్ మాత్రమే పని నుండి ఓ నిమిషం విరామం తీసుకుని మాకు మంచినీళ్ళూ, చిరుతిళ్ళూ తెచ్చిపెట్టారు.
కృష్ణామాయి కుండ్ (ఆలయ తటాకం) యూనుస్ నాలబంద్ బోరుబావి నుండి నీరు వచ్చినప్పుడు తప్ప, మిగతా సమయాలలో ఖాళీగా ఉంటుంది. ఈ సారి తటాకం మొత్తం నీళ్ళు లేక ఎండిపోయింది. ప్రసిద్ధ పంచగంగ ఆలయానికి కేవలం కొద్ది నిముషాల నడక దూరంలోనే కృష్ణామాయి ఉంది. ఈ పంచగంగ ఆలయాన్ని కృష్ణా నదితో పాటు కోయ్నా, వెణ్ణా, సావిత్రి, గాయత్రి అనే నాలుగు నదుల సంకేత మూలంగా కూడా పిలుస్తారు. నిజమైన నదీ మూలాలు కూడా ఇక్కడి నుండి మరీ అంత దూరంలో లేవు. వాయీ-మహాబలేశ్వర్ ప్రాంతంలోకల్లా కృష్ణామాయియే బహుశా అతి ప్రాచీన దేవాలయం. చిన్నదే అయినా అందమైన దేవాలయం. ఇక్కడి జనం కృష్ణామాయిని జలదేవతగా కొలుస్తారు.








