ఎస్. రామసామి తన పాత స్నేహితుడికి నన్ను పరిచయం చేశారు. వార్తాపత్రికలు, టీవీ ఛానెల్లు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో సహా మరెంతోమంది సందర్శకులు తన ప్రియమైన స్నేహితుడిని దర్శించారని ఆయన గొప్పగా చెబుతారు. అలా చెప్పేటపుడు ఎలాంటి వివరాలూ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనొక సెలబ్రిటీ గురించీ, ఒక ప్రముఖుడి గురించీ మాట్లాడుతున్నారు కదా మరి...
ఆయన స్నేహితుడు, 200 ఏళ్ళ వయసున్న ఆ మహా వృక్షమే మాళిగమ్పట్టుకు చెందిన గొప్ప ఆయిరమ్కాచ్చి...
ఆయిరమ్కాచ్చి ఒక పలామరమ్- పనస చెట్టు. ఇది చాలా పొడవుగానూ వెడల్పుగానూ ఉండే పండ్లచెట్టు. ఇది ఎంత వెడల్పుగా ఉంటుందంటే, దాని చుట్టూ తిరగడానికి 25 సెకన్ల సమయం పట్టింది. పురాతనమైన దాని కాండానికి దాదాపు వంద వరకూ పచ్చని, ముళ్ళుముళ్ళుగా ఉన్న పండ్లు వేలాడుతున్నాయి. అసలా చెట్టు ముందర నిల్చోవటమే ఒక గౌరవం. దాని చుట్టూ నడవడం ఒక ప్రత్యేక సౌకర్యం. నా స్పందన చూసి రామసామి నవ్వారు; సంతోషంతో, గర్వంతో విలాసంగా ఉన్న ఆయన మీసాలు ఆయన కళ్ళను తాకేంత పైకి లేచాయి. తన 72 ఏళ్ళ వయసంతా ఆ చెట్టును చూసి అబ్బురపడిపోయిన అతిథులను ఆయన చూస్తూనే ఉన్నారు. నాతో ఆయనింకా చాలా చెప్పారు...
"మేం కడలూరు జిల్లా పణ్రుటి బ్లాక్లో ఉండే మాళిగమ్పట్టు కుగ్రామంలో ఉంటాం,"ఖావి (కావిరంగు) ధోవతి కట్టుకొని, సన్నని భుజమ్మీద ఒక తువాలు వేసుకుని, చెట్టుముందు నిల్చొని ఉన్న ఆయన చెప్పడాన్ని కొనసాగించారు. "ఈ చెట్టుని ఐదు తరాలకిందట మా పూర్వీకులు నాటారు. మేం దీన్ని 'ఆయిరమ్కాచ్చి', అంటే వెయ్యి ఫలాలనిచ్చేది, అని పిలుస్తాం. ఇప్పుడైతే ఇది ఏడాదికి 200 నుంచి 300 పండ్లను మాత్రమే ఇస్తోంది. అవి 8-10 రోజుల వ్యవధిలో పండిపోతాయి. తొనలు చాలా రుచిగా, రంగు చాలా సుందరంగా ఉంటాయి. పండని కాయలతో బిరియానీ కూడా వండొచ్చు." ఇలా అరనిముషంలో దాని గుణగణాలన్నిటినీ పొగుడుతూ చెప్పారాయన. ఆయన చెట్టులాగే ఆయన ఉపన్యాసం కూడా దశాబ్దాల కాలంతో పాటు మెరుగుపడుతూ రూపుదిద్దుకున్నది.


















