వేలి గోరంతైనా ఉండని ప్రతి ఒక్క మొగ్గా లేతగా తెల్లగా అందంగా ఉంటుంది. అక్కడక్కడా పూర్తిగా విచ్చుకున్న పూలతో మెరుస్తోన్న తోటనుంచి మత్తెక్కించే పరిమళం ముక్కుపుటాలను నింపుతోంది. ధూళి కమ్మిన భూమి, దృఢమైన మొక్కలు, మేఘాలతో గాయపడిన ఆకాశం. మల్లెపూవు ఒక వరం.
కానీ ఇక్కడి కార్మికులకు దాని వ్యామోహం రేకెత్తించే ఆకర్షణను అనుభవించే సమయం లేదు. వారు మల్లి (మల్లెమొగ్గలు)ని అవి వికసించకముందే పూకడై (పూల మార్కెట్)కి తీసుకుపోవాలి. వినాయక చతుర్థికి, అంటే వినాయకుడి పుట్టినరోజు, ఇంకా నాలుగు రోజులే ఉంది. అంటే మీరు మంచి ధరలను ఆశించవచ్చు.
బొటనవేలునూ, మునివేళ్ళనూ మాత్రమే ఉపయోగించి పూలుకోసే ఆడా మగా గబగబా మొగ్గల్ని తుంచుతున్నారు. చేతినిండా కోసిన మొగ్గల్ని సంచుల్లా చేసిన తమ చీర కొంగులోనో ధోవతి అంచుల్లోనో వేసుకొని తర్వాత వాటిని గోతాల్లోకి నింపుతారు. ఆ పనికొక ఖచ్చితత్వం ఉంది: కొమ్మని వంచటం(ఆకుల రవ రవ), మొగ్గలు కోయటం (చక చక చకా), ఆ పక్కనే మూడేళ్ళ పసిబిడ్డలా నిలుచొనివున్న మరో మొక్క దగ్గరకు వెళ్ళటం, మరిన్ని మొగ్గలను కోయడం, ముచ్చట్లాడుకోవటం. తూర్పు ఆకాశంలో సూర్యుడు మెల్లమెల్లగా పైకి వస్తుండగా రేడియోలో ప్రజాదరణ పొందిన తమిళ పాటలు వింటూ...
త్వరలోనే ఆ మొగ్గలు మదురై నగరంలోని మాట్టుదావణి మార్కెట్కు, అక్కడి నుంచి తమిళనాడులోని ఇతర పట్టణాలకూ వెళ్తాయి. ఒక్కోసారి సముద్రాలమీదుగా వేరే దేశాలకు కూడా.
మదురై జిల్లాలోని తిరుమంగళం, ఉసిలంపట్టి తాలూకాలను PARI వరుసగా 2021, 2022, 2023లలో సందర్శించింది. మీనాక్షి అమ్మన్ కోవెల, సందడిగా ఉండే పూల బజారులకు పేరొందిన మదురై నగరానికి కేవలం ఒక గంట లోపు కారు ప్రయాణపు దూరంలోనే మల్లె తోటలుంటాయి. ఈ నగరంలో మల్లిని దోసిళ్ళతోనూ కుప్పలుగానూ అమ్ముతుంటారు.




























