"నిన్ను నమ్మి నా జీవితగాథ నీతో చెప్పవచ్చా?
ఇది ఒక సూటిగా గురిపెట్టి విసిరిన సవాలు. ఈ ప్రశ్న అడగడానికి తన వద్ద గట్టి కారణాలు కూడా ఉన్నాయి. తమిళనాడులోని విల్లిపురం జిల్లాలో పెద్దగా పేరు తెలియని పల్లెటూరు నుండి వచ్చిన జనని(పేరు మార్చబడింది), తన జీవితగాథను చెప్తుంది. “క్షయ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.”
ఆమెకు పెళ్లయి సంవత్సరంన్నర, ఒక నాలుగున్నర నెలల బాబుకూడా ఉన్నాడు. అప్పుడే ఆమెకు క్షయ సోకింది. “మే 2020 లో నాకు లక్షణాలు బయటపడ్డాయి. అంతకు ముందు నెలంతా విపరీతమైన దగ్గు, జ్వరం.” మామూలుగా చేసే అన్ని పరీక్షలు చేసి ఏమి తేలక, డాక్టర్ ఆమెని టిబి పరీక్ష చేయించుకోమన్నాడు. “నాకు క్షయ(టిబి)అని తెలియగానే నేను భోరున ఏడ్చాను. నాకు తెలిసిన వారెవరికీ ఇది రాలేదు. నాకు వస్తుందని నేను ఊహించలేదు.”
“మా ఊరిలో ఈ జబ్బు ని చాలా చెడ్డగా చూస్తారు. ఈ జబ్బు తో ఎవరిని కలవడం కుదరదు- ఈ జబ్బు నాకే రావడమంటే…!”
ఆ రోజు నుంచి ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండే జనని 27 ఏళ్ళ భర్త, ఊరికూరికే ఆమెను ఈ జబ్బు తెచ్చుకుందని , తనకి కూడా అంటిస్తుందని అనడం మొదలు పెట్టాడు. “అతను నన్ను మాటలతోను, దెబ్బలతోను హింసించేవాడు. అతని అమ్మ మా పెళ్ళైన ఒక ఏడాదికి చనిపోయింది. అంతకు ముందే ఆమెకు కిడ్నీ కి సంబంధించిన ఇబ్బందులేవో ఉండేవి. కానీ నా భర్త తన తల్లి నావల్లే చనిపోయిందని అనడం మొదలు పెట్టాడు.”
అసలు ఈ వ్యాధి వలన ఎవరికైనా ప్రమాదం ఉందంటే అది మొదట జననికే ఉంది.
క్షయ ఇప్పటికీ భారతదేశంలో మనుషులు చనిపోయేంత పెద్ద అంటువ్యాధి.










