ర్యాపిడ్ మలేరియా టెస్ట్ కిట్ కోసం ఆమె తన సంచి అంతా వెదుకుతున్నది. ఆ సంచిల మందులు, సెలైన్ బాటిళ్లు, ఐరన్ సప్లిమెంట్లు, ఇంజక్షన్లు, బీపీని కొలిచే యంత్రం లాంటివన్నీ ఉన్నాయి. రెండు రోజులుగా ఈమె కోసం ప్రత్నిస్తున్న ఒక కుటుంబం లోని ఒక మహిళ మంచం మీద నిస్సత్తువగా పడి ఉన్నది. ఆమె శరీర ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఆమెకు మలేరియా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తది.
ఆమె మల్లోక మల్క తన సంచిలకి చెయ్యిపెట్టింది, ఈ తాప ఇంట్రావీనస్ (IV) ద్రావణం - 500 ml డెక్స్ట్రోస్ సెలైన్ బాటిల్ కోసం వెదికింది. ఆ మహిళ మంచం దగ్గరికి వెళ్లి, ఆమె పైకప్పు మీదుగా వేలాడుతున్న దూలం చుట్టూ ప్లాస్టిక్ తాడును చుట్టుకుంటా సెలైన్ బాటిల్‌ను ఆకట్టుకునే వేగంతో దానికి కట్టింది.
35 ఏండ్ల జ్యోతి ప్రభ కిస్పొట్టా, గత 10 సంవత్సరాలుగా జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని గ్రామాలల్ల వైద్య సేవలను అందిస్తున్నది. అయితే ఆమె అర్హత కలిగిన డాక్టరమ్మనో లేదా శిక్షణ పొందిన నర్సో కాదు. ఆమెకు ఏ ప్రభుత్వ దవాఖాన లేదా ఆరోగ్య సంరక్షణ కేంద్రంతో సంబంధం లేదు. కానీ ఓరాన్ తెగకు చెందిన ఈ యువతి పశ్చిమ సింఘ్‌భూమ్‌లోని ఆదివాసీలు ఎక్కువగా ఉండే గ్రామాల ప్రజలకు మొదటి దిక్కు, చాలా సార్లు ఆమె వారి చివరి ఆశ కూడా.
గ్రామీణ భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ చేపడుతున్నది దాదాపు 70 శాతానికి పైగా ఈ RMP లే అని ప్రాంతీయ సర్వేలు సూచిస్తున్నయి. అలాంటి అనేక మంది 'RMP'లలో ఆమె ఒకరు. ఇక్కడ RMP అనేది ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు, అయితే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అని అనివార్యంగా పిలవాల్సిన సంక్షిప్త రూపంగా అనిపిస్తది. అయితే వీరిని జోలా చాప్ (క్వాక్) అని వైద్యులు ఎగతాళిగా పిలుస్తరు. గ్రామీణ భారతదేశంలో సమాంతరంగా ప్రైవేట్ హెల్త్‌కేర్ సర్వీస్‌ను నడుపుతున్న ఈ అర్హత లేని వైద్య అభ్యాసకులు అకడమిక్ లిటరేచర్‌లో 'క్వాక్స్'గా అవహేళన చేయబడుతరు. అంతేగాక, వీరు చేసే ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ విధానాలలో కూడా ఎక్కువ సందిగ్ధతతో చూస్తరు.
RMPలు తరచుగా భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన వైద్య మండలిలో నమోదు చేసుకోరు. అయితే వాళ్ళల్లో కొందరు హోమియోపతి లేదా యునాని వైద్యులుగా నమోదు చేసుకొని ఉంటారు, కానీ తమ వైద్యంలో అల్లోపతి మందులను వాడుతారు, లేదా రోగులకు అవే మందులను పంపిణీ చేస్తరు.
జ్యోతికి అల్లోపతి మెడిసిన్‌లో RMP సర్టిఫికేట్ ఉన్నది. దీనిని ఆమె, బీహార్ ప్రభుత్వంచే రిజిస్టర్ చేయబడింది అని చెప్తున్న 'కౌన్సిల్ ఆఫ్ అన్ ఎంప్లాయ్డ్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్' అనే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో ఆరు నెలల కోర్సు పూర్తి చేసింది. అందుకు ఆమె 10,000 రూపాయల కట్టినది. ఆ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు అయితే నడుస్త లేదు.

















