"దయచేసి వాటికి మరీ దగ్గరగా వెళ్ళకండి. అవి బెదిరిపోయి పరుగెట్టిపోగలవు. అప్పుడు వాటిని ఆపటమే కాక, ఇంత విస్తారమైన ప్రాంతంలో వాటి జాడ కనుక్కోవడం కూడా నాకు చాలా కష్టమవుతుంది," అన్నారు జెఠాభాయ్ రబారీ.
'వాటిని', 'అవి' అని ఆ సంచార పశుపోషకుడు మాట్లాడుతున్నది అతి విలువైన తన ఒంటెల గురించి. అవి అక్కడంతా ఈతకొడుతూ ఆహారం కోసం వెతుక్కుంటున్నాయి.
ఒంటెలు? ఈత కొడుతున్నాయా? నిజంగానే?
అవును నిజమే. 'విస్తారమైన ప్రాంతం' అని జెఠాభాయ్ చెప్తున్నది కచ్ అఖాతానికి దక్షిణ తీరం పొడవునా విస్తరించి ఉన్న మరైన్ నేషనల్ పార్క్ మరియు అభయారణ్యం (ఎమ్ఎన్పి & ఎస్) గురించి. ఇక్కడ సంచార సముదాయాలకు చెందిన పశుపోషకుల బృందాలు పెంచుకునే ఒంటెల మందలు వాటి ఆహారమైన మడ చెట్ల (అవిసెనియా మరైనా) కోసం వెతుకుతూ ఒక ద్వీపం నుండి మరో ద్వీపానికి ఈదుతుంటాయి.
"ఈ జాతి ఒంటెలు దీర్ఘకాలం పాటు మడ చెట్లను తినకపోతే జబ్బుపడతాయి, బలహీనపడి చివరికి చనిపోతాయి కూడా" అంటారు కరు మేరు జాట్. "అందుకని మా ఒంటెల మందలు మడ చెట్ల కోసం వెతుక్కుంటూ మరైన్ పార్క్ అంతటా తిరుగుతుంటాయి."

























