“ఒక ఏడాదిలోనే మేం చిరుతపులుల వల్ల చాలా జంతువులను కోల్పోతాం. అవి రాత్రిపూట వచ్చి వాటిని లాక్కుపోతాయి,” అని గొర్రెల కాపరి గౌర్ సింగ్ ఠాకూర్ చెప్పారు. స్థానిక రకానికి చెందిన భోటియా జాతి కుక్క షేరూ కూడా వాటిని దూరంగా తరిమేయలేదని అతను చెప్పారు.
హిమాలయాల్లోని గంగోత్రి శ్రేణిలో ఉన్న ఒక పర్వతం పైభాగాన ఆయన మాతో మాట్లాడుతున్నారు. అతను మేపుతున్న జంతువులు ఉత్తరకాశీ జిల్లాలోని సౌరా గ్రామంలోనూ, దాని చుట్టుపక్కల గ్రామాలలోనూ నివసించే ఏడు కుటుంబాలకు చెందినవి. గౌర్ సింగ్ కూడా అక్కడికి 2,000 మీటర్ల దిగువన ఉండే అదే గ్రామానికి చెందినవారు. అతను ఏడాదికి తొమ్మిది నెలలపాటు ఈ జంతువులను చూసుకునేటట్టుగా ఒప్పందం చేసుకుని ఉన్నారు. వర్షం వచ్చినా, మంచు పడినా సరే, అతను వాటిని మేపుకు తీసుకువెళ్ళి, తిరిగి వచ్చాక వాటిని మందవేసి, వాటి సంఖ్య్యను లెక్కిస్తూ ఉండాల్సిందే.
"ఇక్కడ దాదాపు 400 గొర్రెలు, 100 మేకలు ఉన్నాయి" అని మరో గొర్రెల కాపరి, హర్దేవ్ సింగ్ ఠాకూర్ (48), పర్వతం మీద చెల్లాచెదురుగా ఉన్న మందను చూస్తూ చెప్పారు. "ఇంకొన్ని ఎక్కువ కూడా ఉండవచ్చు," ఖచ్చితంగా ఎన్నున్నాయో సరిగ్గా లెక్క తెలియని ఆయన కాస్త సందేహంగా జోడించారు. హరదేవ్ గత 15 ఏళ్లుగా ఈ పని చేస్తున్నారు. "కొంతమంది గొర్రెల కాపరులు, సహాయకులు రెండేసి వారాల పాటు వచ్చి మళ్ళీ తిరిగి వెళుతుంటారు. నాలాంటి కొందరు మాత్రం ఇక్కడే ఉంటారు." అని అతను వివరించారు.
ఇది అక్టోబర్ నెల. ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ హిమాలయాలలో, గంగోత్రి శ్రేణిలోని 'చులీ టాప్'లో ఉన్న విశాలమైన పచ్చటి గడ్డి మైదానాలను ముద్దాడుతూ, ఎముకలు కొరికే బలమైన చల్లని గాలి వీస్తోంది. మగవాళ్ళు ఒంటికి ఒక దుప్పటిని చుట్టుకుని, ఒకదాన్నొకటి నెట్టుకుంటూ మేస్తున్న గొర్రెల మందలో తిరుగుతున్నారు. ఇది మంచి పచ్చికభూమి అని గొర్రెల కాపరులు చెబుతారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచు చరియ నుండి పుట్టుకొచ్చిన ఒక సన్నని నీటి ప్రవాహం జంతువులకు నీటికి కొరతలేకుండా భరోసానిస్తుంది. ఈ ప్రవాహం రాతి పగుళ్ల గుండా మెలికలు తిరుగుతూ ప్రవహించి, 2,000 మీటర్లకు పైగా దిగువన ప్రవహిస్తున్న భాగీరథి నదికి ఉపనది అయిన భిలంగనా నదిలో కలిసిపోతుంది.









