అర్ధ శతాబ్దం క్రితం, తన వలన ఉనికిలోకి వచ్చిన కొల్హాపూర్‌లోని ఈ కాంపాక్ట్ డ్యామ్ పైన ఉన్న ఒక చిన్న వంతెన పై, మాడిపోయే వేడిలో సైతం అతను ప్రశాంతంగా కూర్చున్నాడు. భోజనం సమయంలో మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ ఓపికతో సమాధానాలిస్తూ ఉన్నాడు. 1959లో ఈ బ్యారేజీ ఎలా ప్రాణం పోసుకున్నదో వివరిస్తూ అతను కూడా మాతో పాటు వంతెన పొడుగునా చలాకీగా నడిచాడు .
ఇప్పటికీ, అంటే ఆరు దశాబ్దాల తరవాత కూడా, గణపతి ఈశ్వర పాటిల్‌కు నీటిపారుదలపై పట్టు ఉంది. అతను రైతులను, వ్యవసాయాన్ని అర్థం చేసుకున్నాడు. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర అతనికి తెలుసు - ఆయన అందులో భాగం కూడా. ఆయన వయసు 101 సంవత్సరాలు - భారతదేశపు జీవించి ఉన్న చివరి స్వాతంత్య్ర సమరయోధులలో ఒకడు.
"నేను కేవలం ఒక దూతని," అని 1930ల తరవాత అతని జీవితం గురించి వినయం, వినమ్రతతో ఆయన చెప్పాడు. "భూగర్భ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలకు నేను ఒక కొరియర్ ను." అందులో కమ్యూనిస్ట్ విప్లవ సంఘాల, సోషలిస్టుల - కాంగ్రెస్ పార్టీ (1942 లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో)ల నిషేధిత నెట్‌వర్క్‌లు ఉన్నాయి. అతని పనితనం మంచిదై ఉండి ఉండాలి- ఎందుకంటే అతను ఎప్పుడూ పట్టుబడలేదు. "నేను జైలుకు వెళ్లలేదు," అని అతను దాదాపు తప్పుచేసినట్లు చెప్పాడు. 1972 తర్వాత స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన తామ్రపత్ర (లిఖిత శాసనం) లేదా పెన్షన్ కూడా అతను అంగీకరించలేదని వేరేవారి ద్వారానే మాకు తెలిసింది.







