కింద పడివున్న కొమ్మను నేలకేసి కొట్టి, తాను తోటలోకి ప్రవేశించినట్లుగా ప్రకటిస్తారు తంగమ్మ ఎ.కె. "నేనీ దట్టంగా చెట్లు పెరిగిపోయిన ఖాళీస్థలాల్లోకి చాలా జాగ్రత్తగా ప్రవేశిస్తాను. కర్రను నేలకేసి కొట్టి శబ్దం చేయగానే అక్కడేమైనా పాములుంటే అవి దూరంగా తొలగిపోతాయి," అంటారామె. ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్ల కింద దట్టంగా పెరిగివున్న తీగలు, విరిగిన కొమ్మలు, అడవి గడ్డిలోంచి, ఎటువంటి జీవుల దారిలోకి చొరబడకుండా జాగ్రత్తపడుతూ దారి చేసుకుంటారు తంగమ్మ.
ఎర్నాకుళంలో ఉన్న ఒక హౌసింగ్ కాలనీలోని ఖాళీ ఇంటిస్థలంలో ఉంది ఈ నిర్జన ప్రదేశం. "దారిన పోతుంటే (మంచి) కొబ్బరికాయలు దొరకడమంటే అదృష్టం వచ్చిపడ్డట్టే!" అని ఈ 62 ఏళ్ళ వృద్ధురాలు చెప్పారు. ఇలా ఎవరికీ చెందని స్థలాలలో రాలిపడిన కొబ్బరికాయలను సేకరించి, ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి వాటిని అమ్ముతుంటారామె. కొబ్బరి అనేక మలయాళీ వంటకాలలో ఉపయోగించే ప్రధాన పదార్థం. అందువలన కొబ్బరికాయలకు ఏడాది పొడవునా ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది.
"ఇంతకుముందు నేను పని ముగించుకుని వెళ్తూ ఈ సమీప పరిసరాల నుండే (పుదియ రోడ్ జంక్షన్) కొబ్బరికాయలు సేకరించేదాన్ని, కానీ ఇప్పుడు నా జబ్బులు నన్ను పనికి వెళ్ళనివ్వడం లేదు," ఎత్తుగా పెరిగివున్న గడ్డి గుండా నెమ్మదిగా దారిచేసుకుని వెళుతూ చెప్పారు తంగమ్మ. ఆమె ఊపిరి తీసుకోవడానికో, లేదా మధ్యాహ్న సూర్యుని ఎండ నుండి తన కళ్లను కాపాడుకుంటూ, కొబ్బరి కాయల కోసం పైకి చూసేందుకో మధ్య మధ్య ఆగుతూ నడుస్తున్నారు.
ఐదు సంవత్సరాల క్రితం నుంచి తంగమ్మ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట, ఇతర థైరాయిడ్ సంబంధిత సమస్యలతో బాధపడటం ప్రారంభించారు. దీంతో ఆమె ఇంటి పనులు చేసే తన పూర్తికాల ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈ పని ద్వారా ఆమె నెలకు రూ. 6,000 సంపాదించేవారు. డబ్బు అవసరమున్న తంగమ్మకు పనిలేకుండా ఇంట్లో ఉండడమన్నది కష్టమే. దాంతో ఆమె ఇరుగుపొరుగున ఉన్న ఇళ్ళలో దుమ్ములు దులపడం, ఆవరణలను శుభ్రం చేయడం వంటి తక్కువ శారీరక శ్రమతో కూడిన పనులకు మారారు. ఒకసారి కోవిడ్-19 దెబ్బతీసిన తర్వాత, ఇక ఆ పని చేయడం కూడా ఆగిపోయింది.














