1968 డిసెంబర్ చివరి వారంలో, వెన్మణి గ్రామంలోని కీళ్వెణ్మని కుగ్రామంలో భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా సాగుతున్న వ్యవస్థీకృత పోరాటం రాజుకుంది. తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఈ గ్రామానికి చెందిన భూమిలేని దళిత కూలీలు అధిక వేతనాలు, వ్యవసాయ భూములపై నియంత్రణ, మరియు భూస్వామ్య అణచివేతకు ముగింపు పలకాలని సమ్మె చేశారు. దీనికి భూస్వాముల స్పందన ఏంటి? వారు కుగ్రామంలో 44 మంది దళిత కార్మికులను సజీవ దహనం చేశారు. శక్తివంతమైన ధనిక భూస్వాములు, దళితులలో రేకెత్తుతున్న ఈ నూతన రాజకీయ చైతన్యం తో చెలరేగిపోయి, పక్క ఊర్ల నుండి కూలీలను పనికి పెట్టుకోవడమే కాక, ఒక భారీ ప్రతీకార ప్రణాళిక పన్నారు.
డిసెంబర్ 25 రాత్రి, భూస్వాములు కుగ్రామాన్ని చుట్టుముట్టి దాడి చేసి, దళితులు తప్పించుకుపోగల అన్ని మార్గాలను మూసివేశారు. గుడిసెలోకి దూసుకెళ్లిన 44 మంది కూలీల బృందాన్ని లోపల బంధించి నిప్పు అంటించారు. హత్యకు గురైన వారిలో సగం మంది - 11 మంది బాలికలు మరియు 11 మంది బాలురు - 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు. ఇద్దరు 70 ఏళ్లు పైబడిన వారు. మొత్తం మీద 29 మంది స్త్రీలు, 15 మంది పురుషులు ఉన్నారు. అందరూ దళితులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) మద్దతుదారులు.
1975 లో మద్రాస్ హైకోర్టు, ఈ హత్య కేసులో 25 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ ఈ నరమేధను గొప్ప చరిత్రకారులలో ఒకరైన మైథిలి శివరామన్, వెలుగులోకి తీసుకురావడమే కాక, దాని వర్గ, కుల అణచివేత సమస్యలను గురించి కూడా శక్తివంతమైన, విస్తృతమైన విశ్లేషణలను రాయడం కొనసాగించారు. 81 ఏళ్ళ వయసులో, ఒక వారం క్రితమే కోవిడ్ -19 కి ప్రాణాలు కోల్పోయిన మైథిలి శివరామన్ జ్ఞాపకంగా, కీళ్వెణ్మని విషాదం గురించి ఆమె రాసిన ఈ కవితను ప్రచురిస్తున్నాము.



