"అందరూ చేస్తున్నారు. కాబట్టి మేం కూడా చేస్తున్నాం” కాస్త అనిశ్చితంగా అంది రూపా పిరికాక.
'ఇది' జన్యుపరంగా మార్పు చేయబడిన (GM) బీటీ పత్తి విత్తనాలు, ఇప్పుడు స్థానిక మార్కెట్లో లేదా ఒకరి స్వంత గ్రామంలో కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు. 'అందరు' అంటే ఒడిశాలో నైరుతి వైపు ఉన్న రాయగడ జిల్లాలోని తన ఊరు ఇంకా మిగతా ఊర్లలో ఆమె లాంటి లెక్కలేనంత మంది రైతులు.
'వారికి డబ్బులు అందుతున్నాయి', అని ఆమె అంటుంది.
పిరికాక 40 ఏళ్ల కోండ్ ఆదివాసీ రైతు. రెండు దశాబ్దాలకు పైగా ప్రతి సంవత్సరం ఆమె డోంగర్ చాస్, అంటే కొండ వ్యవసాయం(మారు సాగు) కోసం ఒక కొండ వాలును సిద్ధం చేస్తుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు సానబెట్టిన సంప్రదాయాలను అనుసరిస్తూ, పిరికాకా నిరుడు కుటుంబ పంటల నుండి తను భద్రపరిచిన విత్తనాలతో వేర్వేరు భూముల్లో విత్తుతుంది. ఇవి రకరకాల ఆహార పంటల దిగుబడిని ఇస్తాయి: మాండియా, కంగు వంటి చిరుధాన్యాలు, ఎర్ర పప్పు, నల్లరేగడి వంటి పప్పులు, అలాగే పొడవాటి చిక్కుళ్ళు, నైజర్ గింజలు, నువ్వులు వంటివి.
ఈ సంవత్సరం జులైలో పిరికాక మొదటిసారి బీటీ పత్తికి మారింది. బిషామకటక్ బ్లాక్‌లోని ఆమె ఊరు వద్ద కొండ వాలుపై ముదురు గులాబీ, రసాయనాలు కలిపిన విత్తనాలను నాటుతున్న ఆ సమయంలో మేము ఆమెను కలిసాము. ఆదివాసీల సాగు పద్ధతుల్లోకి పత్తి ప్రవేశించడం ఆశ్చర్యంగా ఉంది, ఈ మార్పు గురించి మేము ఆమెను దాని గురించి అడిగేలా చేసింది.
"పసుపు లాంటి వేరే పంటలు కూడా డబ్బు ఇస్తాయి" అని పిరికాకా ఒప్పుకుంటుంది. "కానీ ఎవరూ అలా చెయ్యట్లేదు. అందరూ మాండియా [చిరుధాన్యాలు] వదిలి పత్తి కావాలనుకుంటున్నారు".
రాయగడ జిల్లాలో పత్తి విస్తీర్ణం కేవలం పదహారేళ్ళలో 5,200 శాతానికి పైగా పెరిగింది. అధికారిక డేటా ప్రకారం 2002-03లో కేవలం 1,631 ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. 2018-19లో అది 86,907 ఎకరాలయ్యింది అని జిల్లా వ్యవసాయ కార్యాలయం తెలిపింది.
దాదాపు 1 మిలియన్ మంది జనాభా ఉన్న రాయగఢ, కోరాపుట్ ప్రాంతంలో ఒక భాగం. కోరాపుట్ ప్రపంచంలోని గొప్ప జీవవైవిధ్య హాట్స్పాట్లలో ఒకటి, అంతేగాక వరి వైవిధ్యానికి చారిత్రక ప్రాంతం. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క 1959 సర్వే ప్రకారం ఈ ప్రాంతంలో అప్పటికీ 1,700 వరి రకాలు ఉన్నాయి. ఇప్పుడు సుమారు 200కి పడిపోయాయి. కొంతమంది పరిశోధకులు ఈ ప్రాంతం వరిసాగుకి పుట్టినిల్లు అని నమ్ముతారు.








