మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలోని నింబవలి అనే మా గ్రామంలోని ఒక చెట్టు కింద కొంతమంది మధ్యవయస్కుల బృందం కూర్చొని వుంది. ఈనాటికీ తమ ప్రభావాన్ని చూపిస్తోన్న, దాదాపు 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల గురించి వారు చర్చించుకుంటున్నారు. కాగితాలు, కొలిచే పరికరాలు, టేపులు పట్టుకొని ఒక ప్రభుత్వ అధికారుల బృందం పెద్ద కారులో వచ్చి ఆగింది. వారు భూగర్భ జలాలకోసం తవ్వేందుకు స్థలాల కోసం వెతికారు, అని మా బాబా (నాన్న), 55 ఏళ్ళ పరశురామ్ పరేడ్, గుర్తుచేసుకున్నారు.
"నాకు వాళ్ళు బాగా గుర్తున్నారు. ఏం చేస్తున్నారు అని మేం పదే పదే అడిగితే, ‘మీకు నీళ్లు కావాలి కదా?’ అని వాళ్ళడిగారు. మాకు కావాలని చెప్పాం. పానీ కిసే నహీ మాంగ్తా [నీళ్ళెవరికి అవసరముండదు?]" అని బాబా గుర్తు చేసుకున్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో, ప్రభుత్వం గుర్తించగలిగే ఏ నీటి వనరైనా స్వాగతించదగినదే. కానీ గ్రామస్తులు ఊహించిన ఆనందం త్వరలోనే ఆవిరైపోయింది.
కొన్ని నెలల తర్వాత, వాడా తాలూకాలోని నింబవలికి చెందిన వర్లీలకు తొలగింపు నోటీసులు అధికారికంగా అందాయి. అక్కడ ఎటువంటి నీటి ప్రాజెక్టూ లేదు సరికదా, ముంబై-వడోదర నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే కోసం గ్రామం లోని భూమి కేటాయించబడింది.
"మాకు హైవే గురించి అప్పుడే తెలిసింది," అని 50 ఏళ్ళ బాలకృష్ణ లిపట్ అన్నారు. ఇదంతా జరిగింది 2012లో. ఒక దశాబ్దం గడిచిపోయినా, మా గ్రామం ఆ మోసపూరిత భూసేకరణతో ఒక అంగీకారానికి రావడానికి ఇంకా కష్టపడుతూనేవుంది. ఇది రాజ్య శక్తికి వ్యతిరేకంగా చేసే యుద్ధమనీ, ఓడిపోయే యుద్ధం కూడా అనీ చాలామందికి తెలుసు. అందుకే మొదట్లో అధిక పరిహారం కోసం, ప్రత్యామ్నాయ భూమి కోసం పోరాడినవారు, ఇప్పుడు మొత్తం గ్రామానికి సరైన పునరావాసం మాత్రమే కోరుతూ తమ డిమాండ్లను పరిమితం చేసుకున్నారు.





