తన గ్రామంలో వీధులన్నీ చకచకా చుట్టేస్తూ ప్రజలనందరినీ తనకే మద్దత్తునీయండని చిరునవ్వుతో అభ్యర్దిస్తోంది వైశాలి. చేతులు రెండూ జోడించి “నేను మీ కూతుర్ని” అంటూ స్థానిక యాసలో వోటు కోసం అర్థిస్తోంది.
తనకు లభిస్తున్న ఆదరణతో వైశాలి సంతృప్తిగానే ఉంది. అయితే ‘మీ యాదిలో నన్నుంచుకోండి. నాకోసం ప్రార్థించండి ’ అని ఆమె చేస్తున్న అభ్యర్ధనలో రైతు కుటుంబాలలోని తనలాంటి వితంతువులను, \ రైతులైన భర్తల ఆకస్మిక మరణం తరువాత వారు పడ్డ కష్టాలనూ, కన్నీళ్ళనూ మరచిపోవద్దనే సందేశం ఉంది.
ఈ ఎన్నికల ప్రచారంలో ఇరవై ఎనిమిదేళ్ళ వైశాలి అప్పుడప్పుడూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటోంది. యువతులతో చేయి చాపి కరచాలనాలు చేస్తోంది. బోరుబావుల నుంచి నీళ్ళు మోసుకు తెచ్చుకుంటున్న స్త్రీలను చూసి చేతులూపుతూ అభివాదాలు తెలియచేస్తోంది. అనంతరం ఓ ఆరేడు కార్ల వాహన శ్రేణిలో తన కోసం వేచి చూస్తున్న కారెక్కి 42 సెల్సియస్ డిగ్రీల మండుటెండను కూడా లెక్కచేయకుండా మరో ఊరుకి ప్రచారం కోసం వెళ్ళిపోతోంది.
వైశాలి మహారాష్ట్రలో తూర్పు ప్రాంతంలో ఉన్న యవత్మల్-వాషిం లోక్ సభ నియోజక వర్గం నుంచి ఈ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఏప్రిల్ 11 న జరిగే ఎన్నికల్లో దరిదాపు 17.5 లక్షల మంది వోటర్లు తమ వోటు హక్కును ఇక్కడ వినియోగించుకుంటారు. వైశాలి ‘ప్రహార్ జనశక్తి పక్ష’ తరపున పోటీలో ఉంది. అమరావతి జిల్లాలో స్వతంత్ర అభ్యర్ధి ‘ఓంప్రకాష్ (బచ్చు) కాడు’ అనే మధ్యవయస్కుని నాయకత్వంలో నడుస్తున్న స్థానిక పార్టీ అది. అతడి పార్టీ విదర్భలో మెలమెల్లగా ప్రజల ఆదరణను చూరగొంటోంది. రైతుల, కూలీల సమస్యల మీద కేంద్రీకరిస్తూ అది తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది.


