మహారాష్ట్ర, గోండియా జిల్లా స్త్రీ కార్మికుల గౌరవార్థం ఈ కధనాన్ని అంతర్జాతీయ కార్మిక దినం , మే 1న మళ్ళీ ప్రచురిస్తున్నాం. ఈ కథనం మొదట ది హిందూ పత్రికలో జనవరి 27, 2007 న ప్రచురితమయింది. అప్పటికీ ఇప్పటికీ ఈ స్త్రీ కార్మికుల జీవితాల్లో ఏమార్పూ లేదు.
రేవంతబాయి కాంబళే తన ఆరేళ్ళ కొడుకుతో మాట్లాడి కొన్ని నెలలయింది- ఇద్దరూ తిరోరాలో ఒకే ఇంట్లో వుంటున్నాగానీ! బురీబాయి నాగపూరే సంగతి కూడా అంతే. కనీసం అప్పుడప్పుడూ వాళ్ళ పెద్దబ్బాయి ముఖమైనా ఆమెకు కనిపిస్తుంది- అదీ ఆవిడ ఇంటికి వెళ్లేసరికి అతను మేల్కొని ఉంటే! రోజుకి 30 రూపాయల కూలీ కోసం వారానికి 1000 మైళ్ళకు పైగా ప్రయాణిస్తూ, రోజులో నాలుగంటే నాలుగే గంటలు ఇంట్లో వుండే ఆ ప్రాంతపు వందలాది మహిళల్లో వీళ్ళు కూడా ఒకరు.
ఈ మహిళలతో పాటు వాళ్ళ ఇళ్ళదగ్గర నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ చేరుకునేసరికి మాకు ఉదయం 6 గంటలయింది. వారిలో ఎక్కువమంది అంతకు రెండుగంటల ముందే నిద్ర లేచారు. "నేను వంట చేసేశాను. బట్టలుతకడం, ఇల్లు తుడవడం కూడా అయిపొయింది." ఉత్సాహంగా అన్నారు బురీబాయి. "పనంతా అయిపొయింది. ఇక మనం మాట్లాడుకోవచ్చు". మేం ఆవిడ ఇంటికి వెళ్ళిన సమయానికి ఆ ఇంట్లో అప్పటికింకా ఎవ్వరూ నిద్ర లేవలేదు. "పాపం వాళ్ళు అలసిపోయారు," అన్నారావిడ. మరి బురీబాయి అలసిపోలేదా? "నిజమే! కానీ ఏంచేస్తాం? మరోదారి లేదు".
ఇలా వేరే మార్గం లేని మహిళలు ఆ స్టేషన్ దగ్గర చాలామందే వున్నారు. వాళ్లందరిలోనూ వున్న ఒక అసాధారణ విషయం: వాళ్ళు పనికోసం పల్లెల నుంచి పట్నాలకు వలసవచ్చినవాళ్ళు కాదు; పట్నం నుంచి పల్లెలకు పని కోసం వెతుకుతూ తిరిగే కార్మికులు (footloose workers). ఈ వెతుకులాట వాళ్ళని తిరోడా లాంటి చిన్న తాలూకా ముఖ్య పట్టణాల నుంచి వ్యవసాయ కూలీలుగా కష్టపడడానికి ప్రతిరోజూ గ్రామాలకు తీసుకువెళుతోంది- ఇంటికి దూరంగా రోజులో దాదాపు 20 గంటల పాటు. "బీడీ పరిశ్రమ వెళ్ళిపోయాక," తిరోడాలో వారాంతపు సెలవులు లేవు, అసలు పనే లేదని గోండియాలో కిసాన్ సభ జిల్లా కార్యదర్శి మహేంద్ర వాల్దె అంటారు. "ఇక్కడ వాళ్లకు పని దొరకడం అసాధ్యం" అంటారాయన.








