ఆమె మాట్లాడటం మొదలుపెడుతుంది, కానీ మధ్యలోనే ఆగిపోతుంది. గాఢంగా ఊపిరి తీసుకుని, మళ్లీ ప్రయత్నిస్తుంది. కానీ ఆమె గొంతు కంపిస్తుంది. క్రిందికి చూస్తుంది, ఆమె చుబుకం వణుకుతుంది. అనితా సింగ్ దాదాపు ఏడాది కాలంగా ధైర్యసాహసాలతో ముందుకు సాగుతున్నట్టే కనిపిస్తుంటారు. కానీ భర్త జ్ఞాపకాలు ఆమెని ముంచెత్తుతుంటాయి. "మాది సంతోషకరమైన చిన్న కుటుంబం," అంటారు 33 ఏళ్ళ అనిత. "నా భర్తే మాకు దిక్సూచి."
అనిత భర్త, 42 ఏళ్ల జైకర్ణ్ సింగ్, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని లఖావటీ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. 2021 ఏప్రిల్ మొదటి వారంలో ఆయనకు కోవిడ్-19 లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి. మేము నగరంలోని తన ఇంటిలో కలిసినప్పుడు అనిత ఇలా చెప్పారు: "ఆయనకు దగ్గు, జలుబు, జ్వరం వచ్చాయి. కోవిడ్ రెండవ దశ ఉధృతంగా ఉన్నప్పుడు కూడా ఉపాధ్యాయులను పాఠశాలకు వెళ్ళమని ప్రభుత్వం చెప్పింది. అలా వెళ్ళిన ఏదో ఒకరోజున ఆయనకు ఇన్ఫెక్షన్ సోకి ఉండాలి."
ఏప్రిల్ 20, 2021న జైకర్ణ్కి కరోనా పాజిటివ్ అని తేలింది. అతను ఊపిరి అందక సతమతమవుతున్నప్పుడు, నగరంలో ఉన్న ఏ హాస్పిటల్లోనూ ఆక్సిజన్ బెడ్ అందుబాటులో లేదు. "నేను ఎన్నో ఆసుపత్రులను బతిమాలాను, కానీ వారు లేవని చెప్పారు. ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తున్నందున మేము చాలా ఫోన్ కాల్స్ చేసాము. కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఆయనకు ఇంట్లోనే చికిత్స చేయవలసి వచ్చింది." అని అనిత గుర్తుచేసుకున్నారు.
జ్వరం, దగ్గుతో బాధపడుతున్న జైకర్ణ్కు స్థానిక వైద్యుడు ఒకరు చికిత్స అందించారు. అనిత బంధువులు ఎలాగోలా ఒక ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేయగలిగారు. "దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా మాకు తెలియదు. మాకు మేమే ఎలాగో నేర్చుకోవాల్సివచ్చింది. కానీ మేము హాస్పిటల్ బెడ్ కోసం వెతుకుతూనే ఉన్నాము.” అని ఆమె చెప్పారు.
ఈ మహమ్మారి భారతదేశపు నాసిరకం ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను - ముఖ్యంగా గ్రామాలలో, చిన్న పట్టణాలలో - ఎంతగానో బహిర్గతం చేసింది. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం జిడిపి (2015-16లో)లో 1.02 శాతం మాత్రమే ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆధారపడేందుకు ప్రజలకు అక్కడ ఎక్కువేమీ లేదు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2017 ప్రకారం, దేశంలో 10,189 మంది ప్రజలకు ఒక్క ప్రభుత్వ అల్లోపతి డాక్టర్ ఉన్నారు; ప్రతి 90,343 మందికి ఒక ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే ఉంది.







