ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.
‘సమయం ఉదయం 11.40 దాటుతోంది. కాబట్టి ఇక ఇప్పుడు రాబోయే గాలివేగపు తాజాసమాచారం’ అని కడల్ ఒసై రేడియో స్టేషన్ నుంచి ప్రకటించాడు ఎ. యశ్వంత్. ‘‘గత వారంగా, ఇంకా చెప్పాలంటే, గత నెలగా కంచన్ కాతు(దక్షిణపు గాలి) ఉద్ధృతంగా వీస్తోంది. గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగం ఉండింది. ఈ రోజే మత్స్యకారుల కోసమే అన్నట్లుగా కాస్త నెమ్మదించి, పదిహేను కిలోమీటర్లకు తగ్గింది’’
రామనాథపురం జిల్లాలోని పంబన్ దీవికి చెందిన మత్స్యకారులకు ఇది గొప్ప శుభవార్త. ‘‘అంటే ఏ భయమూ లేకుండా సముద్రం మీదకి వెళ్లొచ్చు’’ అని వివరించాడు యశ్వంత్. తను కూడా మత్స్యకారుడే. ఇప్పుడు ఆ ప్రాంతపు సమూహం కోసం ఏర్పాటుచేసిన కడల్ ఒసై రేడియో స్టేషన్లో రేడియో జాకీగా కూడా పనిచేస్తున్నాడు.
రక్త దానానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమ ప్రసారానికి ముందుగా ఇస్తున్న ఈ వాతావరణ నివేదికను, ‘‘ప్రస్తుత ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. నీళ్లు బాగా తాగండి. ఎండలోకి వెళ్ళకండి’’ అన్న సూచనలతో ముగించాడు.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం కచ్చితంగా అవసరం. ఎందుకంటే పంబన్ దీవిలో గతంతో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు ఉండే రోజులు బాగా పెరిగాయి. యశ్వంత్ పుట్టిన 1996లో ఏడాదికి 32డిగ్రీల సెల్సియస్ , అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న రోజులు కనీసం 162 ఉండేవి. యశ్వంత్ వాళ్ల నాన్న ఆంటోని సామీ వాస్ పుట్టింది 1973లో. అప్పట్లో ఆ స్థాయి ఉష్ణోగ్రతలుండే రోజులు ఏడాదికి 125 కంటే ఎక్కువ ఉండేవి కావు. ఇప్పుడు సంవత్సరానికి 180 రోజులు వేడిగా ఉంటున్నాయని అంచనా. వాతావరణాన్ని అంచనా వేయగలిగే, భూతాపాన్ని కొలవగలిగే ఒక ఉపకరణం ద్వారా లెక్కించగా వచ్చిన ఈ వివరాల్ని ఈ జూలైలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆన్ లైన్లో ప్రచురించింది.
కేవలం వాతావరణం గురించి మాత్రమే కాదు, మొత్తంగా శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తున్న స్థూలమైన అంశాలను అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు యశ్వంత్, అతని సహోద్యోగులు. అలానే యశ్వంత్ తండ్రి, మిగిలిన మత్స్యకారులు మాత్రమే కాదు, పంబన్ దీవిలో ముఖ్యమైన రెండు పట్టణాలు పంబన్, రామేశ్వరంలకు చెందిన మొత్తం 83వేల మందీ వీరు చెప్పేది విని వాతావరణ మార్పులను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారు.









